డిప్యూటీ సీఎం : సీనియర్లు వర్సెస్ జూనియర్లు!
అలా నాటి నుంచి నేటి వరకూ వారు పార్టీలో ప్రభుత్వంలో కీలకమైన పాత్ర పోషిస్తూ వస్తున్నారు సీనియర్ నేతలు పెద్దగా లేని ప్రభుత్వం 2024లోనే ఏర్పాటు అయింది.
టీడీపీ అంటేనే నాలుగు దశాబ్దాలు నిండిన పార్టీగా ఉంది. ఆ పార్టీలో ఈ రోజున ఉన్న మెజారిటీ ప్రముఖ నాయకుల సగటు వయసు ఆరు దశాబ్దాలు పై దాటి ఉంటుంది. పాతికేళ్ళ వయసులో రాజకీయాల్లోకి వచ్చిన వారంతా అన్న ఎన్టీఆర్ ప్రభంజనంలో ఎమ్మెల్యేలుగా మంత్రులుగా అయిపోయారు. అలా నాటి నుంచి నేటి వరకూ వారు పార్టీలో ప్రభుత్వంలో కీలకమైన పాత్ర పోషిస్తూ వస్తున్నారు సీనియర్ నేతలు పెద్దగా లేని ప్రభుత్వం 2024లోనే ఏర్పాటు అయింది. టీడీపీ చరిత్రలో ఇది ఒక విశేషంగా చెప్పాల్సి ఉంది.
తెలుగుదేశం ప్రభుత్వం అనగానే కనిపించే మంత్రుల జాబితా పెద్దది. వారంతా దశాబ్దాలుగా జనాలకు పరిచయం అయిన వారే. ఇపుడు మాత్రం దాదాపుగా ఎనభై శాతం కొత్తవారితోనే నింపేశారు. దీంతో సీనియర్లకు అవకాశాలు ఒక్కసారిగా లేకుండా పోయాయి.
నిజానికి చాలామంది సీనియర్లకు ఈ సారి చివరి చాన్స్ గా భావించిన నేపథ్యం ఉంది. తాము ఈసారి మంత్రులుగా అధికారంలో ఉంటూ తమ వారసులను వచ్చే ఎన్నికలకు తయారు చేసి సంతృప్తిగా రాజకీయ జీవితం ముగిద్దామని అనుకున్నారు. కానీ జరిగింది వేరుగా ఉండడంతో సీనియర్లు ఎవరూ నోరెత్తలేని పరిస్థితి ఉందని అంటున్నారు.
ఈ నేపధ్యంలో చాలా మంది సీనియర్ల నుంచి మెల్లగా అసంతృప్తి అప్పుడప్పుడు వస్తోంది. ఆ మధ్యన కాకినాడ పోర్టు విషయంలో బీసీలకు అన్యాయం జరిగిందంటూ మాజీ ఆర్థిక మంత్రి యనమల రామక్రిష్ణుడు బహిరంగ లేఖ రాసి అలా తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. టీడీపీ ప్రభుత్వం అంటే ఆయనే ఆర్ధిక మంత్రి అన్న ముద్ర ఉంది. ఈసారి ఆయనకు ఎమ్మెల్సీగా ఉన్నా చాన్స్ అయితే దక్కలేదు.
ఇక అదే గోదావరి జిల్లాలకు చెందిన మరో సీనియర్ నేత, మాజీ మంత్రి గోరంట్ల బుచ్చయ్యచౌదరి కూడా తన పొలిటికల్ కెరీర్ మొత్తంలో అతి తక్కువ సమయం మంత్రిగా చేసారు. ఆయనకు ఈసారి చాన్స్ వస్తే హ్యాపీగా రిటైర్ అయి ఉండేవారు. కానీ అది జరగలేదు దాంతో ఆయన కూడా కొంత ఇబ్బంది పడుతున్నారా అన్న చర్చ ఉంది.
ఉమ్మడి విశాఖ జిల్లాకు చెందిన ఇద్దరు సీనియర్ నేతలు మాజీ మంత్రులకు కూడా మంత్రి పదవి దక్కలేదు. అందులో అయ్యన్నపాత్రుడికి స్పీకర్ ఇచ్చి రాజ్యాంగ పదవిని అప్పగించారు. మరో మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుకు అయితే ఏ నామినేటెడ్ పదవీ దక్కలేదు అని అంటున్నారు. అలాగే మరో సీనియర్ ఉత్తరాంధ్ర నేత మాజీ మంత్రి కిమిడి కళా వెంకట రావుకు కూడా బిగ్ షాట్ అప్పటి మంత్రి అయిన బొత్స సత్యనారాయణను ఓడించినా కూడా మినిస్టర్ పోస్టు దక్కలేదు అన్న బాధ ఉంది అంటారు.
ఇవన్నీ ఇలా ఉంటే పార్టీలో మూడు సార్లు పదవులు అనుభవించిన వారిని పక్కన పెట్టి కొత్త వారికి చాన్స్ ఇవ్వాలని లోకేష్ పదే పదే అంటున్నారు. అది కూడా సీనియర్లకు కొంత ఇబ్బందిగా ఉంది అని అంటున్నారు. దీంతో తమ వారసులకు అయినా అవకాశాలు వస్తాయా అన్న ఆలోచనలతో కొంతమంది ఉంటే మరికొంతమంది మాత్రం తమ అభిప్రయాలను గట్టిగానే బయటకు చెబుతున్నారు.
లేటెస్ట్ గా స్పీకర్ అయ్యన్నపాత్రుడు డిప్యూటీ సీఎం పదవి లోకేష్ కి ఇవ్వాలన్న దాని మీద మాట్లాడుతూ ఈ డిమాండ్ చేయడానికి పార్టీ నాయకులు ఎవరు అని ప్రశ్నించారు. రాజకీయ డిమాండ్లు చేస్తే పదవులు వస్తాయా అని ఆయన వ్యాఖ్యానించారు. లోకేష్ కి ఏ పదవి ఇవ్వాలో నిర్ణయించాల్సింది నాయకులు కాదని ప్రజలు అని అయ్యన్న వ్యాఖ్యానించడంతో అది కాస్తా వైరల్ అయింది.
ఆయన వ్యాఖ్యలు అలా ఉండగానే మరో సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి కూడా ఇదే విషయం చెప్పారు. చంద్రబాబు సీఎం గా ఉన్నంత వరకూ మరో ఆలోచన కానీ మరొకరి విషయం కానీ చర్చకు రాదు అని అన్నారు. అంతటితో ఆయన ఆగకుండా డిప్యూటీ సీఎం అన్న ఆలోచన సరైనది కాదని అన్నారు. ఇప్పటికే డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ ఉన్నారని గుర్తు చేశారు.
టీడీపీ కూటమి గెలుపునకు లోకేష్ కష్టపడి పనిచేశారని దానికి ప్రతిఫలంగా ఆయనకు ప్రభుత్వంలో మంత్రిగా సముచితమైన స్థానం దక్కిందని ఆయన గుర్తు చేశారు. టీడీపీ నాయకులు విషయాలు తెలుసుకోకుండా డిప్యూటీ సీఎం వాదన తీసుకుని రావడం కరెక్ట్ కాదని గోరంట్ల అన్నారు.
మొత్తానికి చూస్తే టీడీపీలో జూనియర్ నేతలు అంతా లోకేష్ కి డిప్యూటీ సీఎం ఇవాలని కోరుతూ వస్తూంటే సీనియర్ నేతలు మాత్రం ఆ వాదనను పక్కన పెడుతున్నారు. లోకేష్ కి డిప్యూటీ సీఎం అన్నది ఇపుడు అంశం కానే కాదని వారు అనుభవపూర్వకంగా మాట్లాడుతున్నారు.
లోకేష్ అయితే తనకు ఏ పదవి పార్టీ అప్పగించినా చేస్తాను తాను సాధారణ కార్యకర్తను అని పదే పదే చెబుతున్నారు. అయితే డిప్యూటీ సీఎం లోకేష్ కి ఇపుడు ఇస్తేనే సరైన సమయం అని పార్టీలో యంగ్ వింగ్ అంటోంది. మరి సీనియర్లు అయితే రాజకీయ సమతూకంతో మాట్లాడుతున్నారు. మొత్తంగా చూస్తే ఈ వివాదం ఇంకా కొనసాగుతుందా లాజికల్ ఎండ్ అవుతుందా అన్నది చూడాల్సి ఉంది.