హీటెక్కిన 'పెడన' పొలిటికల్ పోరు.. టీడీపీ కీలక నేత అరెస్టు
పోలీసులు కాగిత కృష్ణప్రసాద్ ను అరెస్ట్ చేసి రోడ్ పై ఈడ్చుకుంటూ తీసుకువెళ్లి పోలీసు వాహనం లోకి ఎక్కింది.
ఉమ్మడి కృష్ణాజిల్లా లోని పెడన నియోజకవర్గంలో పొలిటికల్ పోరు తీవ్రస్థాయి లో హీటెక్కింది. వైసీపీ ఫైర్‌బ్రాండ్ నాయకుడు, మంత్రి జోగి రమేష్ గత ఎన్నికల్లో ఇక్కడ విజయం దక్కించుకున్నారు. అయితే.. గత కొన్నాళ్లుగా పెడన లో టీడీపీ దూకుడు పెరిగింది. ఈ నేపథ్యంలో మంత్రి పై విమర్శలు చేయడంతోపాటు.. పార్టీపరంగా కూడా పెడన నియోజకవర్గం టీడీపీ ఇంచార్జ్ కాగిత కృష్ణ ప్రసాద్ దూకుడు పెంచారు. ఇంటింటికీ తిరుగుతున్నారు. మంత్రి వైఫల్యాల ను ఆయన ఎండగడుతున్నారు.
ఈ క్రమంలో తాజాగా పెడన నియోజికవర్గం గూడూరు జాతీయ రహదారి పై మంత్రి జోగి రమేష్ దిష్టి బొమ్మను కాగిత కృష్ణ ప్రసాద్ ఆధ్వర్యంలో నేతలు దహనం చేశారు. జాతీయ రహదారి పై భారీగా చేరిన టీడీపీ శ్రేణులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
టీడీపీ అధినేత చంద్రబాబు సహా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై రెండు రోజుల కిందట అమరావతి లో పేదల కు ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన రోజు జోగి రమేష్ చేసిన వ్యాఖ్యల పై వారు నిరసన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యం లోనే కాగిత కృష్ణ ప్రసాద్ ఆధ్వర్యంలో మంత్రి జోగి దిష్టి బొమ్మను దహనం చేసే కార్యక్రమం నిర్వహించారు.
ఈ నేపథ్యంలో సమాచారం అందుకున్న పోలీసులు భారీ ఎత్తున మోహరించారు. అయినప్పటికీ.. పోలీస్ బలగాల ను దాటుకొని. జోగి రమేష్ దిష్టి బొమ్మను కాగిత కృష్ణప్రసాద్ దహనం చేశారు. ఈ నేపథ్యంలో ఆగ్రహం వ్యక్తం చేసిన పోలీసులు కాగిత కృష్ణప్రసాద్ ను అరెస్ట్ చేసి రోడ్ పై ఈడ్చుకుంటూ తీసుకువెళ్లి పోలీసు వాహనం లోకి ఎక్కింది.
దీంతో టీడీపీ శ్రేణులు అడ్డుపడ్డాయి. టీడీపీ శ్రేణుల ను కూడా పోలీసులు అరెస్ట్ చేసి గూడూరు పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ ఘటనతో జిల్లా వ్యాప్తంగా టీడీపీ నేతలు.. ఆందోళనల కు పిలుపునిచ్చారు. కేవలం దిష్టి బొమ్మను దహనం చేసినందుకే ఈడ్చుకుంటూ తీసుకువెళ్లి అరెస్టు చేస్తారా? అని ప్రశ్నించారు.