ఏపీలో విపక్షాలకు కొదవ లేదు. అన్నీ అన్నే ఉన్నాయి. అధికార వైసీపీకి ఒక్కటంటే ఒక్క మిత్ర పక్షం లేదు. సో అన్నీ ప్రతిపక్షాల కిందనే లెక్క. ఇందులో ఘనత వహించిన ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అయిన టీడీపీ ఉంది. దాని అధినాయకుడు చంద్రబాబు ఢక్కామెక్కీలు తిన్న రాజకీయ నేతగా పేరు తెచ్చుకున్నారు.
ఆయన ఎప్పటికి ఏది వీలు అయితే దానికి తగినట్లుగా తన ఎత్తులు రాజకీయాలు వేయగలరు. బాబుకు అధికారంలో ఉన్నపుడు కంటే విపక్షంలో ఉన్నపుడే ఇంకా జోరు పెరుగుతుంది. ఆయనే స్వయంగా చెప్పుకున్నట్లుగా సంక్షోభాలను ఆయన సవాళ్ళుగా తీసుకుంటారు. వాటికి అధిగమించడం బాబుకు ఎపుడూ ఒక సరదా అయిన చాలెంజిగా ఉంటుంది.
ఇక బాబు ఏపీలో గత నాలుగేళ్ళుగా టీడీపీని ముందుకు తీసుకురావడానికి శత విధాలుగా ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. 2019లో టీడీపీ పని అయిపోయింది అనుకున్న వారికి ఈ రోజున టీడీపీ గ్రాఫ్ చూస్తే బాబు పడిన కష్టం ఏంటో కచ్చితంగా అర్ధం అవుతుంది. మరో వైపు చూస్తే లోకేష్ ఈ ఎన్నికల్లో కీలక పాత్ర పోషించాలని చంద్రబాబు అనుకున్నారు.
దానికి తగినట్లుగానే చినబాబు ఎండలను వానలను లెక్కచేయకుండా వేల కిలోమీటర్ల పాదయాత్ర చేస్తున్నారు. ఒక విధంగా చినబాబు పట్టుదలతో చేస్తున్న పాదయాత్ర ఆ పార్టీకి అతి పెద్ద ధీమాను ఇస్తోంది. కానీ పాదయాత్ర వల్ల కొత్తగా పెరిగిన పొలిటికల్ మైలేజ్ అయితే టీడీపీకి కనిపించడంలేదు. అలగే బాబు సొంత పార్టీని ఈ రోజుకు ముందుకు తీసుకుని రాగలిగారు కానీ పార్టీని పూర్తి స్థాయిలో జనాలకు కనెక్ట్ చేయడంలో ఇంకా చాలా దూరం వెళ్లాల్సి ఉంది అని అంటున్నారు.
మరో విపక్షం ఉంది. అదే జనసేన. జనసేనకు ప్లస్ పాయింట్లు ఎక్కువగా ఉన్నా వాటిని వాడుకోవడంలేదు అని అంటున్నారు. పవన్ కళ్యాణ్ణి రాజకీయంగా ఫ్రెష్ గా చూడకపోయినా అధికారంలోకి రాని పార్టీగా ఆ కొత్తదనం ఆయనకు ఎపుడూ ఉంటుంది. ఇక ఆయనకు ఉన్న సినీ గ్లామర్ వెనక ఉన్న బలమైన సామాజికవర్గం అన్నీ అనుకూలతలే. కానీ పవన్ కళ్యాణ్ జనసేనను నడుపుతున్న తీరు. ఆయన విధానపరంగా తీసుకునే నిర్ణయాలలో స్పష్టత లోపించడం వల్లనే ఇబ్బందులు వస్తున్నాయని అంటున్నారు.
ఇక కమ్యూనిస్టులు కాంగ్రెస్ తీరు సరే సరి. బీజేపీది ఏపీలో ఒక నామమాత్రపు పాత్ర గానే ఉంది. సరే ఏపీలో చాలా పార్టీలు ఉన్నాయి. వాటికి అంటూ తాము అనుకుంటున్న సిద్ధాంతాలు ఉన్నాయి. కానీ ఈ పార్టీల వద్ద ఉన్న అస్త్రాలు ఏంటి, అధికార పార్టీ వైసీపీని దించేందుకు ఉన్న వ్యూహాలు ఏంటి ప్రజలను తమ వైపునకు తిప్పుకునేందుకు అవసరం అయిన ప్లాన్స్ ఏంటి అన్నవే తెలియడం లేదు అంటున్నారు.
ఏపీ ప్రభుత్వం సంక్షేమ పథకాల మీద విమర్శలు గట్టిగా చేయ్లకేపోతున్నారు. అప్పులు తెచ్చారని అంటున్నారు. కానీ తాము వస్తే అప్పు తేమని హామీలు ఇవ్వలేకపోతున్నారు. అలాగే సంక్షేమ పధకాలు ఎత్తివేస్తామని అభివృద్ధి తమ అజెండా అని ప్రగతికి బ్రాండ్ అంబాసిడర్ గా పేరు పొందిన బాబు నోటి వెంట రావడంలేదు. ఇక విభజన హామీలు తొమ్మిదేళ్ళుగా పడకేసినా కేంద్రం మీద అద్భుతమైన పోరాటం చేస్తామని ఏపీని ఆదుకుంటామని చెప్పడంలేదు.
పొరుగున ఉన్న తెలంగాణా నుంచి లక్షల కోట్ల విలువ చేసే ఆస్తులకు ఆదాయాన్ని లెక్కించి ఏపీకి తెస్తామని నిబ్బరంగా అనలేకపోతున్నాయి. వీటికి మించి కూడా ఏపీలో ప్రతిపక్షాలు అగ్రెస్సివ్ గా మాట్లాడవచ్చు. ఆ స్కోప్ ఉంది. ప్రత్యేక హోదా మీద కేంద్రాన్ని ఎదిరించి అయినా తెస్తామని చెప్పవచ్చు. కానీ ఏమీ చెప్పకుండా కేవలం జగన్ దిగిపోవాలి అంటూ ఒకే ఒక్క స్లోగన్ తో జనం ముందుకు వెళ్తే కుదిరే పనేనా అని అంటున్నారు.
తమ విధానాలు నినాదాలలోనే వివాదాలు ఉన్నాయి. పధకాలు పప్పు బెల్లాలు అంటున్న నోటితోనే రెట్టింపు పధకాలు అంటున్న విపక్షాలు జనాల మెప్పు ఎలా పొందుతాయి. అప్పులు చేయవద్దు అని చెబుతున్న మాటతోనే తాము ఒక్క పైసా అప్పు తేమని ఎందుకు ఒట్టేసి చెప్పడంలేదు. ఇలా అయోమయంగా విపక్షాలు ఉన్నాయా లేక వాటి వద్ద ఉన్న అస్త్రాలు అయిపోయాయా అన్న చర్చ అయితే ఉంది మరి.