మంత్రి పార్ధసారథిపై కార్యకర్తల తిరుగుబాటు

ఏపీ సమాచార శాఖ మంత్రి పార్ధసారథి వైఖరిపై టీడీపీ కార్యకర్తలు మండిపడుతున్నారు.

Update: 2025-01-13 13:06 GMT

ఏపీ సమాచార శాఖ మంత్రి పార్ధసారథి వైఖరిపై టీడీపీ కార్యకర్తలు మండిపడుతున్నారు. ఆయన వ్యవహారశైలితో విసిగిపోతున్న నాయకులు, కార్యకర్తలు రాజీనామా బాట పడుతున్నారు. ఆయన సొంత నియోజకవర్గానికి చెందిన 500 మంది కార్యకర్తలు ఒకేసారి రాజీనామా చేయడం టీడీపీలో పెరుగుతున్న అసంతృప్తికి సంకేతంగా చెబుతున్నారు.

కొద్దిరోజుల క్రితం మంత్రి నియోజకవర్గమైన నూజివీడులో సర్దార్ గౌతు లచ్చన్న విగ్రహావిష్కరణలో వైసీపీ నేత జోగి రమేశ్ ను ఆహ్వానించడమే కాకుండా ఆయనతో మంత్రి వేదిక పంచుకోవడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. పార్టీ కార్యదర్శి బుద్ధా వెంకన్నతో సహా పార్టీ కార్యకర్తలు, సోషల్ మీడియా యాక్టివిస్టులు మంత్రిపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. దీనిపై పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి లోకేశ్ స్పందించి పార్ధసారథి వివరణ తీసుకున్నారు. ఇక ఆ తర్వాత మంత్రి పార్ధసారథి తనను క్షమించాలని బహిరంగంగా వేడుకున్నారు. ఈ ఎపిసోడును అంతా మరచిపోతున్నారనగా, మరోసారి మంత్రి తీరును నిరసిస్తూ కార్యకర్తలు రాజీనామా చేయడం సంచలనంగా మారింది.

ఏలూరు జిల్లా చాట్రాయిమండలం నరసింహరాయుని పేటకు చెందిన టీడీపీ కార్యకర్తలు మంత్రి పార్థసారథి తమను నిర్లక్ష్యం చేస్తున్నారనే ఆవేదనతో పార్టీకి రాజీనామా చేశారు. ఆ గ్రామంలో 40 ఏళ్లుగా పార్టీలో కొనసాగుతున్నవారిని కాదని, ఇటీవల వైసీపీ నుంచి వచ్చిన వారిని ప్రోత్సహిస్తున్నారని సీనియర్ కార్యకర్తలు ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికే టీడీపీకి చెందిన వారి పట్టాదారు పాసుపుస్తకాలను రద్దు చేసి వైసీపీ నేతలకు కట్టబెట్టారని మంత్రిపై విమర్శలు వినిపిస్తున్నాయి. ఇక పుండుపై కారం జల్లినట్లు వైసీపీ నుంచి వచ్చిన ఓ స్థానిక నేతకు సహకార బ్యాంకు చైర్మన్ పదవిని ఇవ్వడం టీడీపీ కార్యకర్తల ఆగ్రహానికి కారణమైంది. దీంతో అంతా రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో పార్టీ అధిష్ఠానం కంగుతిన్నదని చెబుతున్నారు.

పెనమలూరు నియోజకవర్గానికి చెందిన మంత్రి పార్దసారథి ఎన్నికల ముందే టీడీపీలోకి వచ్చారు. ఆయనకు నూజివీడు టికెట్ ఇచ్చి గెలిపించింది పార్టీ. అంతేకాకుండా పార్టీలోకి వచ్చిన వంద రోజుల్లోపే మంత్రి పదవిని కట్టబెట్టింది. ఇంతవరకు అధిష్ఠానం మాటకు కట్టుబడి పనిచేసిన నేతలకు పార్థసారథి మంత్రి అయ్యాక కష్టాలు మొదలయ్యాయని అంటున్నారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కంటే ఇప్పుడే ఎక్కువ నష్టం చేస్తున్నారని వాపోతున్నారు. తమ ఆవేదనను తెలియజేస్తూ అధిష్ఠానానికి లేఖలు రాసినా ఫలితం లేదనే ఆవేదనతో సోమవారం రాజీనామా నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.

ఉమ్మడి క్రిష్ణా జిల్లాలో సీనియర్ బీసీ నేత కావడంతో పార్ధసారథికి మంత్రి పదవి ఇచ్చారు సీఎం చంద్రబాబు. అయితే ఆయన తీరుతో సొంత పార్టీ కార్యకర్తలే నలిగిపోవడంతో పార్టీ ఇరకాటంలో పడిపోతోంది. ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో అన్ని సీట్లను కూటమి గెలుచుకుంది. అయితే ఈ ఏడు నెలల్లో మంత్రి, స్థానిక ఎమ్మెల్యేలు సమన్వయం లేక కార్యకర్తల పనులు జరగడం లేదని అసంతృప్తి చెందుతున్నారు. ఉమ్మడి జిల్లాలో తిరువూరు, నూజివీడుతోపాటు కీలకమైన గన్నవరం, గుడివాడ నియోజకవర్గాల్లో వైసీపీ నేతలకు అనుకూలంగా మంత్రి వ్యవహరిస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. గన్నవరంలో మట్టి మాఫియాను కాపాడే ప్రయత్నం చేయడంతోపాటు గుడివాడలోనూ కొడాలి అనుచరులకు వంత పాడుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. మరోవైపు మచిలీపట్నంలో మాజీ మంత్రి పేర్ని విషయంలో పార్థసారథి ప్రమేయంపైనా పార్టీలో చర్చ జరుగుతోంది.

Tags:    

Similar News