అప్రమత్తత అవసరమే. ముందు జాగ్రత్త చర్యలు కూడా చాలా ముఖ్యం. అలా అని అవసరానికి మించిన అప్రమత్తతో మంచి కంటే చెడే ఎక్కువగా జరుగుతుంటుంది. తాజాగా ఏపీ పోలీసుల తీరు ఇలానే ఉంటుందన్న వాదన వినిపిస్తోంది. ఎవరు ఆదేశాలు జారీ చేస్తున్నారో కానీ అవసరానికి మించిన అప్రమత్తతను ప్రదర్శిస్తూ.. లేని మైలేజీని తీసుకురావటం ద్వారా పెద్ద నాయకులన్న ఫీలింగ్ తీసుకొచ్చేస్తున్న తీరుపై విస్మయం వ్యక్తమవుతోంది. తెలుగు మహిళ కమ్ మాజీ ఎమ్మెల్యే వంగలపూడి అనితను ఎలమంచలి పోలీసులు అరెస్టు చేసిన ఎపిసోడ్ ను చూస్తే.. ఇదేం యాక్షన్ బాబు అంటూ పోలీసుల తీరును తప్పు పట్టటం ఖాయం.
మాజీ ఎమ్మెల్యే అనిత శనివారం మధ్యాహ్నం మూడు గంటల వేళలో కారులో పాయకరావుపేటలోని పార్టీ కార్యాలయానికి బయలుదేరారు. అయితే ఆమెను.. వేంపాడు టోల్ ప్లాజా వద్ద నక్కపల్లి.. ఎలమంచిలి.. పాయకరావుపేట సీఐలు.. ఎస్ఐలు.. కానిస్టేబుళ్లు ఆమె కారును అడ్డుకున్నారు. దీంతో ఆమె అవాక్కు అయ్యారు. తనను ఎందుకు అడ్డుకున్నారన్న ఆమె ప్రశ్నకు పోలీసుల నుంచి వచ్చిన సమాధానం మరింత విస్తుపోయేలా మారింది. పాయకరావుపేటలో ప్రధాన రహదారి నిర్మాణ పనులను ఎమ్మెల్యే గొల్ల బాబూరావు శంకుస్థాపన చేస్తున్నారని.. ఆ టైంలో ఆమె అక్కడకు వెళితే శాంతిభద్రతల సమస్య తలెత్తుందన్న పోలీసులు ఆమెను అడ్డుకున్నారు.
అయితే.. తాను పార్టీ ఆఫీసులో ఓటర్ల జాబితా పరిశీలనకు వెళుతున్నానిన.. కార్యకర్తలతో తనకు సమావేశం ఉందని చెప్పినా పోలీసులు ఊరుకోలేదు. ఆమెను అడ్డుకొన్నారు. తెలుగు మహిళ అనితను అడ్డుకున్నారన్న సమాచారంతో టీడీపీ వర్గీయులు అక్కడకు చేరుకోవటంతో వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. తమతో కలిసి పోలీసుల జీపులో రావాలని పోలీసులు చెప్పగా.. అందుకు అనిత ససేమిరా అన్నారు.
చివరకు పోలీసులు.. అనితకు మధ్య జరిగిన చర్చలో భాగంగా ఆమెను ఆమె కారులోనే ఎలమంచిలి రూరల్ స్టేషన్ కు తరలించారు. ఆమెతో పాటు తెలుగుదేశం పార్టీ నేతల్ని అరెస్టు చేశారు. గంట తర్వాత అందరిని విడిచిపెట్టారు. ఈ ఎపిసోడ్ అంతా చూస్తే.. మొత్తం జరిగిన ఉదంతంలో మాజీ ఎమ్మెల్యే అనితకు లేని మైలేజీని తీసుకొచ్చారన్న విమర్శ వినిపిస్తోంది. ఆమె దారిన ఆమెను పోనిస్తే సరిపోయేదని.. ఒకవేళ నిజంగానే ఎమ్మెల్యే కార్యక్రమాన్ని అడ్డుకొని ఉంటే.. చర్యలు తీసుకోవాల్సిందిన్న వాదన వినిపిస్తోంది.
ముందస్తు జాగ్రత్తల్లో భాగంగా అనితను అదుపులోకి తీసుకోవటం ద్వారా.. ఆమెకు మైలేజీ తీసుకురావటంలో పోలీసులు కీ రోల్ ప్లే చేశారంటున్నారు. ఈ ఉదంతాలు అనితపై సానుభూతి పెంచేలా చేస్తాయని చెబుతున్నారు. స్థానిక ఎమ్మెల్యే పాల్గొన్న ప్రోగ్రాంకు అనిత వెళ్లటంతో శాంతిభద్రతల సమస్య ఏమో కానీ.. తాజా ఎపిసోడ్ తో అవసరం లేని ఉద్రిక్త వాతావరణం ఏర్పడలేదా? అని ప్రశ్నిస్తున్నారు. ఏపీలో మారిన రాజకీయ వాతావరణం వేళ.. పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపైన ప్రభుత్వం రివ్యూ చేయాల్సిన అవసరం ఉందన్న మాట వినిపిస్తోంది.