రాంప్రసాద్ రెడ్డి.. కొలికపూడి.. దర్పం.. దూకుడుతో ఏపీలో సర్కారుకు తిప్పలే
టీడీపీ-జనసేన-బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన 20 రోజుల్లో చోటుచేసుకున్న రెండు ఘటనలు వివాదాస్పదంగా మారాయి.
ఏపీలో ఇటీవలి ఎన్నికల్లో అధికార మార్పిడి ప్రధాన కారణాల్లో ఒకటి వైసీపీ నేతల పోకడ. ఎంపీలు, ఎమ్మెల్యేలు దర్పం ప్రదర్శించడం, ప్రత్యర్థుల పట్ల దురుసుగా ప్రవర్తించడం, మీడియా సమావేశాల్లోనూ పరుషంగా మాట్లాడడం, వ్యక్తిగత జీవితంపై దుర్భాషలాడడం ప్రజల్లో ఏవగింపు కలిగించింది. చివరకు ఆ పార్టీ దారుణ ఓటమికి దారితీసింది. వైసీపీతో పోలిస్తే సంప్రదాయబద్ధంగా కనిపించే టీడీపీ, జనసేనలను ప్రజలు ఆదరించారు. సరిగ్గా నెల రోజుల కిందట ఏపీ ప్రజలు ఇచ్చిన తీర్పు చరిత్రాత్మకంగా నిలిచిపోయింది. టీడీపీ-జనసేన-బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన 20 రోజుల్లో చోటుచేసుకున్న రెండు ఘటనలు వివాదాస్పదంగా మారాయి.
నాటి బద్ధ విరోధి కొలికపూడి
అమరావతి ఉద్యమంలో ప్రజల గొంతును మీడియాలో వినిపించి బాగా పాపులర్ అయ్యారు కొలికపూడి శ్రీనివాసరావు. ఈ క్రమంలో టీడీపీకీ చేరువయ్యారు. అయితే, ఈయన ఒకప్పుడు జగన్ మద్దతుదారు. చంద్రబాబు విధానాలకు తీవ్ర వ్యతిరేకి. ఉన్నత విద్యావంతుడు. దీనికితోడు ఫైర్ బ్రాండ్ మనస్తత్వం. కాగా, మంగళవారం ఆయన తన నియోజకవర్గం తిరువూరులో బాధితులకు సత్వర న్యాయం పేరుతో అత్యుత్సాహం ప్రదర్శించారనే అపవాదు మూటగట్టుకున్నారు. కంభంపాడులో వైసీపీ నాయకుడు కాలసాని చెన్నారావు చేపట్టిన అక్రమ భవన నిర్మాణాన్ని ఎమ్మెల్యే కొలికపూడి దగ్గరుండి కొంతవరకు కూల్చివేయించారు. ఇది రాష్ట్రంలో చర్చనీయాంశం కావడంతో కొలికపూడి సోషల్ మీడియాలో సంచలన ప్రకటన చేశారు. పదవి శాశ్వతం కాదని.. బాధితులకు న్యాయం చేయలేనపుడు తన లాంటి వారు రాజకీయాల్లో కూడా అవసరం లేదంటూ కుండబద్ధలు కొట్టారు. దీనికిముందు చెన్నారావు భవనం విషయంలో కొలికపూడి వ్యవహరించిన తీరుకు ఏపీ సీఎం చంద్రబాబు వివరణ కూడా తీసుకున్నారు.
దీనికిముందు ఏపీ రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి భార్య హరితారెడ్డి తనకు ప్రొటోకాల్ ఇవ్వరా? అంటూ ఎస్ఐ మీద ఆగ్రహం వ్యక్తం చేయడం కూడా వివాదాస్పదం అయింది. చంద్రబాబు జోక్యం వరకు వెళ్లింది. అయితే, మంత్రి భార్య తీరు అప్పటికే ప్రజల్లోకి వెళ్లిపోయింది. రాయచోటి నుంచి తొలిసారి గెలిచినప్పటికీ రాంప్రసాద్ రెడ్డికి మంత్రి పదవి దక్కింది. అంతేకాదు.. కీలకమైన రవాణా శాఖ ఇచ్చారు. కాగా, భార్య వ్యహరించిన తీరులో మంత్రికి ప్రమేయం లేనప్పటికీ.. ఆయనను ఎంతోకొంత బాధ్యుడిగా చేయక తప్పదు. ఈ క్రమంలోనే చంద్రబాబు హెచ్చరికలు జారీచేశారు.
దూకుడు తగ్గాలి.. దర్పం వీడాలి
అధికారంలోకి వచ్చాక బాధ్యత మరింత పెరుగుతుంది. దూకుడు ప్రతిపక్షంలోనే పనిచేస్తుంది. దీనిని పట్టించుకోకనే వైసీసీ ఓటమి పాలైంది. ఇప్పుడు కూటమి ప్రభుత్వమూ అదే తప్పు చేస్తే తేడా లేకుండా పోతుంది.