టీడీపీ-జనసేనలకు అజెండా లేదు: ఏపీ మంత్రుల కామెంట్స్
త్వరలోనే జరగనున్న అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలకు సంబంధించి టీడీపీ -జనసేన పార్టీలు పొత్తు పెట్టుకున్న విషయం తెలిసిందే
త్వరలోనే జరగనున్న అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలకు సంబంధించి టీడీపీ -జనసేన పార్టీలు పొత్తు పెట్టుకున్న విషయం తెలిసిందే. మొత్తం 175 సీట్లకు గాను 118 స్థానాల్లో ఈ రెండు పార్టీలు.. తొలి విడత జాబితా ప్రకటించాయి. టీడీపీ 94 సీట్లలోనూ, జనసేన 24 సీట్లలోనూ పోటీ చేయాలని నిర్ణయించినట్టు చెప్పాయి. వీటిలోనూ టీడీపీ 94 అసెంబ్లీ సీట్లకు అభ్యర్థులను ఖరారు చేసింది. జనసేన కేవలం ఐదుగురు అభ్యర్థులను మాత్రమే ప్రకటించింది. మిగిలిన వారిని త్వరలోనే ప్రకటిస్తామని కూడా ఈ రెండు పార్టీల అధ్యక్షులు ప్రకటించారు. ఇక, ఈ జాబితాలపై ఆయా పార్టీల్లో అసంతృప్తులు తెరమీదకు వచ్చాయి. మరోవైపు బుజ్జగింపు కార్యక్రమాలు కూడా పుంజుకున్నాయి.
ఒకవైపు.. టీడీపీ-జనసేనలు తమ తమ పార్టీల అభ్యర్థులను బుజ్జగిస్తుండగా.. అధికార పార్టీ వైసీపీకి చెందిన నాయకులు, మంత్రులు టీడీపీ-జనసేన జాబితాపై ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తున్నారు. మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల కృష్ణ, మంత్రి బొత్స సత్యనారాయణలు ఈ జాబితాపై తాజాగా రియాక్ట్ అయ్యారు. ముఖ్యంగా విజయనగరంలో మంత్రి బొత్స సత్యనారాయ ణ మాట్లాడుతూ.. టీడీపీ-జనసేనపై విమర్శలు గుప్పించారు. ఈ రెండు పార్టీలకూ ఎజెండా లేదన్నారు. ``టీడీపీ-జనసేన పొత్తులపై సీట్ల లెక్కలు పక్కన పెడితే చివరికి ఎన్నికల ఫలితాలు మాత్రం మాకే అనుకూలంగా ఉంటాయి`` అని మంత్రి బొత్స వ్యాఖ్యానించారు.
టీడీపీ-జనసేన పార్టీలకు ఒక వ్యూహం అంటూ లేదని మంత్రి బొత్స అన్నారు. పొత్తులతో చేతులు కలిపిన టీడీపీ-జనసేన పార్టీలకు సరైన ఎజెండా లేదని దుయ్యబట్టారు. వైసీపీ పాలనలో రాష్ట్రంలో జరిగిన సంక్షేమం, ప్రతి కుటుంబానికి చేసిన మేలు, అందించిన పథకాలను చూపించి ఓటు వేయాలని అడుగుతున్నామని, ఇదే తమ నాయకుడు, ముఖ్యమంత్రి జగన్ అజెండా అని మంత్రి బొత్స పేర్కొన్నారు. అంతేకాదు, పవన్ కళ్యాణ్, చంద్రబాబులు, అమిత్ షాను కలిసినా.. అమితాబచ్చన్ కలిసినా.. వైసీపీకి పోయేదేమీ లేదని బొత్స తనదైన శైలిలో వ్యాఖ్యానించారు.
మంత్రి చెల్లుబోయిన వ్యాఖ్యలు ఇవీ..
టీడీపీ- జనసేన పొత్తులో టిక్కెట్ల కేటాయింపుపై రాజమండ్రిలో రాష్ట్ర మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ- జనసేన పార్టీలో సీట్ల ప్రకటన తర్వాత డొల్లతనం బయటపడిందని ఆరోపించారు. టిక్కెట్ల ప్రకటనతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ని చంద్రబాబు తీవ్రంగా అవమానపరిచారని, పవన్‌ను అవమనించడమంటే కాపు సామాజిక వర్గాన్ని తీవ్రంగా అవమానించినట్లేనని అన్నారు. ``కొడుకుని ముఖ్యమంత్రిని చేయాలని అత్యాశతో చంద్రబాబు పవన్ కళ్యాణ్ ను అవమాన పరుస్తున్నారు. ఇప్పటికే టీడీపీకి రాజ్యసభలో సున్న, రేపు పార్లమెంట్లోనూ అసెంబ్లీలో కూడా సున్నానే మిగులుతుంది`` అని విమర్శలు గుప్పించారు.