టీడీపీ 'పెద్దలు'.. కనిపించేది 2026లోనే!
టీడీపీ ఆవిర్భావం నుంచి ఇప్పటివరకూ రాజ్యసభలో ఆ పార్టీకి సభ్యులు లేకపోవడం అనే ప్రశ్నే ఏనాడూ తలెత్తలేదు.
ప్రధాన ప్రతిపక్షం టీడీపీలో ఒక సంచలనం చోటు చేసుకుంది. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత ఆ పార్టీ ఎదుర్కోనంత పెద్ద కష్టాన్ని ఇప్పుడు ఎదుర్కొంటోంది. గతంలో ఘోర పరాజయాలు ఎదురైనా.. ఒకటో, రెండో రాజ్యసభ సీట్లు వచ్చేవి. కానీ గత రెండు సంవత్సరాల్లో జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో టీడీపీకి ఒక్క సీటూ రాలేదు. దానికి తగ్గ ఎమ్మెల్యేల బలం లేదు. దీంతో టీడీపీకి ఉన్న ఒక్క రాజ్యసభ సభ్యుడి పదవి కాలం ముగిసిపోతోంది. కొత్త అభ్యర్థి ఎంపిక కాలేదు. దీంతో టీడీపీకి రాజ్యసభలో ప్రాతినిధ్యం లేకుండా పోయినట్లయింది.
తాజాగా ఈ ఏడాది ఏప్రిల్‌లో ఖాళీ అవుతున్న మూడు రాజ్యసభ సీట్లకు ఈ నెల 27న ఎన్నికలు జరగాల్సి ఉంది. అయితే.. ఎలాంటి పోటీ లేకపోవడంతో వైసీపీ తరఫున నామినేట్ అయిన.. వైవీ సుబ్బారెడ్డి, మేడా రఘునాథరెడ్డి, గొల్ల బాబూరావులు.. ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దీనిని అధికారికంగా ప్రకటించారు కూడా. దీంతో ఉన్న ఒకే ఒక్క అభ్యర్థి కనకమేడల రవీంద్ర కుమార్.. ఈ ఏప్రిల్‌లో రిటైర్ అవుతున్నారు. ఫలితంగా టీడీపీ తరఫున రాజ్యసభలో పెద్దలు కనిపించరు.
ఇప్పటి వరకు..
టీడీపీ ఆవిర్భావం నుంచి ఇప్పటివరకూ రాజ్యసభలో ఆ పార్టీకి సభ్యులు లేకపోవడం అనే ప్రశ్నే ఏనాడూ తలెత్తలేదు. ఉమ్మడి రాష్ట్రం విభజన కారణంగా ఏపీకి రాష్ట్ర కోటాలో రాజ్యసభ సభ్యుల సంఖ్య 11గా నిర్ణయించారు. రాజ్యసభలో 2019 ఎన్నికలకు ముందు వైసీపీకి ఇద్దరు.. టీడీపీకి 9 మంది సభ్యులు ఉండేవారు. రాష్ట్రంలో 2019 ఎన్నికల్లో వైసీపీ 151 శాసనసభ స్థానాల్లో ఘనవిజయం సాధించగా.. టీడీపీ 23 స్థానాలకే పరిమితమయింది. ఓటమి తర్వాత అప్పటి వరకు టీడీపీ సభ్యులుగా ఉన్న సుజనా చౌదరి, సీఎం రమేష్, గరికపాటి మోహన్‌రావు, టీజీ వెంకటేశ్‌లు బీజేపీలో చేరారు. వారి పదవి కాలం కూడా పూర్తయిపోయింది.
మళ్లీ ఎప్పుడు?
రాజ్యసభ ఎన్నికలు మరో రెండేళ్లకు జరుగుతాయి. అప్పుడు ముగ్గురు పదవీ విరమణ పొందుతారు. వారిలో మోపిదేవి వెంకటరమణ, ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్ ఉన్నారు. వీరు 2026, జూన్‌లో పదవీవిరమణ చేస్తారు.
అయితే.. ఈ సీట్లు కూడా.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చే ఫలితాలను బట్టి దక్కుతాయి. వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన కూటమి తిరిగులేని విజయం సాధిస్తే.. ఆ తర్వాత ఎన్ని సార్లు రాజ్యసభ ఎన్నికలు జరిగినా టీడీపీ , జనసేన ఖాతాలోనే పడే అవకాశం ఉంది. ఇది జరగాలన్నా.. పెద్దల సభలో టీడీపీ గళం వినిపించాలన్నా.. వచ్చే అసెంబ్లీ ఎన్నికలే కీలకం.