టీడీపీ మీడియా కోసమే రేవంత్ రెడ్డి చంద్రబాబుని కలిశారా ?

తెలంగాణా సీఎం రేవంత్ రెడ్డి ఏపీ సీఎం చంద్రబాబుల భేటీ జరిగి రోజులు గడుస్తున్నా ఏదో ఒక కొత్త చర్చ దాని మీద సాగుతూనే ఉంది.

Update: 2024-07-10 03:44 GMT

తెలంగాణా సీఎం రేవంత్ రెడ్డి ఏపీ సీఎం చంద్రబాబుల భేటీ జరిగి రోజులు గడుస్తున్నా ఏదో ఒక కొత్త చర్చ దాని మీద సాగుతూనే ఉంది. బాబు రేవంత్ భేటీల వెనక ఏముంది అన్నది కూడా చర్చిస్తున్నారు. ఇదిలా ఉంటే తెలంగాణా వాదం ఎంత బలంగా ఉంటుందో అందరికీ తెలిసిందే.

తెలంగాణావాదులకు ఏపీ ప్రజల సంగతి పక్కన పెడితే నాయకులు అంటే పడదన్న సంగతి కూడా తెలిసిన విషయమే. మరి ఇవన్నీ తెలిసినా కూడా రిస్క్ తీసుకుని రేవంత్ రెడ్డి చంద్రబాబుని ఎందుకు కలిశారు అన్నది ఒక పెద్ద ప్రశ్న. అయితే దాని వెనక ఎంతో పెద్ద స్టోరీ కూడా ఉందని తెలంగాణా కాంగ్రెస్ లో చర్చ సాగుతోందిట.

ఇక రేవంత్ రెడ్డి పాలిటిక్స్ ని కూడా తెలంగాణా కాంగ్రెస్ నేతలు జాగ్రత్తగా గమనిస్తున్నారు. ఒక వైపు ఢిల్లీలో బీజేపీ వాళ్లను కలుస్తున్న రేవంత్ రెడ్డి మరో వైపు తెలంగాణావాదులకు పెద్దగా పడని చంద్రబాబు లాంటి వ్యక్తులను కలుస్తున్నారు అంటే దీని వెనక ఏదో పెద్ద విషయమే ఉండొచ్చు అని అనుమానిస్తున్నారుట.

తెలంగాణాలోని తెలుగుదేశం పార్టీ వాళ్ళు 2023 ఎన్నికల్లో పోటీ చేయకుండా తమ ఓట్లు అన్నీ కూడా కాంగ్రెస్ కే వేశారని ఎంత పెద్ద ఎత్తున చెప్పుకుంటున్నా అది వాస్తవం కాదు అని అంటున్నారు. ఎందుకంటే ఏపీ వాళ్ళు మరీ ముఖ్యంగా టీడీపీ అనుకూల వర్గాలు ఎక్కువగా హైదరాబాద్ కార్పొరేషన్ పరిధిలోనే ఉన్నారు. అయితే జీహెచ్ఎంసీ పరిధిలో ఒక్క సీటు కూడా కాంగ్రెస్ కి దక్కలేదు అన్నది ఒక పచ్చి నిజం అని అంటున్నారు.

అంటే టీడీపీ అనుకూల వర్గాలు బీఆర్ఎస్ కి సపోర్ట్ చేస్తేనే కదా జీహెచ్ఎంసీలో దాదాపుగా 90 శాతం స్ట్రైక్ రేట్ బీఆర్ఎస్ కి వచ్చింది అని అంటున్నారు. మరి విషయం ఇలా ఉంటే రేవంత్ రెడ్డి చంద్రబాబుని ఎందుకు కలిసినట్లు అని తెలంగాణా కాంగ్రెస్ వాదులలో చర్చ సాగుతోంది. ఇది వారికి ఒక ప్రశ్నగా కూడా ఉంది.

అయితే టీడీపీ అనుకూల మీడియాతో పాటు టీవీ చానళ్ళు అన్నీ కూడా 2023 ఎన్నికల్లో రేవంత్ రెడ్డికి ఫుల్ సపోర్ట్ గా నిలిచాయి. అంతే కాదు రేవంత్ రెడ్డి కి పూర్తి పాజిటివ్ గా అలాగే బీఆర్ఎస్ కి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ప్రచారం చేశాయి. బీఆర్ఎస్ కి ఏ చిన్న వ్యతిరేకత ఉన్న దానిని బూతద్దంలో చూపించే ప్రయత్నం చేశాయి.

ఇలా రేవంత్ రెడ్డిని టీడీపీ అనుకూల మీడియా పూర్తిగా మద్దతు ఇస్తూ ముందుకు సాగుతోంది. దానిని మరింతగా గట్టి పరచుకోవడంతో పాటు రానున్న కాలంలో కూడా ఈ మద్దతు దక్కించుకోవాలీ అంటే చంద్రబాబుతో రేవంత్ రెడ్డి భేటీ కావాల్సిందే అన్న లెక్కలు ఉన్నాయని అంటున్నారు. అందుకే ఆ అంచనాలను దృష్టిలో పెట్టుకుని మాత్రమే రేవంత్ రెడ్డి చంద్రబాబుని కలిశారు అని అంటున్నారు.

ఇక ఏపీ తెలంగాణా సీఎంలు కలిశారు కానీ వారిద్దరు కలిసినంత మాత్రాన విభజన సమస్యలు అయితే ఏవీ పెద్దగా పరిష్కారం అవుతాయని ఎవరూ అనుకోవడం లేదని అంటున్నారు. ఉదాహరణకు చూస్తే విద్యుత్ బకాయిలుగా 24 వేల కోట్ల రూపాయలు ఏపీ నుంచి తెలంగాణా కి రావాలి.అది ఎలా ఇస్తారు అన్నది ఒక ప్రశ్న. అలాగే సింగరేణిలో ఏపీకి వాటా ఎలా ఇస్తారు అన్నది మరో ప్రశ్న. అంతే కాదు టీటీడీలో తెలంగాణాకు ప్రోటోకాల్స్ ఇవ్వమంటే ఇవ్వరు కదా అని కూడా అంటున్నారు.

అలాగే ఏపీలో ఉన్న సముద్ర తీర ప్రాంతంలో పోర్టులలో వాటా ఇవ్వమంటే తెలంగాణాకు ఎలా ఇస్తారు అన్నది మరో సందేహం. ఇవన్నీ లాజిక్ కి అందనివి అర్ధం కాని ప్రశ్నలుగానే మిగిలిపోతున్నాయి. ఇక చూస్తే రేవంత్ రెడ్డి చంద్రబాబు ఇద్దరూ గతంలో గురు శిష్యులుగా ఉన్నారు. ఇక ఈ భేటీ వల్ల జరిగిందేంటి అంటే సీఎంలుగా ఆ హోదాలో రేవంత్ రెడ్డి చంద్రబాబు ఒకరి ముఖాలను ఇంకొకరు చూసుకోవడం తప్పించి మరేమీ ఉండదని అంటున్నారు.

ఏది ఏమైనా కూడా రేవంత్ రెడ్డి చంద్రబాబు భేటీ వెనక అర్ధాలు పరమార్ధాలు వేరే ఉన్నాయని అన్న చర్చ అయితే ఉంది. తెలంగాణావాదులు అయితే ఈ భేటీ కేవలం విభజన సమస్యల కోసం సాగింది అంటే మాత్రం ఎందుకో అంతగా విశ్వసించడం లేదు ట.

Tags:    

Similar News