బీజేపీ చెలగాటం...టీడీపీకి ప్రాణ సంకటం

కేంద్రంలో బీజేపీ మూడవసారి వరసగా అధికారంలోకి వచ్చింది. అయితే బీజేపీ ఈసారి సొంతంగా మ్యాజిక్ ఫిగర్ కి చేరుకోలేదు.

Update: 2024-08-17 07:13 GMT

కేంద్రంలో బీజేపీ మూడవసారి వరసగా అధికారంలోకి వచ్చింది. అయితే బీజేపీ ఈసారి సొంతంగా మ్యాజిక్ ఫిగర్ కి చేరుకోలేదు. టీడీపీ జేడీయూ వంటి మిత్ర పక్షాలతో కలసి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అయినా సరే బీజేపీ దూకుడు ఎక్కడా ఆగడంలేదు. బీజేపీ చేసిన కేంద్ర మంత్రి వర్గ విస్తరణను మొదలు చూసుకుంటే అన్నింటా పై చేయిగానే నిలిచింది. కీలక మంత్రిత్వ శాఖలు అన్నీ తన పార్టీకే తీసుకుంది. ఇక ఇటీవల ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ లో సైతం ఏపీకి బీహార్ కి ఏదో ఇచ్చినట్లుగా చూపించింది కానీ నిజానికి ప్రభుత్వం ఏర్పాటుకు సహకరిస్తున్న పార్టీలకు ఆ స్థాయిలో సాయం అయితే లేదన్న మాట ఉంది.

బీహార్ లో మిత్రపక్షం జేడీయూ ప్రత్యేక హోదాను అడిగినా చాలా ఈజీగా పక్కన పెట్టేసింది. ఏపీకి సంబంధించి కీలకమైన అమరావతి రాజధానికి ప్రపంచ బ్యాంక్ నుంచి రుణం ఇప్పిస్తామని చెబుతోంది కానీ 48 లక్షల కోట్లతో ప్రవేశపెట్టిన బడ్జెట్ నుంచి కనీసం ఆ పదిహేను వేల కోట్లను స్పెషల్ గ్రాంట్ గా ఇవ్వలేకపోయింది అన్న విమర్శలు ఉన్నాయి.

మరో వైపు చూస్తే బీజేపీ తన అజెండా మేరకు పాలన చేయాలని డిసైడ్ అయింది. బీజేపీ రెండు టెర్ములలో కొన్ని పనులు చేయగలిగింది అంటే సొంత మెజారిటీ ఉండబట్టి. ఈసారి మిత్రులు ఉన్నారు. కానీ బీజేపీ ఏ మాత్రం సందేహాలు పెట్టుకోకుండా వక్ఫ్ బోర్డు చట్ట సవరణకు పూనుకుంది. అయితే అన్ని పార్టీలు వ్యతిరేకించడం వల్లనే అది జాయింట్ పార్లమెంటరీ కమిటీ ముందుకు వెళ్లింది.

ఇక స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రధాని మోడీ ఎర్ర కోట మీద ప్రసంగం చేస్తూ ఉమ్మడి పౌర స్మృతి గురించి ప్రస్తావించారు. అలాగే న్యాయ సంస్కరణలు గురించి కూడా పేర్కొన్నారు. ఇందులో ఉమ్మడి పౌర స్మృతి అన్నది బీజేపీ అజెండాలో ముఖ్యమైనది. ఈ దేశంలో అందరికీ ఒకటే న్యాయం ఒక్కటే చట్టం ఉండాలన్నదే బీజేపీ విధానం.

ఈ దేశంలో కొన్ని మతాలకు పర్సనల్ లా ఉంది. వారికి కోర్టులు ఇచ్చే తీర్పులు వర్తించవు. అలాంటివి ఉండకూడదని బీజేపీ ఎప్పటి నుంచో చెబుతూ వస్తోంది. ఇపుడు బీజేపీ ఆ పని మీదనే ఉండబోతోంది అని అంటున్నారు. అయితే ముస్లిం సమాజానికి ఇది ఇబ్బందికరంగా ఉంటుంది అని అంటున్నారు. ఉమ్మడి పౌర స్మృతి కనుక అమలు అయితే పర్సనల్ లా అన్నది ఉండది. దాంతో ముస్లింలు దీనిని వ్యతిరేకించడం ఖాయం.

మరి ఈ వివాదస్పదమైన బిల్లుకు బీజేపీకి పార్లమెంట్ లో మద్దతు దొరుకుతుందా అన్నది ఒక చర్చ. అంతే కాదు మిత్రులుగా ఉన్న టీడీపీ జేడీయూ సంగతి ఏమిటి అన్నది కూడా ప్రశ్నలుగా ముందుకు వస్తున్నాయి. బీజేపీకి మైనారిటీలతో పెద్దగా ఇబ్బందిలేదు కానీ టీడీపీకి ఆ వర్గం ఓట్లు కావాలి.అలాగే జేడీయూ కూడా ఆలోచిస్తుంది.

ఇలాంటి బిల్లుల విషయంలో తాము అన్నీ ఆలోచిస్తామని టీడీపీ నేతలు అంటున్నారు. దేశంలో అన్ని వర్గాల ఆమోదం తీసుకుంటేనే తప్ప ఇలాంటి బిల్లులను ప్రవేశపెట్టకూడదు అన్నది జేడీయూ విధానం. మొత్తానికి చూస్తే బీజేపీ హిందూత్వ విధానాలను అమలు చేస్తామని అంటే టీడీపీ జేడీయూ తీవ్రంగా వ్యతిరేకించే అవకాశాలు ఉన్నాయి.

అలాంటపుడు బీజేపీ సర్కార్ కి మద్దతు ఉపసంహరించుకునే దాకా ఈ వ్యవహారం వెళ్తుందా అన్నది కూడా చూడాలని అంటున్నారు. బీజేపీ అయితే తెగే దాకా లాగుతుందా అన్న ప్రశ్నలూ ఉన్నాయి. బీజేపీ ఈ విషయంలో గట్టి పట్టుదల మీద ఉంటే మాత్రం కచ్చితంగా మిత్రుల మధ్య ఇబ్బందులు విభేదాలు రావడం ఖాయమని అంటున్నారు. ఏది ఏమైనా బీజేపీకి ఈ అయిదేళ్ళూ చాలా కీలకం అని అంటున్నారు. అంతే కాదు మళ్లీ హిందూత్వ విధానమే శరణ్యం అన్నట్లుగా ఆ పార్టీ వైఖరి ఉన్న వేళ మాత్రం కేంద్రంలో సంచలన రాజకీయమే చోటు చేసుకోవచ్చు అని అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.

Tags:    

Similar News