సీనియర్లకు పొలిటికల్ రిటైర్మెంట్ ...!?
మొత్తం మీద అరడజన్ కి పైగా మాజీ మంత్రులు సీనియర్ నేతలకు ఈసారి టీడీపీ ఎన్నికల రాజకీయాల నుంచి తప్పిస్తోంది అని అంటున్నారు. వీరి ప్లేస్ లలో కొత్త ముఖాలు కనిపిస్తున్నాయి.
ఉత్తరాంధ్ర టీడీపీలో సీనియర్ నేతలకు పొలిటికల్ గా రిటైర్మెంట్ ఇచ్చేశారా అన్న చర్చ నడుస్తోంది. ఉమ్మడి విజయనగరం జిల్లాలో చూసుకుంటే దశాబ్దాలుగా రాజకీయాలు చేసిన వారు 2024 ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్నారా లేక వారిని దూరం పెట్టారా అన్న ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. విజయనగరం జిల్లా అంటేనే కేంద్ర మాజీ మంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజు ఠక్కున గుర్తుకు వస్తారు.
ఆయన జిల్లా రాజకీయాలను నాలుగున్నర దశాబ్దాలుగా శాసించారు ఆయన 1978 నుంచి వరసబెట్టి పోటీ చేస్తూనే ఉన్నారు. 2024లో ఆయనకు ఇప్పటిదాకా ఎంపీ టికెట్ అయితే ప్రకటించలేదు. అది బీసీలకు ఇస్తారని అంటున్నరు. ఇక విజయనగరం ఎమ్మెల్యే టికెట్ ని ఆయన కుమార్తె అదితి గజపతిరాజుకు ఇస్తున్నట్లుగా తొలి జాబితాలోనే ప్రకటించారు.
దాంతో అశోక్ రాజకీయాల నుంచి తప్పుకున్నట్లేనా అన్న చర్చ వస్తోంది. ఆయనకు ఎంపీ టికెట్ ఇవ్వకపోతే ఆయన రాజకీయ రిటైర్మెంట్ ఖాయం అయినట్లే అంటున్నారు. ఇదే జిల్లాలో మాజీ మంత్రి బొబ్బిలికి చెందిన కీలక నేత సుజయ క్రిష్ణ రంగారావుకు టికెట్ ఇవ్వలేదు. ఆయన సోదరుడు బేబీ నాయనకు ఇచ్చారు. దాంతో సుజయ క్రిష్ణ రంగారావు రాజకీయం ముగిసినట్లేనా అన్న అనుమానాలు వస్తున్నాయి.
నెల్లిమర్ల విషయానికి వస్తే 1983 నుంచి పోటీ చేస్తూ అనేక సార్లు గెలిచి మంత్రిగా కూడా పనిచేసిన పతివాడ నారాయణస్వామినాయుడు కుటుంబానికి ఈసారి నో టికెట్ అని చెప్పేశారు. పొత్తులో జనసేనకు ఈ టికెట్ ఇచ్చేశారు. దాంతో పతివాడ వారసులు షాక్ కి గురి అయ్యారు. పెద్దాయన పతివాడ కూడా రాజకీయాల నుంచి తప్పుకున్నట్లే అని అంటున్నారు.
ఇక కిమిడి కళా వెంకటరావు ఉన్నారు. ఆయన సీనియర్ మోస్ట్ లీడర్. 1983 నుంచి ఎన్నికల్లో పోటీ చేస్తూ వస్తున్నారు. ఆయన శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల టికెట్ ని కోరుకుంటున్నారు. అధినాయకత్వం అయితే ఆయనను చీపుర్పల్లి నుంచి పోటీ చేయమని కోరినట్లుగా వార్తలు వచ్చాయి.
ఆయన ఎచ్చెర్ల ఇస్తేనే పోటీ అంటున్నారుట. అక్కడ కొత్త ముఖాన్ని ఈసారి పరిచయం చేద్దామని టీడీపీ ఆలోచనలో ఉందని టాక్. అదే నిజం అయితే కళా ఈసారితో రాజకీయంగా రిటైర్మెంట్ తీసుకున్నట్లే అని అంటున్నారు. అలాగే మాజీ మంత్రి గుండ అప్పలసూర్యనారాయణ కుటుంబానికి కూడా ఈసారి శ్రీకాకుళం టికెట్ డౌట్ అని అంటున్నారు. అక్కడ గోండు శంకర్ అనే యువ నేతను టీడీపీ హై కమాండ్ ప్రోత్సహిస్తోంది. ఇటీవల బాబు రా కదలిరా సభకు పెద్ద ఎత్తున జనాలను ఆయన్ తీసుకుని వచ్చి తన సత్తా చూపారు.
టికెట్ దక్కపోతే 1983 నుంచి ఎన్నికల్లో పోటీ చేస్తూ వస్తున్న గుండ అప్పల సూర్యనారాయణ కుటుంబం రాజకీయంగా తప్పుకున్నట్లే అవుతుంది అంటున్నారు. విశాఖ జిల్లాలో చూసుకుంటే మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి టికెట్ డైలమాలో పడింది. ఆయన ఆశిస్తున్న పెందుర్తి టికెట్ ని జనసేనకు ఇస్తే కనుక బండారు వారు సైతం పదవీవిరమణ చేసినట్లే అంటున్నారు. మొత్తం మీద అరడజన్ కి పైగా మాజీ మంత్రులు సీనియర్ నేతలకు ఈసారి టీడీపీ ఎన్నికల రాజకీయాల నుంచి తప్పిస్తోంది అని అంటున్నారు. వీరి ప్లేస్ లలో కొత్త ముఖాలు కనిపిస్తున్నాయి.