సిక్కోలు టీడీపీ లెక్క పక్కా... ఎనీ డౌట్స్...?

తెలుగుదేశం పార్టీ గతానికి భిన్నంగా సీట్ల ఎంపికలో యమ జోరు చూపిస్తోంది. ఈసారి ఆరు నెలల ముందు నుంచే టికెట్లు ఇచ్చేయాలని చూస్తోంది.

Update: 2023-09-01 03:00 GMT

తెలుగుదేశం పార్టీ గతానికి భిన్నంగా సీట్ల ఎంపికలో యమ జోరు చూపిస్తోంది. ఈసారి ఆరు నెలల ముందు నుంచే టికెట్లు ఇచ్చేయాలని చూస్తోంది. చాలా చోట్ల అఫీషియల్ గా అనౌన్స్ మెంట్ ఇవ్వడంలేదు కానీ లోపాయికారిగా నేతలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది అని ప్రచారం సాగుతోంది. అలా టికెట్ కన్ ఫర్మ్ అని తేలుతున్న వారు జాగ్రత్తగా తమ నియోజకవర్గాలలో తమ పని చేసుకుని పోతున్నారు.

ఇక ఏపీలో ఈ వైపు నుంచి చూస్తే మొదటి జిల్లాగా ఉన్న ఉమ్మడి శ్రీకాకుళంలో మొత్తం పది అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. ఇందులో మూడు నాలుగు తప్ప అన్నింటికీ అభ్యర్ధులను టీడీపీ ఎంపిక చేసిందని అంటున్నారు. ముందుగా చూస్తే ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ కింజరాపు అచ్చెన్నాయుడు టెక్కలి నుంచి టీడీపీ తరఫున నాలుగవసారి పోటీ చేయనున్నారు.

అలాగే 2019లో టెక్కలితో పాటు టీడీపీ గెలుచుకున్న మరో కంచుకోట లాంటి సీటు ఇచ్చాపురం. ఇక్కడ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే బెందాళం అశోక్ కి మళ్ళీ పోటీకి చాన్స్ ఇచ్చేశారు. దాంతో ఆయన దూసుకునిపోతున్నారు. ఆముదాలవల టికెట్ శ్రీకాకుళం జిల్లా టీడీపీ ప్రెసిడెంట్ కూన రవికుమార్ కి ఇచ్చేసినట్లే. ఆయన తన మేనమామ వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే కం స్పీకర్ అయిన తమ్మినేని సీతారాం తో ముచ్చటగా మూడవసారి ఢీ కొట్టబోతున్నారు.

శ్రీకాకుళం అసెంబ్లీ సీటుని మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవికి కేటాయించారని తెలుస్తోంది. సో ఆమె కూడా హుషార్ గా నియోజకవర్గంలో తిరుగుతున్నారు. మాజీ మంత్రి గుండ అప్పలసూర్యనారాయణ ఇదే సీటు నుంచి అనేక సార్లు గెలిచారు. వివిధ మంత్రిత్వ శాఖలు నిర్వహించారు. 2014లో ఫస్ట్ టైం లక్ష్మీదేవి పోటీ చేసి గెలిచారు. అయిదేళ్ళ పాటు నియోజకవర్గంలో బాగానే పనిచేశారు. కానీ జగన్ వేవ్ తో పాటు పార్టీలో వర్గ పోరు వల్లనే ఆమె ఓడారు అని అంటారు. ఇపుడు అన్నీ సెటిల్ చేసుకుని మరీ బరిలోకి దిగుతున్నారు అని అంటున్నారు.

రాజాం టికెట్ ని మాజీ మంత్రి కోండ్రు మురళీమోహన్ రావుకు కేటాయించారు అని తెలుస్తోంది. ఆయన టీడీపీలోకి వచ్చి 2019 ఎన్నికలో పోటీ చేసి టఫ్ ఫైట్ ఇచ్చారు. కానీ జగన్ వేవ్ లో ఓడారు. ఈసారి గెలుపు పక్కా అని ఆయన వర్గం ధీమాగా ఉంది. ఇక్కడ మాజీ స్పీకర్ ప్రతిభాభారతి తన కుమార్తె గ్రీష్మకు టికెట్ ని కోరుతున్నారు. కానీ బలమైన నేతగా కోండ్రునే టీడీపీ గుర్తించి టికెట్ ఇస్తోందని అంటున్నారు. గ్రీష్మకు నెక్స్ట్ టైం బెటర్ లక్ చెబుతున్నారుట.

పలాస టికెట్ విషయంలో కూడా కన్ఫర్మేషన్ వచ్చింది అని అంటున్నారు మాజీ మంత్రి గౌతు శ్యామసుందర శివాజీ కుమార్తె గౌతు శిరీషకు టికెట్ కేటాయించారని అంటున్నారు. 2019 ఎన్నికల్లో శిరీష పోటీ చేశారు. కానీ జగన్ వేవ్ లో ఓడారు. అయితే ఈసారి గెలుపు పక్కా అని ఆమె రంగంలోకి దిగుతున్నారు. గౌతు ఫ్యామిలీ నేపధ్యం, బీసీ ఓటు బ్యాంక్ తమకు శ్రీరామ రక్ష అని ఆమె వర్గం భావిస్తోంది.

ఇక మిగిలిన సీట్లు చూస్తే పాలకొండలో నిమ్మల జయక్రిష్ణకు ఎన్ని సార్లు టికెట్ ఇచ్చినా ఓటమి పాలు అవుతున్నారు. దాంతో ఆయన ప్లేస్ లో కొత్త ముఖాన్ని వెతకాలని పార్టీ అనుకుంటోంది అని ప్రచారం సాగుతోంది. జయక్రిష్ణ పాలకొండ టీడీపీ ఇంచార్జిగా ఉన్నారు. తమ నేతకే టికెట్ అని అనుచరులు చెబుతున్నారు చాలా మంది ఆశావహులు ఇక్కడ ఉన్నారు. కొత్తగా కొంతమంది ముందుకు వస్తున్నారు.

అదే విధంగా ఎచ్చెర్ల టికెట్ విషయంలో కూడా డెసిషన్ తీసుకోవాల్సి ఉంది అంటున్నారు. ఇక్కడ మాజీ మంత్రి కిమిడి కళా వెంకటరావు పోటీ చేయాలని చూస్తున్నారు. అయితే కొత్త ముఖంగా కలిశెట్టి అప్పలనాయుడు ఉన్నారు. ఆయనను ఆ మధ్య రాజమండ్రిలో జరిగిన మహానాడులో పనితీరు బాగుందని చంద్రబాబే స్వయంగా సత్కరించారు. ఇటు సీనియర్ నేత, అటు జూనియర్ నేత మధ్యలో ఎచ్చెర్ల ఉంది. డెసిషన్ పెండింగులో పెట్టారని అంటున్నారు.

అలాగే నరసన్నపేట టికెట్ కూడా పెండింగులో ఉంది. ఇక్కడ మాజీ ఎమ్మెల్యే భగ్గు లక్ష్మణరావుకు టికెట్ అనుకున్నా సీనియర్ నేత మాజీ ఉప ముఖ్యమంత్రి ధర్మాన క్రిష్ణదాస్ ని ఓడించే బిగ్ ఫిగర్ కోసం అన్వేషణ సాగుతోంది అంటున్నారు ఇదే సీటు మీద శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహనరావు కన్ను కూడా పడడంతో టికెట్ ఎవరికి అన్నది తేలడానికి మరికొంత టైం పట్టే అవకాశం ఉంది అంటున్నారు.

అలాగే పాతపట్నం సీటు విషయంలో కూడా ఇద్దరు నేతల మధ్య పోటీ ఉంది. మాజీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణ ఇంచార్జిగా ఉన్నా మామిడి గోవిందరావు అనే నేత కూడా టికెట్ ఆశిస్తున్నారు. ఈయనకు జిల్లాలోని పెద్ద లీడర్ల ఆశీస్సులు ఉన్నాయని అంటున్నారు. ఈ మధ్య వంశధార ప్రాజెక్ట్ పరిశీలన చంద్రబాబు వచ్చినపుడు కలమటనే తన పక్కన కూర్చోబెట్టుకున్నారు. దాంతో ఆయనకు టికెట్ కన్ ఫర్మ్ అని ఆయన వర్గం అంటోంది. దీంతో ఇక్కడ ఎవరికి టికెట్ అన్నది మాత్రం పెండింగులో పెట్టారు అంటున్నారు. సో మెజారిటీ సీట్లలో టీడీపీ అభ్యర్ధులను కన్ ఫర్మ్ చేసుకుని మిగిలిన పార్టీల కంటే ఈ విషయంలో పై చేయిగా ఉందని అంటున్నారు.

Tags:    

Similar News