వైసీపీ డిప్యూటీ ని ఢీకొంటున్న గంటా...?

గంటా ని పోటీకి దింపడం ద్వారా మాడుగులతో పాటు పక్క నియోజకవర్గాల లో సీట్లను కూడా గెలుచుకోవడానికి టీడీపీ ప్లాన్ చేస్తోంది అని అంటున్నారు.

Update: 2023-07-29 03:00 GMT

మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు వచ్చే ఎన్నికల్లో ఎక్కడ నుంచి పోటీ చేస్తారు అన్న దాని మీద ఒక పెద్ద చర్చ సాగుతోంది. ఎందుకంటే గంటా డిఫరెంట్ పొలిటీషియన్. ఆయన పొలిటికల్ కెరీర్ తీసుకుంటే పోటీ చేసిన చోట నుంచి మళ్లీ పోటీ చేసి ఎరగరు. అలాగే ఆయన కు ఓటమన్నది లేదు. బహుశా అదే ఆయన సక్సెస్ మంత్ర అని కూడా అంటారు.

ఇకపోతే 2019 ఎన్నికల్లో జగన్ వేవ్ ని సైతం తట్టుకుని గంటా విశాఖ నార్త్ నుంచి గెలిచారు. ఆయన 2024 ఎన్నికల కు ప్రిపేర్ అవుతున్నారు. అంతే కాదు టీడీపీ లో కూడా యాక్టివ్ గా ఉంటున్నారు. గంటా ఈసారి కొత్త నియోజకవర్గం కోసం తీవ్రంగా వెతుకుతున్నారని ప్రచారం సాగుతోంది.

ఎమ్మెల్యేగా గెలిచినా నాలుగేళ్ల తరువాత కూడా గంటా విశాఖ నార్త్ కి వెళ్లలేదు అని విమర్శలు ఉన్నాయి. అదే సమయం లో అక్కడ వైసీపీ క్యాండిడేట్ కేకే రాజు నిత్యం కలియతిరుగుతున్నారు. దాంతో గంటా విశాఖ ఉత్తరం నుంచి ఈసారి పోటీకి సుముఖత వ్యక్తం చేయడంలేదు అని అంటున్నారు.

ఆయన భీమిలీ నుంచి మళ్లీ పోటీకి దిగుతారు అని వార్తలు వస్తున్నా అది జనసేన పట్టుబడుతున్న సీటు కావడంతో ఆయన చూపు పూర్తిగా రూరల్ వైపు మళ్ళింది అని అంటున్నారు. అక్కడ కూడా ఆయన అనకాపల్లి, చోడవరం సీట్ల మీద దృష్టి పెట్టారు అని అంటున్నారు.

అయితే ఆయా సీట్లలో చాలా మంది రేసు లో ఉన్నారు. పైగా ఇంచార్జిలు కూడా గట్టిగా ఉన్నరు. దాంతో ఆయన చూపు ఏకంగా మాడుగుల సీటు మీద పడింది అని అంటున్నారు. మాడుగుల ఒకనాడు టీడీపీ కి కంచుకోట. కానీ గత రెండు ఎన్నికలుగా వరస గా ఓడుతూ వస్తోంది. అక్కడ వైసీపీ గెలుస్తోంది. ఆ పార్టీ నుంచి డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు విజయం సాధిస్తున్నారు.

మాడుగుల లో టీడీపీ కి బహు నాయకత్వం వర్గ పోరు ప్రధాన సమస్యలుగా ఉన్నాయి. ధీటైన అభ్యర్ధి ఉంటే కనుక మాడుగుల మళ్లీ సైకిలెక్కి కూర్చుంటుంది. ఇక ఇదే సీటు నుంచి ఆరేడు సార్లు రెడ్డి సత్యనారాయణ అనే సీనియర్ టీడీపీ నేత గెలిచి పసుపు పార్టీకి బలమైన పునాదులు వేసారు. అందువల్ల మాడుగుల విషయం లో ఎవరి ని పోటీకి పెట్టాలన్న దాని మీద టీడీపీ తర్జన భర్జన పడుతోంది.

ఈ టైం లో గంటా చూపు ఆ సీటు మీద పడింది అని అంటున్నారు. అంగబలం అర్ధ బలం పుష్కలంగా ఉన్న గంటా కనుక రంగం లోకి దిగితే మాడుగుల హల్వా టీడీపీకే దక్కుతుంది అని అంటున్నారు. మరో వైపు చూస్తే రెండు సార్లు గెలిచిన బూడి ముత్యాల నాయుడు మీద వ్యతిరేకత జనాల్లో ఉంది. కానీ టీడీపీ వీక్ గా ఉండడం వల్లనే ఆయన మరోసారి గెలుస్తారు అని సర్వేలు చెబుతున్నాయి.

కానీ గంటా వంటి బిగ్ షాట్ ఫీల్డ్ లోకి దిగితే మాత్రం బూడి ఆపసోపాలు పడాల్సిందే అని అంటున్నారు. అయితే ఇక్కడ ఒక విషయం ఉంది. అదే సామాజిక సమీకరణలు. ఈ నియోజకవర్గం లో వెలమల సంఖ్య ఎక్కువ. వారిదే ఆధిపత్యం. ఇప్పటిదాకా ఎవరు గెలిచినా ఆ సామాజిక వర్గం వారే ఉంటారు. అయితే 2004లో మాత్రం కాపు సామాజికవర్గానికి చెందిన కరణం ధర్మశ్రీ గెలిచారు. దాంతో కాపులు కూడా గణనీయంగా ఉన్న ఈ సీట్లో కష్టపడితే టీడీపీ క్యాడర్ హుషార్ చేస్తే గెలుపు అన్నది సాధ్యమే అంటున్నారు.

ఇక మంచి వ్యూహకర్త అయిన గంటా కనుక ఒక్కసారి నియోజకవర్గంలో అడుగు పెడితే అంతా మారిపోతుందని కూడా అంటున్నారు. మొత్తానికి గంటా ని పోటీకి దింపడం ద్వారా మాడుగులతో పాటు పక్క నియోజకవర్గాల లో సీట్లను కూడా గెలుచుకోవడానికి టీడీపీ ప్లాన్ చేస్తోంది అని అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.

Tags:    

Similar News