పొలిటికల్ కానుక: అంబటికి పూలు, చీర, జాకట్టు !
ఇదే సమయంలో వారు.. పూలు, చీర, జాకెట్టు తీసుకునివెళ్లారు. ఈ విషయం తెలిసిన పోలీసులు.. వెంటనే యువతను అడ్డుకునే ప్రయత్నం చేశారు.
ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. వైసీపీ సీనియర్ నాయకుడు, మాటల మాంత్రికుడు మాజీ మంత్రి, అంబటి రాంబాబుకు.. పొలిటికల్ కానుక కింద.. టీడీపీ తెలుగు యువత పూలు, చీర, జాకట్టు బహుమానంగా అందించాయి. ఈ పరిణామం తీవ్ర వివాదంగా మారింది. ఎన్నికలకు ముందు, తర్వాత.. ఆయన చేసిన వ్యాఖ్యలపై తెలుగు దేశం పార్టీ యూత్ వింగ్.. తెలుగు యువత నాయకులు మండిపడ్డారు. ఈ నేపథ్యంలో ఆయన ఇంటికి వెళ్లిన తెలుగు యువత నాయకులు.. చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి రావాలంటూ ఆహ్వాన పత్రికను అందించారు.
ఇదే సమయంలో వారు.. పూలు, చీర, జాకెట్టు తీసుకునివెళ్లారు. ఈ విషయం తెలిసిన పోలీసులు.. వెంటనే యువతను అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఇరు పక్షాల మధ్య కొద్దిసేపు వాగ్వాదం కూడా జరిగింది. ఇది మరిన్ని వివాదాలకు దారి తీస్తుందని పోలీసులు హెచ్చరించారు. దీంతో అంబటి ఇంటి ముందు చీర, జాకెట్టు, పూలను తెలుగు విద్యార్థి నేతలు కుర్చీలో పెట్టి వెళ్లిపోయారు. ఈ సమయంలో ఒకరిద్దరు నేతలు మాట్లాడుతూ.. అంబటి రాంబాబు మంత్రి అయినప్పటి నుంచి వెటకారంగా మాట్లాడారని, శ్రుతి మించిన ఆయన వ్యాఖ్యల వల్లే తాము ఈ నిరసన చేపట్టామని తెలిపారు.
అంతేకాదు, టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణిపై అంబటి తీవ్ర వ్యాఖ్యలు చేశారని.. దీనికి నిరసనగా నే తాము ఆయనకు పూలు, చీర, జాకట్లు సమర్పించేందుకు వచ్చామన్నారు. ఎన్నికల్లో ప్రజలు సరైన రీతిలో సమాధానం చెప్పారని తెలిపారు. మరోసారి అంబటి రాంబాబు టీడీపీ నేతలపై నోరు పారేసుకుం టే ఒప్పుకొనేది లేదన్నారు. ఇప్పటికైనా ప్రజాతీర్పును గౌరవించి.. నోరు అదుపులో పెట్టుకోవాలని వార్నింగ్ ఇచ్చారు. ఇదిలావుంటే.. అంబటి ఇంటికి పోలీసులు భద్రతను మరింత పెంచారు. ఏ క్షణంలో ఏమైనా జరగొచ్చన్న వార్తల నేపథ్యంలో గుంటూరు, సత్తెనపల్లి ప్రాంతాల్లోనిఅంబటి ఇళ్ల దగ్గర పోలీసులు పహారా పెట్టారు. ఎవరినీ అటువైపు రాకుండా చూస్తున్నారు.