సాలూరు తమ్ముళ్లకు ఒకటే మాట.. చంద్రబాబు ఏం తేల్చారంటే..!
2024 అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి టీడీపీ ప్రతి అడుగు ఆచి తూచి వేస్తున్న విషయం తెలిసిందే.
2024 అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి టీడీపీ ప్రతి అడుగు ఆచి తూచి వేస్తున్న విషయం తెలిసిందే. అయితే.. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో తమ్ముళ్ల మధ్య వివాదాలు.. విభేదాలు కొనసాగుతున్నాయి. ఒకరంటే ఒకరు పైచేయిగా వ్యవహరించడం.. ఆధిపత్యరాజకీయాలకు తెరదీయడం తెలిసిందే. ఈ క్రమంలో పలు నియోజకవర్గాల్లో అధికార పార్టీపై పోరాడాల్సిన నాయకు లు.. వారిలో వారే కుమ్ములాడుకుంటున్న పరిస్థితి టీడీపీలోనూ కనిపిస్తోంది. దీంతో ఆయా నియోజకవర్గాల్లో పరిస్థితిని చక్కదిద్దేందుకు స్వయంగా చంద్రబాబు రంగంలోకి దిగారు.
ఇలా.. ఉమ్మడి విజయనగరం జిల్లాలోని ఎస్టీ రిజర్వ్‌డ్ నియోజకవర్గం సాలూరుపై ఆయన ప్రత్యేక దృష్టి పెట్టారు. గత 3 ఎన్నికల్లోనూ ఈ నియోజకవర్గంలో టీడీపీ జెండా ఎగరడం లేదు. 2009లో కాంగ్రెస్ తరఫున ఇక్కడ విజయం దక్కించుకున్న పీడిక రాజన్నదొర 2014, 2019 ఎన్నికల్లో వైసీపీ తరఫున జెండా ఎగరేశారు. మొత్తానికి ఈ మూడు ఎన్నికల్లో ఆయనే గెలిచారు. ఇక, టీడీపీ విషయానికి వస్తే.. 1994, 1999, 2004 ఎన్నికల్లో టీడీపీ వరుస విజయాలు దక్కించుకుంది. అంటే 2004లో వైఎస్ హవాను తట్టుకుని మరీ నిలబడింది. ఇక, ఇక్కడ నుంచి రాజేంద్రప్రతాప్ భంజ్‌దేవ్ గెలిచారు.
అయితే.. భంజ్‌దేవ్ ఇప్పటికీ టీడీపీలోనే ఉన్నా.. ఆయనపై గిరిజనేతరుడు అనే కేసు నమోదైంది. ఇది ఇంకా కొనసాగుతోంది. దీంతో ఆయన వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు అర్హుడు కాకుండా పోయారు. ఈ నేపథ్యంలో టీడీపీ ఇంచార్జ్‌గా సంధ్యారాణికి టికెట్ ఇవ్వాలని చంద్రబాబు భావిస్తున్నారు. ఇదే విషయాన్ని ఇటీవల చర్చించారు కూడా. అయితే.. తనతో నిత్యం వివాదాలు పెట్టుకుని.. పార్టీ కార్యక్రమాలకు కూడా దూరంగా ఉంటున్న సంధ్యారాణికి టికెట్ ఇవ్వొద్దంటూ.. భంజ్‌దేవ్ రగడ పెడుతున్నారు. కానీ, వాస్తవానికి తాను సీనియర్ కావడంతో తన వర్గానికి చెందిన వారికే టికెట్ ఇవ్వాలనేది ఆయన వ్యూహం.
మొత్తానికి ఈ వివాదంతో సాలూరులో టీడీపీ పరిస్థితి నాలుగు అడుగులు ముందుకు.. మరో నాలుగు అడుగులు వెనక్కి అన్న చందంగా మారిపోయింది. దీంతో చంద్రబాబు తాజాగా అందరినీ పిలిచి వార్నింగ్ ఇచ్చారు. సంధ్యారాణికి టికెట్ ఇచ్చే విషయాన్ని ఆయన చూచాయగా చెప్పేశారు. అయితే.. అందరినీ కలుపుకొని పోవాలని ఆమెకు.. సీనియర్లు పార్టీలో వివాదాలు సృష్టించేందుకుకాదని.. పార్టీని నడిపించేందుకు అనుభవం ఉపయోగపడాలని భంజ్ దేవ్‌కు చురకలు అంటించినట్టు ఎన్టీఆర్ భవన్ వర్గాలు పేర్కొన్నాయి. మొత్తానికి సాలూరుపై క్లారిటీ ఇచ్చినా.. అంతర్గత వివాదాల సర్దుబాటు.. చేతులు కలిపే నాయకులు ఏమేరకు ఇక్కడ పాగా వేస్తారనేది చూడాలి.