ఎంపీ అభ్యర్దులు ఎవరు.....టీడీపీకి అతి పెద్ద సమస్య
తెలుగుదేశం పార్టీ వయసు నలభై రెండేళ్ళు. ఎన్నో ఎన్నికలను చూసింది.
తెలుగుదేశం పార్టీ వయసు నలభై రెండేళ్ళు. ఎన్నో ఎన్నికలను చూసింది. 1982లో పార్టీ పెట్టాక తొమ్మిది అసెంబ్లీ ఎన్నికలు, పది పార్లమెంట్ ఎన్నికలను టీడీపీ ఎదుర్కోంది. ఏనాడూ టీడీపీకి అభ్యర్ధుల కొరత అయితే లేదు. అయితే 2024 ఎన్నికల్లో మాత్రం ఎంపీ అభ్యర్ధుల కోసం వెతుకులాట తప్పడంలేదు. దాంతో తెలుగుదేశం అధినాయకత్వం దీని మీద మల్లగుల్లాలు పడుతోంది
శ్రీకాకుళం నుంచి మొదలెడితే అనంతపురం దాకా ఎంపీ అభ్యర్ధుల సమస్య తెలుగుదేశం పార్టీని పట్టి పీడిస్తోంది. 2019 ఎన్నికల్లో పోటీ చేసిన వారిలో చాలా మంది పార్టీని వీడిపోయారు. ఉన్న వారిలో ఎక్కువ మంది అసెంబ్లీకే తమ ఓటు అంటున్నారు. ఇక 2019లో టీడీపీ మూడు ఎంపీ సీట్లను గెలిచింది. అందులో ముగ్గురూ ఈసారి పోటీకి నో అనే సీన్ ఉంది.
శ్రీకాకుళం ఎంపీగా ఉన్న కింజరాపు రామ్మోహన్ ఈసారి నరసన్నపేట నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తాను అంటున్నారు. దాంతో అక్కడ ఎంపీ సీటుకు క్యాండిడేట్ ని వెతకాల్సి ఉంది. అలాగే విజయనగరం ఎంపీగా పోటీ చేసిన కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు ఎమ్మెల్యేకి పోటీ చేస్తున్నారు. దాంతో ఈ సీట్లో ఎవరిని దింపాలో అర్ధం కావడంలేదు, రెండు మూడు పేర్లు అనుకున్నా వారెవరూ సుముఖంగా లేరని టాక్.
విశాఖ ఎంపీ సీటుని శ్రీ భరత్ కే ఇవ్వాలని పార్టీ చూస్తోంది. కానీ ఆయన భీమిలీ ఎమ్మెల్యేగా పోటీకి ఉత్సాహం చూపుతున్నారు. అనకాపల్లి నుంచి 2019లో పోటీ చేసి ఓడిన విశాఖ డైరీ చైర్మన్ ఆడారి ఆనంద్ ఇపుడు వైసీపీలో ఉన్నారు. అక్కడ కూడా వాంటింగ్ ఉంది అని అంటున్నారు. అరకు ఎంపీగా గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిన కేంద్ర మాజీ మంత్రి కిశోర్ చంద్రదేవ్ రాజకీయాల నుంచే తప్పుకున్నారు. దాంతో అరకు ఎంపీ ఎవరు అన్నది అతి పెద్ద ప్రశ్నగా ఉంది.
రాజమండ్రీ నుంచి గత ఎన్నికల్లో సిట్టింగ్ ఎంపీ మురళీమోహన్ కోడలు మాగంటి రూప పోటీ చేసి ఓడారు. ఆ తరువాత ఆ ఫ్యామిలీ రాజకీయాలకు నో చెప్పేసింది. దాంతో ఈసారి ఎవరా అన్నది తెలియడంలేదు.
కాకినాడ నుంచి గత ఎన్నీకల్లో టీడీపీ నుంచి పోటీ చేసిన చలమలశెట్టి సునీల్ వైసీపీలోకి వెళ్లిపోయారు. ఇక్కడ ఎవరిని దించాలో కూడా సమస్యగా ఉంది.
నరసాపురం నుంచి పోటీ చేసిన కలువపూడి శివ ఎమ్మెల్యేగా ఈసారి పోటీకి తయారుగా ఉన్నారు. అమలాపురం ఎంపీ అభ్యర్ధిగా లోక్ సభ మాజీ స్పీకర్ బాలయోగి కుమారుడుకి గత ఎన్నికల్లో టికెట్ ఇచ్చారు. ఆయన ఓడారు. ఈసారి ఎవరికి ఇస్తారో చూడాలి.
ఏలూరు ఎంపీ టికెట్ కి మాగంటి బాబు తప్ప మరో క్యాండిడేట్ కనిపించడంలేదు. గుంటూరు ఎంపీగా ఉన్న గల్లా జయదేవ్ ఈసారి ఆసక్తి చూపించడంలేదు. ఇస్తే తన సొంత జిల్లా చిత్తూరు లోని చంద్రగిరి నుంచి ఎమ్మెల్యే టికెట్ ని ఆయన కోరుకుంటున్నారు అని టాక్. నరసారావుపేటకు 2019లో రాయపాటి సాంబశివరావు పోటీ చేసి ఓడారు. ఈసారి ఆయన ఫ్యామిలీకి ఇస్తారా లేక కొత్త వారిని దించుతారా అన్నది చూడాల్సి ఉంది.
క్రిష్ణా జిల్లా విషయానికి వస్తే విజయవాడ ఎంపీ సీటును సిట్టింగ్ ఎంపీ కేశినేని నానికి ఇస్తారా లేక ఆయన సోదరుడు చిన్నికి ఇస్తారా అన్నది తేలడంలేదు. మచిలీపట్నం నుంచి కొనకళ్ల నారాయణ ఆప్షన్ గా ఉన్నారు. కానీ టీడీపీ అన్వేషణ ఇక్కడా సాగుతోంది అని అంటున్నారు.
ఇక నెల్లూరు ఎంపీగా పోటీ చేసిన మాజీ మంత్రి శిద్ధా రాఘరావు వైసీపీలో చేరిపోయారు. అక్కడ కూడా కొత్త ముఖాన్ని చూడాల్సి ఉంది. అలాగే నెల్లూరు నుంచి బీద రవిచంద్రను పోటీకి 2019లో దించారు. ఈసారి ఆయన ఎమ్మెల్యేగానే పోటీ చేస్తాను అంటున్నారు. కర్నూల్ ఎంపీగా 2919 ఎన్నికల్లో పోటీ చేసిన కోట్ల సూర్యప్రకాష్ రెడ్డిని వయోభారం దృష్ట్యా పక్కన పెడతారు అని అంటున్నారు. దాంతో ఇక్కడ కూడా చూసుకోవాల్సి ఉంది.
కడప నుంచి 2019లో ఎంపీగా పోటీ చేసిన మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి ప్రస్తుతం బీజేపీలో ఉన్నారు. ఈ సీటు కూడా ఎంపీ క్యాండిడేట్ ఎవరు అన్నది పెద్ద చర్చగా ఉంది. అనంతపురంలో జేసీ దివాకరెడ్డి కుమారుడు అస్మిత్ రెడ్డి 2019లో పోటీ చేసి ఓడారు. ఆయన ఎమ్మెల్యే సీటు కావాలని కోరుతున్నారుట. ఇదే తీరులో హిందూపురం, రాజంపేట, చిత్తూరు జిల్లాలోని రెండు సీట్లు, బాపట్ల లోక్ సభ సీట్లు ఉన్నాయి.
అంగబలం అర్ధం బలం ఉన్న వారికే టికెట్లు ఇస్తే అసెంబ్లీకి కూడా అది ఉపయోగంగా ఉంటుందని చంద్రబాబు భావిస్తున్నారు. కానీ అది ఆచరణలో కత్తి మీద సాము అవుతోంది. టీడీపీలో ఎమ్మెల్యే టికెట్లకు ఉన్న పోటీ ఎంపీ టికెట్లకు లేకపోవడంతో ఏం చేయాలో అధినాయకత్వానికి అర్ధం కావడంలేదు అని అంటున్నారు.