ఇసుకలో టీడీపీ కూటమి ఫ్లాప్
ఇపుడు టీడీపీ కూటమి ప్రభుత్వంలోనూ అలాగే కొరుకుడు పడకుండా ఉందా అంటే జవాబు అవును అనే వస్తోంది.
ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వం అలా ఇలా ఏర్పడలేదు. కనీ వినీ ఎరుగని మెజారిటీతో గెలిచింది. మొత్తం 175 అసెంబ్లీ సీట్లు ఉంటే అందులో 164 సీట్లు కూటమికి వచ్చాయి అంటే జనాలు ఎంతటి విశ్వాసం పెట్టుకుని గెలిపించారు అన్నది కూడా ఇక్కడ చూడాల్సి ఉంటుంది. చంద్రబాబు అనుభవం, విజన్, పవన్ కల్యాణ్ నిత్య నూతన నాయకత్వం కలగలసి కూటమి ప్రభుత్వం ఏపీలో అద్భుతాలు సృష్టిస్తుందని అంతా భావించారు.
నిజానికి చూస్తే ఇంతటి భారీ మెజారిటీలు వచ్చినపుడు వాటిని మోయడం కూడా కష్టం. ఎన్నో అంచనాలు ఉంటాయి. వాటిని మీట్ కావాలీ అంటే అది అంత సులువు అయితే కాదు, అయినా సరే టీడీపీ కూటమి ప్రభుత్వం మెల్లగా వంద రోజుల పాలనను పూర్తి చేసింది.
కూటమి ప్రభుత్వం విజయాల మీద అలాగే కూటమి ప్రభుత్వం లో మైనస్ ల మీద ఒక రాజకీయ విశ్లేషణ సాగుతోంది. ఇక గత వైసీపీ ప్రభుత్వానికి అతి పెద్ద మచ్చగా మారి ఏకంగా ప్రభుత్వాన్ని ముప్ప తిప్పలు పెట్టిన ఇసుక వ్యవహారం ఇపుడు టీడీపీ కూటమి ప్రభుత్వంలోనూ అలాగే కొరుకుడు పడకుండా ఉందా అంటే జవాబు అవును అనే వస్తోంది.
ఇసుక విషయంలో గత ప్రభుత్వానికీ కూటమి ప్రభుత్వానికి తేడా ఏమీ లేదన్న నిట్టూర్పులు అయితే అంతటా వినిపిస్తున్నాయని అంటున్నారు. వైసీపీ సర్కార్ ఇసుక విషయంలో సరిగ్గా డీల్ చేయలేక చతికిలపడింది. ఫలితంగా ఎన్నో వర్గాలు ఇబ్బంది పడ్డాయి. ఒక దశలో ఇసుకే బంగారం అయి కూర్చుంది. ఇసుకాసుర దందాల్తో సామాన్యులు పేదలు కూడా ఇబ్బంది పడ్డారు.
రియల్టర్ల బాధలు అయితే చెప్పాల్సిన అవసరం లేదు. మరో వైపు చూస్తే ఇవన్నీ ఆలోచించిన ఈ వర్గాలు అన్నీ కూటమి మీదనే నమ్మకం పెట్టుకున్నాయి. ఎన్నో ఆశలతో భవన నిర్మాణ కార్మికులు సాధారణ ప్రజలు కూటమి ప్రభుత్వంలో ఇసుక ఉచితం అని అనుకున్నారు. కానీ గ్రౌండ్ లెవెల్ లో జరుగుతున్నది వేరు అని అంటున్నారు.
కూటమి ప్రభుత్వంలో ప్రజలకు అందుతున్న ఇసుక ధరలు జగన్ ప్రభుత్వంలో కంటే ఎక్కువగానే ఉన్నాయని విమర్శలు వినిపిస్తున్నాయి. ఇది అంతటా పెద్ద ఎత్తున చర్చగా ఉంది. బాబోయ్ ఈ ధరలేంటి అని జనాలు వాపోతున్నారు.
మామూలుగా అయితే చంద్రబాబు ఈ విషయంలో జాగ్రత్తగానే అన్నీ ఆలోచించి చేస్తారు అని అంతా నమ్ముతారు. కానీ ఈసారి ఎందుకో ఇసుక విషయంలో చంద్రబాబు అంతగా ఫోకస్ పెట్టలేదా అన్న సందేహాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. లేకపోతే ఉచిత ఇసుక అని అంటున్నా అది భారీగా ధరల మోత మోగించడమేంటి అని అంతా విస్తుపోయే పరిస్థితి ఉంది.
పేరుకు ఉచిత ఇసుక అయినా అది లబ్దిదారుల వద్దకు చేరేసరికి ధరల మోత ఒక రేంజిలో మోగుతోందని అంటున్నారు. ఇసుకే కదా అని గత ప్రభుత్వం ఎంతో నిర్లక్ష్యంగా ఉదాశీనంగా వ్యవహరించింది. చివరికి భారీ ఓటమిని మూటకట్టుకుంది. వైసీపీ ఘోర ఓటమి వెనక ఇసుక బాధితులు కూడా ఉన్నారు అన్నది వాస్తవం. ఇపుడు టీడీపీ కూటమి కూడా ఇసుక విషయంలో పూర్తిగా దృష్టి పెట్టాల్సి ఉంది అని అంటున్నారు. ఇసుక అన్నది ఈ రోజున చాలా ముఖ్య పాత్ర పోషిస్తోంది. ఇది రాజకీయ దినుసుగా కూడా విపక్షాలకు మారుతోంది. సో కూటమి ఈ విషయంలో అలెర్ట్ గా ఉండాల్సిందే అని అంటున్నారు.