షాకింగ్‌ నివేదిక.. బెట్టింగ్‌ వల్ల పన్ను నష్టం ఇన్ని రూ.లక్షల కోట్లా?

మనదేశంలో అనైతిక పద్ధతుల్లో జరుగుతున్న బెట్టింగులు, గ్యాంబ్లింగ్‌ వల్ల ఏడాదికి సుమారు రూ.2 లక్షల కోట్ల మేర పన్ను నష్టం వాటిల్లుతోంది.

Update: 2023-10-20 07:40 GMT

మనదేశంలో బెట్టింగ్, గ్యాంబ్లింగ్‌ లు భారీ ఎత్తున జరుగుతున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా క్రికెట్‌ బెట్టింగులు ఎక్కువ. అందులోనూ ప్రస్తుతం 2023 వన్డే వరల్డ్‌ కప్‌ క్రికెట్‌ ప్రస్తుతం మనదేశంలోనే జరుగుతోంది. దీంతో బెట్టింగ్‌ రాయుళ్లు భారీ ఎత్తున అక్రమంగా పందేలు కాస్తున్నారు. వన్డే వరల్డ్‌ కప్‌ అనే కాకుండా గతం నుంచే బెట్టింగులు ఎక్కువగానే సాగుతున్నాయి.

కాగా షాకింగ్‌ విషయం వెల్లడైంది. మనదేశంలో అనైతిక పద్ధతుల్లో జరుగుతున్న బెట్టింగులు, గ్యాంబ్లింగ్‌ వల్ల ఏడాదికి సుమారు రూ.2 లక్షల కోట్ల మేర పన్ను నష్టం వాటిల్లుతోంది. థింక్‌ ఛేంజ్‌ ఫోరమ్‌ (టీసీఎఫ్‌) అనే సంస్థ నివేదిక వెల్లడించింది.

ముఖ్యంగా క్రీడల బెట్టింగులో అనధికారిక మార్గాల ద్వారా ఒక ఏడాదికి 100 బిలియన్‌ డాలర్లు (సుమారు రూ.8.2 లక్షల కోట్లు) వస్తున్నట్లు థింక్‌ ఛేంజ్‌ ఫోరమ్‌ తన అంచనాల్లో పేర్కొంది. డిజిటల్‌ మౌలిక సదుపాయాల అభివృద్ధి, స్మార్ట్‌ ఫోన్ల వినియోగం, గతంతో పోలిస్తే ప్రస్తుతం వివిధ క్రీడా కప్పులు, టోర్నమెంట్లు తరచూ జరుగుతుండటం, ఈవెంట్లు పెరగడంతో క్రీడా రంగంలోకి నిధుల ప్రవాహం అధికమవుతోందని వెల్లడించింది.

ముఖ్యంగా మనదేశంలో ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) సమయంలో బెట్టింగ్‌ కార్యకలాపాలు జోరుగా సాగుతున్నాయని థింక్‌ ఛేంజ్‌ ఫోరమ్‌ నివేదిక పేర్కొంది. ఐపీఎల్‌ సమయంలో ఈ సంఖ్య అమాంతం 37 కోట్ల వరకు చేరుతోందని టీసీఎఫ్‌ నివేదిక వివరించింది. అంచనాల ప్రకారం.. 14 కోట్ల మందికి పైగా భారతీయులు తరచూ బెట్టింగ్, జూదంలో పాల్గొంటున్నారని బాంబుపేల్చింది.

ఓవైపు బెట్టింగుపై నియంత్రణలు ఉన్నప్పటికీ దానికి అడ్డుకట్ట పడటం లేదని థింక్‌ ఛేంజ్‌ ఫోరమ్‌ తెలిపింది. దీంతో మన దేశంలో అక్రమ బెట్టింగ్, జూదం మార్కెట్‌ భారీగా పెరుగుతోందని బాంబుపేల్చింది. అక్రమ బెట్టింగ్, జూదం మార్కెట్‌ లోకి వస్తున్న రూ.8.2 లక్షల కోట్లపై ప్రస్తుత వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ) 28 శాతం విధిస్తే.. ఏడాదికి రూ.2,29,600 కోట్లు పన్ను రూపంలో ఖజానాకు చేరతాయని వెల్లడించింది. అయితే అక్రమ బెట్టింగ్, అనైతిక పద్ధతులతో ఈ మొత్తం ప్రభుత్వ ఖజానాకు చేరడం లేదని తెలిపింది.

ఈ నేపథ్యంలో అక్రమ బెట్టింగ్, జూదం కార్యకలాపాలను నియంత్రించేందుకు కొత్త జీఎస్‌టీ విధానాన్ని కఠినంగా అమలు చేయాలని థింక్‌ ఛేంజ్‌ ఫోరమ్‌ తెలిపింది. దీనికోసం ప్రత్యేక టాస్క్‌ ఫోర్స్‌ ఏర్పాటు చేయాలని సూచించింది. ముఖ్యంగా విదేశాల నుంచి జరుగుతున్న బెట్టింగ్‌ కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయాలని పేర్కొంది. బెట్టింగును నియంత్రించడానికి కఠిన చర్యలు లేకపోతే ప్రభుత్వానికి గణనీయ స్థాయిలో పన్ను నష్టం కలుగుతుందని వెల్లడించింది.

Tags:    

Similar News