టీడీపీ వర్సెస్ జనసేన... గ్రౌండ్ లెవెల్ లో ఫైటింగ్ సీన్లు..!

ఏపీలో చూస్తే అలాంటి వాతావరణం టీడీపీ జనసేనల మధ్య ఉందా అంటే డౌట్ ఎక్కడో కొడుతోందని చాలా రాజకీయ విశ్లేషణలు తేల్చాలి.

Update: 2023-11-15 12:20 GMT

ఒక పార్టీతో మరో పార్టీ భావాలు ఎపుడూ కలవవు. అదే జరిగితే కనుక వేరే పార్టీ ఎందుకు. వేరే నాయకుడు ఎందుకు. రెండు పార్టీల మధ్య పొత్తులు ఉండాలంటే భావసారూప్యం చాలా అవసరం. ఇక సామాజిక రాజకీయ సరిపోలికలు కూడా అవసరం. ఏపీలో చూస్తే అలాంటి వాతావరణం టీడీపీ జనసేనల మధ్య ఉందా అంటే డౌట్ ఎక్కడో కొడుతోందని చాలా రాజకీయ విశ్లేషణలు తేల్చాలి.

అయితే పై స్థాయిలో అంతా ఒకే అని అనుకుంటూ అగ్ర నాయకులు పొత్తులు పెట్టుకున్నా దిగువ స్థాయిలో మాత్రం ఎవరి ఆశలను ఎవరు చంపుకుంటారు. ఎవరి అవకాశాలను ఎవరు త్యాగం చేసుకుంటారు. సరిగ్గా అక్కడే మొదలవుతుంది రాజకీయ రగడ. ఇపుడు అదే జరుగుతోంది.

పిఠాపురంలో టీడీపీ జనసేన నేతల మధ్యన వాగ్వాదం కాస్తా ముదిరి చివరికి గాలిలోకి కుర్చీలు లేచే దాకా సీన్ వెళ్ళింది. దాంతోనే పిఠాపురం ఇపుడు టీడీపీ జనసేన పొత్తులకు రెడ్ సిగ్నల్ చూపించే ట్రయిలర్ గా మారిందని అంటున్నారు. ఇంతకీ పిఠాపురంలో ఏమి జరిగింది అన్నది కనుక చూసుకుంటే చాలానే అని జవాబు వస్తోంది.

పిఠాపురంలో నిర్వహించిన కో ఆర్డినేషన్ మీటింగులో టీడీపీ ఇంచార్జి వర్మకు జనసేన నేతలకు మధ్య వాగ్వాదం నడచింది. తాను ఎమ్మెల్యేగా ఉన్నపుడు నియోజకవర్గం అభివృద్ధి చేశాను వర్మ అనడంతో అలా జరిగితే మీరు ఎందుకు ఓడిపోయారు అని జనసేన ఇంచార్జి తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ ప్రశ్నించి వర్మకు షాక్ తినిపించారు.

అలా కాదు ఈసారికి జనసేనకు ఈ సీటు వదిలేసి తనను గెలిపించాలని అపుడు అభివృద్ధి ఏంటో తాను చేసి చూపిస్తాను అని శ్రీనివాస్ అనడంతో వివాదానికి అగ్గి రాజుకున్నట్లు అయింది. ఇక తనను ఓడిపోయావని అనడంతో వర్మ తో పాటు ఆయన వర్గం కూడా జీర్ణించుకోలేకపోయింది. దాంతోనే రగడ స్టార్ట్ అయింది.

దాంతో మాటకు మాట అన్నట్లుగా వర్మ కూడా తీవ్ర కామెంట్స్ చేశారు. మీ నాయకుడు రెండు చోట్ల పోటీ చేసి ఓడిపోలేదా అనడంతో జనసేన నేతలకు అగ్గి రాజుకున్నట్లు అయింది అని అంటున్నారు. అంతే కాదు పిఠాపురంలో జనసేనకు వచ్చిన ఓట్లు ఎన్ని 35 వేలు మాత్రమే అని టీడీపీ నేతలు అంటూ తమకు 75 వేలకు పైగా ఓట్లు వచ్చాయని కూడా లెక్క బయటకు తీశారు.

ఇలా రెండు పార్టీల ఇంచార్జుల మధ్య మాటల యుద్ధం సాగడంతో క్యాడర్ కూడా కుర్చీలు గాల్లోకి లేపేదాకా ఫైటింగ్ సీన్ నడచింది. మొత్తానికి సమావేశం రసాభాస కావడంతో జనసేన నేతలు అక్కడ నుంచి కోపంగా వెళ్ళినట్లుగా తెలుస్తోంది.

పిఠాపురం ఫైటింగ్ ఇపుడు రెండు పార్టీలలోనూ చర్చగా మారుతోంది. అదే టైంలో జనసేన టీడీపీల మధ్య గ్రౌండ్ లెవెల్ లో ఇలాంటి సీన్లకు ఇది ఆరంభం అని కూడా అంటున్న వారూ ఉన్నారు. జస్ట్ ట్రయిలర్ చూశారు, ముందు సినిమా ఉంటుంది అని అంటున్నారు.

నిజానికి చూస్తే ఉభయ గోదావరి జిల్లాలలో జనసేనకు బలం ఉంది. దాంతో పాటు చాలా మంది నాయకులు పోటీకి ఉత్సాహం చూపిస్తున్నారు. ఎక్కువ సీట్లు కూడా ఇక్కడే డిమాండ్ చేయడానికి జనసేన రెడీగా ఉంది. కానీ పై స్థాయిలో అయితే అంతా బాగుంది అని ఎన్ని సీట్లు ఎక్కడో ఒక చోట ఇస్తే చాలు అని అనుకుంటే మాత్రం ఇలాంటి సీన్లు ఒకటి కాదు చాలానే చూడాల్సి వస్తుందని హెచ్చరించడానికేనా పిఠాపురం రగడ బయటకు వచ్చింది అని అంటున్నరు. ఏది ఏమైనా జనసేన టీడీపీల మధ్య పొత్తులు అంత సులువు కావు అని తలపండిన రాజకీయ విశ్లేషకులు ఇప్పటికే చెబుతున్నారు.

రెండు సామాజిక వర్గాలు ఒక ఒరలో ఒదగవు, అలాగే రెండు బలమైన ఆసలు ఆకాంక్షలు కూడా ఒక్క చోట చేరి రాజీ పడే సీన్ లేదు అని అంటున్నారు. చూడాలి మరి పిఠాపురం తరువాత రెండు పార్టీల అగ్ర నేతలు ఏ రకమైన రాజీ ఫార్ములాతో ముందుకు వస్తారో .

Tags:    

Similar News