వరంగల్ ఎంపీ సీటు విషయంలో కేసీఆర్ మదిలో ఏముందో?

ఇన్నాళ్లు ఓ వెలుగు వెలిగిన బీఆర్ఎస్ పార్టీ ప్రస్తుతం కష్టాల కడలి ఈదుతోంది. పార్టీని నమ్ముకుని ఎదిగిన వారే ప్రస్తుతం ఎవరి దారి వారు చూసుకుంటున్నారు.

Update: 2024-03-29 16:30 GMT

వరంగల్ లో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. పార్టీల ఉనికే ప్రశ్నార్థకంగా కనిపిస్తున్నాయి. ఇన్నాళ్లు ఓ వెలుగు వెలిగిన బీఆర్ఎస్ పార్టీ ప్రస్తుతం కష్టాల కడలి ఈదుతోంది. పార్టీని నమ్ముకుని ఎదిగిన వారే ప్రస్తుతం ఎవరి దారి వారు చూసుకుంటున్నారు. దీంతో పార్టీ ఒంటరిగా మిగిలిపోనుందని పలువురు రాజకీయ నిపుణుల అంచనా. దీంతో బీఆర్ఎస్ నేతల్లో గుబులు పట్టుకుంది.

ఇప్పటి వరకు పార్టీకి పెద్దన్న పాత్ర పోషించిన సీనియర్ నేత కడియం శ్రీహరి బీఆర్ఎస్ కు పెద్ద షాక్ ఇచ్చారు. పార్టీని వీడేందుకు సిద్ధమయ్యారు. తన కూతురుతో సహా కాంగ్రెస్ లో చేరి వరంగల్ ఎంపీ సీటుపై పోటీ చేయాలని ఆసక్తి ప్రదర్శిస్తున్నారు. దీంతో వరంగల్ ఎంపీ స్థానం ఎవరిదనే ప్రశ్నలు సహజంగానే వస్తున్నాయి. పార్టీలో అన్ని పదవులు అనుభవించి చివరకు హ్యాండ్ ఇచ్చేందుకు రెడీ కావడం ఆలోచనలను రేకెత్తిస్తోంది.

వరంగల్ ఎంపీ సీటుపై మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య సైతం పోటీకి సై అంటున్నారు. ఇక్కడ నుంచి కడియంపై పోటీకి సిద్ధమని ప్రకటించారు. దీంతో కేసీఆర్ ఏ నిర్ణయం తీసుకుంటారోననే అనుమానాలు అందరిలో వస్తున్నాయి. దీనిపై కేసీఆర్ తో భేటీ అవుతున్నారు. వరంగల్ నుంచి పోటీ చేస్తానని చెబుతున్నారు. గతంలో అసెంబ్లీ టికెట్ నిరాకరించడంపై కలత చెంది రాజీనామా చేసిన విషయం తెలిసిందే.

గతంలో స్టేషన్ ఘన్ పూర్ అసెంబ్లీ టికెట్ విషయంలో జరిగిన గొడవలో కేసీఆర్ కడియం వెంటే ఉన్నారు. ఇలాంటి సమయంలో కడియం హ్యాండ్ ఇవ్వడం కలకలం రేపుతోంది. ఇప్పుడు కేసీఆర్ వరంగల్ ఎంపీ సీటు విషయంలో ఎవరికి టికెట్ ఇస్తారు? ఎవరిని పోటీలో నిలుపుతారనే వాదనలు వస్తున్నాయి. దీంతో వరంగల్ ఎంపీ సీటు వ్యవహారం రసకందాయంలో పడనుందని అంటున్నారు.

Tags:    

Similar News