వలంటీర్ల పై చంద్రబాబు కీలక నిర్ణయం!
ఇటీవల ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ముందు టీడీపీ, జనసేన కూటమి అధికారంలోకి వస్తే వలంటీర్ వ్యవస్థను ఎత్తేస్తారని వైసీపీ తీవ్రంగా ప్రచారం చేసింది.
ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల చెంతకే చేర్చడానికి గ్రామ, వార్డు వలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ప్రతి 50 ఇళ్లకు ఒక వలంటీర్ చొప్పున నియమించారు. వీరి ద్వారా వివిధ ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల గుర్తింపు, ప్రభుత్వ సేవల వివరాలను తెలియజేస్తూ వచ్చారు.
ఇటీవల ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ముందు టీడీపీ, జనసేన కూటమి అధికారంలోకి వస్తే వలంటీర్ వ్యవస్థను ఎత్తేస్తారని వైసీపీ తీవ్రంగా ప్రచారం చేసింది. వలంటీర్లు రాష్ట్రవ్యాప్తంగా 2.30 లక్షల మంది ఉండటంతో టీడీపీ, జనసేన అధినేతలు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ అప్రమత్తమయ్యారు. తాము అధికారంలోకి వచ్చినా వలంటీర్ వ్యవస్థను రద్దు చేయబోమని స్పష్టం చేశారు. అంతేకాకుండా జగన్ ప్రభుత్వం వలంటీర్లకు నెలకు రూ.5 వేలే ఇచ్చిందని.. తాము అధికారంలోకి వస్తే నెలకు రూ.10 వేలు చొప్పున ఇస్తామని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ప్రకటించారు.
అయితే కూటమి అధికారంలోకి వచ్చి దాదాపు మూడు నెలలవుతున్నా ఇంతవరకు వలంటీర్ల విషయం తేల్చడం లేదు. ప్రధానంగా వలంటీర్లను గత ప్రభుత్వం ఇంటి వద్దే లబ్ధిదారులకు పింఛన్ల పంపిణీకి వాడుకుంది. ప్రతి నెలా 1నే వలంటీర్ల ద్వారా లబ్ధిదారులకు గత ప్రభుత్వం పెన్షన్ ఇచ్చింది.
అయితే కూటమి అధికారంలోకి వచ్చాక గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది, ఇతర ఉద్యోగుల ద్వారా పింఛన్ల పంపిణీ చేస్తోంది. ఎలాంటి ఇబ్బందులు లేకుండా నెలలో మొదటి రెండు రోజుల్లోనే పింఛన్ల పంపిణీని కూటమి ప్రభుత్వం పూర్తి చేసింది. అంతేకాకుండా పించన్ ను ఒకేసారి రూ.1000 పెంచింది.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తమను పట్టించుకోకపోవడంతో వలంటీర్లు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని ఎమ్మెల్యేలు, మంత్రులకు వినతిపత్రాలు అందజేశారు.
కాగా ఎన్నికల ముందు లక్ష మందికి పైగా వలంటీర్లతో వైసీపీ నేతలు రాజీనామాలు చేయించారు. ఎన్నికల ప్రక్రియలో వలంటీర్లను వాడుకోవద్దంటూ ఎన్నికల సంఘం ఆదేశాలు ఇచ్చింది. దీంతో ఎన్నికల ప్రచారంలో వలంటీర్ల సేవలను వాడుకుని లబ్ధి పొందడానికి వైసీపీ నేతలు వారితో రాజీనామా చేయించారు. మళ్లీ తామే అధికారంలోకి వస్తామని.. అప్పుడు తిరిగి వలంటీర్లుగా తీసుకుంటామని భరోసా ఇచ్చారు.
వైసీపీ నేతల మాటలు నమ్మిన వలంటీర్లు తమ ఉద్యోగాలకు రాజీనామా చేసి వారి తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. అయితే వైసీపీ అధికారంలోకి రాకపోవడంతో వలంటీర్లు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమను విధుల్లోకి తీసుకోవాలని ఎమ్మెల్యేలు, మంత్రులకు మొర పెట్టుకుంటున్నారు. వైసీపీ నేతల ఒత్తిళ్లు, బెదిరింపులతోనే తమ ఉద్యోగాలకు రాజీనామా చేశామని చెబుతున్నారు.
ఈ నేపథ్యంలో గ్రామ, వార్డు సచివాలయాల శాఖ డైరెక్టర్ శివప్రసాద్ కీలక ప్రకటన చేశారు. వలంటీర్లను కొనసాగిస్తామని తెలిపారు. వారి సేవలను వాడుకుంటామన్నారు. అలాగే గత రెండు నెలలుగా నిలిచిపోయిన వారి జీతాలను కూడా చెల్లిస్తామని ప్రకటించారు. ఈ మేరకు ఆర్థిక శాఖకు జీతాలకు సంబంధించిన ప్రతిపాదనలు పంపామని చెప్పారు. అలాగే ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు వారికి నెలకు రూ.10 వేలు ఇస్తామని వెల్లడించారు. దీంతో వలంటీర్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఉద్యోగాలకు రాజీనామా చేసినవారిని తిరిగి తీసుకునే ఉద్దేశంతో ప్రభుత్వం లేదని తెలుస్తోంది.