చెప్పుతో కొట్టుకున్న టీడీపీ కౌన్సిలర్‌.. అంద‌రూ చూస్తుండగానే రీజ‌నేంటి?

దీంతో రామరాజు తీవ్ర‌ ఆవేదన వ్యక్తం చేశారు. సమావేశంలోనే చెప్పుతో తనకు తాను కొట్టుకొని నిరసన తెలిపారు.

Update: 2023-07-31 12:23 GMT

ఆయ‌న టీడీపీ కౌన్సిల‌ర్‌. ప్ర‌జ‌ల‌తో ఎన్నుకోబ‌డిన ప్ర‌జాప్ర‌తినిధి. అది స్థానిక‌మా.. అసెంబ్లీనా అనేది ప‌క్క‌న బెడితే.. ప్ర‌జలు వేసిన ఓటుతోనే ఆయ‌న కూడా ఎన్నిక‌య్యారు. అయితే..ఆయ‌న అంద‌రూ చూస్తుండ‌గానే.. నిండు కౌన్సిల్‌లో చెప్పుతోకొట్టుకుని.. నిర‌స‌న వ్య‌క్తం చేశారు.

దీంతో ఒక్క‌సారిగా స‌ద‌రు కౌన్సిల్ స‌మావేశం వేడెక్కింది. ఇంత‌కీ ఎక్క‌డ జ‌రిగింది? ఎందుకు జ‌రిగింది? అనేది ఆస‌క్తిగా మారింది.

అనకాపల్లి జిల్లా నర్సీపట్నం మునిసిపాలిటీ కౌన్సిల్‌ సమావేశం సోమ‌వారం జ‌రిగింది. ఈ స‌మ‌యంలో కౌన్సిల్ చైర్మ‌న్‌గా ఉన్న చైర్ ప‌ర్స‌న్ వైసీపీ నాయ‌కురాలు.. సుబ్బ‌ల‌క్ష్మి ప్ర‌శ్నోత్త‌రాల స‌మ‌యంలో ప్రారంభించారు.

ఈ క్ర‌మంలో టీడీపీకి చెందిన కౌన్సిల‌ర్ రామ‌రాజు మాట్లాడుతూ.. న‌ర్సీప‌ట్నం కౌన్సిల్ ఏర్ప‌డి సుమారు 30 నెలలు గడిచినప్పటికీ తన సొంత వార్డులో తాగునీటి కొళాయి కూడా వేయించుకోలేని దుస్థితి ఏర్ప‌డింద‌ని అన్నారు. దీనికి చైర్ ప‌ర్స‌న్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ప్ర‌భుత్వం నిధులు ఇస్తే.. కేటాయిస్తామ‌ని.. చెప్పారు.

దీంతో రామరాజు తీవ్ర‌ ఆవేదన వ్యక్తం చేశారు. సమావేశంలోనే చెప్పుతో తనకు తాను కొట్టుకొని నిరసన తెలిపారు. నర్సీపట్నం మున్సిపల్ సమావేశం మున్సిపల్ చైర్ పర్సన్ సుబ్బలక్ష్మి ఈ ఘ‌ట‌న‌తో ఒక్కసారిగా నివ్వెర పోయారు. ఇక‌, ఈ ఘ‌ట‌న త‌ర్వాత‌.. తెలుగుదేశం సభ్యులు పలు అంశాలను లేవనెత్తి అపరిష్కృతంగా ఉన్నాయంటూ చైర్ ప‌ర్స‌న్‌ను చుట్టుముట్టారు.

దీంతో స‌భ‌లో ఒక్క‌సారిగా గంద‌ర‌గోళం త‌లెత్త‌డంతో పోలీసుల‌ను పిలిచారు. అనంతరం స‌భ‌ను వాయిదావేశారు. ఈ సంద‌ర్భంగా ప‌లువురు టీడీపీ కౌన్సిల‌ర్లు మాట్లాడుతూ.. స‌ర్కారు నిధులు ఇవ్వ‌క‌పోగా.. ప‌న్నులు కూడా దోచుకుంటోంద‌ని ఆరోపించారు.

Tags:    

Similar News