జైలు గోడల మధ్య బాబు...టూర్లతో తమ్ముళ్లు బిజీ !
వియ్ స్టాండ్ విత్ సీబీఎన్ అని నినదించాల్సిన తరుణంలో సొంత పార్టీకి చెందిన వారే ఇలా చేస్తే ఎలా అని పార్టీలో చర్చ సాగుతోంది
తమ్ముళ్లు బాబు అంటే అమితమైన గౌరవంతో ఉంటారని అంతా అంటారు. అయితే టీడీపీ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఒక పార్టీ అధ్యక్షుడే అరెస్ట్ అయి జైలు గోడల మధ్యన ఉన్నారు. అంతకంటే పార్టీకి సంక్లిష్టమైన పరిస్థితి అయితే ఉండదు. నిజానికి తమ్ముళ్ళు అన్న వారు ఈ టైం లో ఎక్కడ ఉన్నా రోడ్ల మీదకు రావాలి. ఆందోళన చేపట్టాలి. చంద్రబాబు కోసం ఏమైనా చేయాలి.
కానీ విశాఖ తమ్ముళ్ళు మాత్రం బాబు జైలులో ఉన్నా ఏమి అన్నట్లుగా టూర్ కి వెళ్లిపోయారు. విశాఖ కార్పోరేషన్ ఈ నెల 10 నుంచి వారం రోజుల పాటు శ్రీనగర్ కి అధ్యయన యాత్ర పేరుతో టూర్ పెట్టింది. మొత్తం జీవీఎంసీలో ఉన్న 99 మంది కార్పోరేటర్లలో 81 మంది వెళుతున్నారు. ఇందులో టీడీపీ కార్పొరేటర్లు కూడా ఉన్నారు.
ఈ టూర్ కి వామపక్షాలు, జనసేన పార్టీకి చెందిన కార్పోరేటర్లు దూరంగా ఉన్నారు. ఇదిలా ఉంటే చంద్రబాబుని ఈ నెల 9న నంద్యాలలో ఏపీ సీఐడీ అరెస్ట్ చేసి విజయవాడకు ఆ రోజు రాత్రికి తీసుకుని వచ్చింది. ఇక ఆదివారం బాబు అరెస్ట్ మీద ఏసీబీ కోర్టులో విచారణ జరుతోంది. అప్పటికే బాబు సీఐడీ అదుపులో ఉన్నారు. బాబుకు జైలా బెయిలా అన్న ఉత్కంఠతో ఏపీ అంతా ఊగిపోతూంటే అదే రోజున విశాఖ టీడీపీ కార్పోరేటర్లు అంతా శ్రీనగర్ విహారయాత్ర పేరుతో విమానాలు ఎక్కి మరీ చెక్కేసారు అని అంటున్నారు.
వియ్ స్టాండ్ విత్ సీబీఎన్ అని నినదించాల్సిన తరుణంలో సొంత పార్టీకి చెందిన వారే ఇలా చేస్తే ఎలా అని పార్టీలో చర్చ సాగుతోంది. అయితే బాబు అరెస్ట్ విషయం తెలిసి జీవీఎంసీలో టీడీపీ ఫ్లోర్ లీడర్ తో పాటు ఒక ముగ్గురు నలుగురు తన టూర్ ని క్యాన్సిల్ చేసుకున్నారని అంటున్నారు. మిగిలిన వారు అంతా చలో శ్రీనగర్ అనేశారు.
ఇది ముందుగా పెట్టుకున్న ట్రిప్ అని క్యాన్సిల్ ఎలా అని అంటూ వారంతా వెళ్లిపోయారని అంటున్నారు. ఇక వీరు వెళ్లడమే కాదు తమ వాట్సప్ స్టాటస్ లలో తమ టూర్ కి సంబంధించిన ఫోటోలను పెట్టి మరీ హల్ చల్ చేశారు. నిజానికి ఆ టైం లో టీడీపీ తమ్ముళ్ల వాట్సప్ స్టాటస్ లో ఉండాల్సింది బాబు అరెస్ట్ మీద ఖండనలు. అయినా కానీ వీరు తమ రూట్ సెపరేట్ అనుకుంటూ వెళ్ళిపోయారని అంటున్నారు.
జీవీఎంసీలో 30 మంది టీడీపీ కార్పోరేటర్లు ఉన్నారు. వీరిలో పాతిక మంది దాకా ఇపుడు టూర్ లో ఉన్నారు. వీరు తిరిగి వచ్చేది ఈ నెల 17 తరువాతనే అని అంటున్నారు. శ్రీనగర్ కార్పోరేషన్ లో అమలవుతున్న అభివృద్ధి కార్యక్రమలాను అధ్యయనం చేసి వాటిని జీవీఎంసీలో అమలు చేయడానికి ఈ టూర్ అని చెబుతున్నారు.
అయితే ఇప్పటికి రెండేళ్లుగా జీవీఎంసీ ఇలాంటి టూర్లు వేస్తోంది. అసలే జీవీఎంసీకి ఆదాయం తక్కువగా ఉందని, మెగా సిటీ అభివృద్ధికి నిధులు లేవని ఒక పక్క చెబుతూ ఈ టూర్లు ఏంటి కోట్ల రూపాయలతో ఖర్చులు ఏంటి అని వామపక్షాలు జనసేన నేతలు ప్రశ్నిస్తూనే ఉన్నారు. అందుకే వారు ఎపుడూ టూర్స్ కి దూరంగా ఉంటున్నారు.
కానీ టీడీపీ కార్పోరేటర్లు మాత్రం వైసీపీ నేతలతో చెట్టాపట్టాల్ వేసుకుంటూ ఈ టూర్లు చేస్తున్నారు అని అంటున్నారు. సరే గతంలో వెళ్లారు అనుకున్నా ఇపుడు అధినాయకుడు చంద్రబాబు అరెస్ట్ కంటే ముఖ్యమైనది పార్టీలో వేరొకటి లేదు కదా అయినా వెళ్ళారు అంటే వారికి పార్టీ కంటే కూడా టూర్లే ముఖ్యమా అన్న ప్రశ్నలు వస్తున్నాయి.
విశాఖలో సోమవారం టీడీపీ ఇచ్చిన బంద్ కూడా పెద్దగా జరగలేదు. కార్పోరేటర్లు ఎక్కడికక్కడ ఉండి బంద్ చేయించేలా చూస్తే బాగుండేది కదా అన్న చర్చ కూడా వస్తోంది. ఏది ఏమైనా అధినాయకుడే జైలుకు వెళ్ళినా తమ్ముళ్ళు ఇలా ఎంజాయ్ అంటూ టూర్లు వేయడం పట్ల పార్టీ బయటా లోపలా కూడా చర్చ అయితే పెద్ద ఎత్తున సాగుతోంది.