పోలవరం ఎత్తు... వైసీపీ టీడీపీ పై ఎత్తు

దేశానికి స్వాతంత్రం లభించి ఎనభైయేళ్ళు దగ్గర పడుతున్నా ఇంకా పూర్తి కాని కలల ప్రాజెక్ట్ గా ఉంది.

Update: 2024-11-01 00:30 GMT

ఎనభయ్యేళ్ల వయసు ఉన్న పోలవరం ఎప్పటికి పూర్తి అవుతుంది అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న. ఎందుకంటే పోలవరం విషయంలో జరుగుతున్న జాప్యం అలాంటిది. పోలవరం బ్రిటిష్ వారి హయాంలో పుట్టిన ఆలోచన. దేశానికి స్వాతంత్రం లభించి ఎనభైయేళ్ళు దగ్గర పడుతున్నా ఇంకా పూర్తి కాని కలల ప్రాజెక్ట్ గా ఉంది.

పోలవరం ప్రాజెక్ట్ విషయంలో పాలకులు ఎవరు ఉన్నా విపక్షాలు దాన్ని ఆసరగా చేసుకుని విమర్శలు చేస్తూ ఉంటాయి. పోలవరం ప్రాజెక్ట్ విషయంలో డిజైన్లు మార్చేస్తున్నారు అని ఎత్తు తగ్గిస్తున్నారు అని గత అయిదేళ్ల వైసీపీ ప్రభుత్వం మీద అప్పటి ప్రతిపక్షం టీడీపీ విమర్శలు చేస్తూ వచ్చింది.

ఇపుడు ఆ చాన్స్ వైసీపీ తీసుకుంటోంది. పోలవరం ప్రాజెక్ట్ ఎత్తుని తగ్గిస్తున్నారు అంటూ వార్తలు వస్తున్నాయి. దాంతో దీని మీద ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వైసీపీ ఘాటుగా రియాక్ట్ అయింది. వైసీపీ అధినేత జగన్ అయితే ఏకంగా ట్విట్టర్ ద్వారానే చంద్రబాబు తో పోలవరం మీద యుద్ధం ప్రకటించేశారు.

పోలవరం ఎత్తు విషయంలో తగ్గించేస్తున్నారని అయినా చంద్రబాబు స్పందించడం లేదని వైసీపీ అధినేత ప్రశ్నించారు. రాష్ట్ర భవిష్యత్తుకు అత్యంత కీలకమైన పోలవరం ఎత్తు తగ్గింపు విషయంలో ఎందుకు చేతులెత్తేస్తున్నారని జగన్ సూటిగానే ప్రశ్నించారు. పోలవరం ప్రాజెక్టు గరిష్ట ఎత్తు 45.72 మీటర్లకే సవరించిన అంచనాలకు ఒప్పించాలని అంటూ ఆయన లేటెస్ట్ గా డిమాండ్ చేశారు.

వాస్తవానికి చూస్తే పోలవరం పోలవరం గరిష్ట ఎత్తు 45.72 మీటర్లుగా డిజైన్ చేశారు. అయితే దానిని 41.15 మీటర్లకే పరిమితం చేస్తూ ఎత్తుని తగ్గించేస్తున్నారు అని వైసీపీ ఆరోపిస్తోంది. దీని వల్ల ఏకంగా 194.6 టీఎంసీలు ఉండాల్సిన నీటినిల్వ 115 టీంఎసీలకే పడిపోతుందని నిపుణులు కూడా చెబుతున్నారు. దీంతో పోలవరం నుంచి సాగు నీరు తాగునీరు కూడా సామర్థ్యం తగ్గిపోయి చాలా జిల్లాలకు నష్టం వస్తుందని అంటున్నారు.

ఇక గోదావరికి భారీ ఎత్తున వరద వస్తే తప్ప కుడి, ఎడమ కాల్వలకు పూర్తి స్థాయిలో నీటిని విడుదల చేయలేని పరిస్థితి కూడా ఈ ఎత్తు తగ్గింపు వల్ల వస్తుందని అంతున్నారు. అంతేకాదు ఏకంగా గోదావరి డెల్టా ప్రాంతంలో పంటలకు పక్కాగా నీళ్లు ఇవ్వలేని పరిస్థితి ఏర్పడుతుందని అంటున్నారు. పోలవరం కట్టామంటే కట్టామని చెప్పుకోవడం తప్పించి బహుళార్ధక సాధక ప్రాజెక్ట్ కి న్యాయం జరగదని అంటున్నరు. అయితే దీని మీద వైసీపీ మాత్రం టీడీపీ కూటమి ప్రభుత్వాన్ని విమర్శిస్తోంది.

రాష్ట్రానికి జీవనాడి, పోలవరం విషయంలో చంద్రబాబు నష్టం చేస్తున్నారని వైసీపీ అధినేత జగన్ విమర్శలు సంధించారు. గతంలో స్పిల్‌వేను పూర్తిచేయకుండా కాపర్‌డ్యాంలు మొదలుపెట్టారు. వీటిని పూర్తిచేయకుండానే ఖాళీలు వదిలేసి డయాఫ్రం వాల్‌ కట్టారని ఆరోపించారు.

ఇక చూస్తే కనుక వైసీపీ హయాంలో స్పిల్‌వే, స్పిల్‌ఛానల్, అప్రోచ్‌ఛానల్‌, ఎగువ కాఫర్‌డ్యాం, దిగువ కాఫర్‌ డ్యాం ఇలా కీలకమైన పనులన్నీ పూర్తిచేశామని ఆయన చెప్పుకున్నారు. అయితే ఇపుడు కూటమి ప్రభుత్వం కొట్టుకుపోయిన ఆ డయాఫ్రం వాల్‌ను పూర్తిచేసి, ఎర్త్‌కం రాక్‌ఫిల్‌డ్యాంను కట్టడంతోపాట మిగిలిన నిర్వాసితులకు ఆర్‌ అండ్‌ ఆర్‌ ప్యాకేజీని ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. అయింతే అధికారంలోకి రాగానే ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గించడానికి సరే అనడమేంటి అని ఆయన విమర్శిస్తున్నారు.

కేంద్ర ప్రభుత్వాన్ని పోలవరం ప్రాజెక్టు గరిష్ట ఎత్తు 45.72 మీటర్లకే సవరించిన అంచనాలకు ఒప్పించి, నిర్వాసితులందరికీ న్యాయం చేసి పూర్తిచేయండని కోరారు. మరో వైపు చూస్తే చంద్ర‌బాబు నాయుడుపై వైసీపీ సీనియ‌ర్‌ నాయకుడు, రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి ఎక్స్ ట్విట్ట‌ర్‌ వేదిక‌గా విమ‌ర్శ‌లు చేశారు. పోల‌వ‌రం ప్రాజెక్టు చంద్ర‌బాబుకు ఏటీఎంగా మారిందంటూ విమ‌ర్శించారు. అధికారంలోకి రావడమే ఆలస్యంగా పోలవరం ప్రాజెక్టు ఎత్తును తగ్గించి రాష్ట్ర ప్రజలకు చంద్ర‌బాబు ద్రోహం చేస్తున్నారని ఆయ‌న‌ పేర్కొన్నారు.

అయితే దీని మీద జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు కౌంటర్ ఇచ్చారు. పోలవరం ప్రాజెక్టు ఎత్తును 41.15 మీటర్లకు కుదించిన ఘనత గత వైసీపీ ప్రభుత్వానిదే అని హాట్ కామెంట్స్ చేశారు. అంతే కాదు 2022 జనవరిలో పోలవరం ప్రాజెక్టు ఫేజ్ రెండు మూడు అంటూ 41.15 మీటర్ల ఎత్తున ప్రతిపాదిస్తూ అప్పటి స్పెషల్ సి.ఎస్. పోలవరం ప్రాజెక్టు అథారిటీ సి.ఇ.ఓ.కు లేఖ రాశారని గుర్తు చేశారు.

తమ ప్రభుత్వం ఒకే ఫేజ్ గా పోలవరం పూర్తి చేస్తునని ఆయన అన్నారు. సుప్రీంకోర్టు, గోదావరి ట్రిబ్యునల్ అనుమతించిన మేరకు 150 అడుగుల మేర నీటిని నిల్వ చేసే విధంగా 45.72 మీటర్ల ఎత్తున ప్రాజెక్ట్ నిర్మాణానికి రూ.55,545 కోట్లకు టెక్నికల్ ఎడ్వైజరీ కమిటీ ఆమోదాన్ని కూడా పొందాయన్నారు అంతే కాదు ఈ విషయంలో వైసీపీ దుష్ప్రచారం చేస్తోంది అని ఆయన అన్నారు. ఇంతకీ పోలవరం విషయంలో ఎవరి వాదన కరెక్ట్, అసలు ఏమి జరుగుతోంది అన్నదే చర్చగా ఉంది.

Tags:    

Similar News