నలభయ్యేళ్ళ తరువాత మేయర్ పీఠం టీడీపీకి ?
టీడీపీ ఆవిర్భావం ముందు విశాఖ కార్పోరేషన్ గా ఎదిగాక తొలి ఎన్నికల్లో బీజేపీ గెలిచి మేయర్ పీఠం దక్కించుకుంది.
విశాఖ మెగా సిటీ. విశాఖ ఏపీలోనే అతి పెద్ద నగరం. వైసీపీ రాజధాని అని ప్రకటించింది కానీ అలా కాకపోయినా విశాఖ వచ్చిన కొరత ఏమీ లేదు. రాజధాని రాజసం విశాఖకు ఎపుడూ ఉంది. అలాంటి విశాఖలో మేయర్ ఎన్నికలు అనేక సార్లు జరిగితే టీడీపీకి పీఠం దక్కింది మాత్రం ఒకే ఒకసారి అన్నది చరిత్రలో ఉన్న నిజం.
టీడీపీ ఆవిర్భావం ముందు విశాఖ కార్పోరేషన్ గా ఎదిగాక తొలి ఎన్నికల్లో బీజేపీ గెలిచి మేయర్ పీఠం దక్కించుకుంది. టీడీపీ అధికారంలోకి వచ్చాక లోకల్ బాడీస్ ని ఎన్నికలు జరిపించారు ఎన్టీఆర్. అలా 1987లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ తొలిసారి మేయర్ పీఠం దక్కించుకుంది.
ఆ తరువాత 1995,2000, 2007 లలో జరిగిన ఎన్నికల్లో వరసగా మేయర్ పీఠం కాంగ్రెస్ నే వరించింది. ఇక 2012 తరువాత నుంచి ఎన్నికలు జరిపించలేదు. 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చింది. హుదూద్ తుఫాన్ సమయంలో చంద్రబాబు ప్రభుత్వం విశాఖ ప్రజలకు అండగా ఉండి ఎన్నో సహాయ కార్యక్రమాలు చేసింది.
అదే ఊపులో ఎన్నికలు పెడితే గెలుస్తామని చెప్పినా టీడీపీ పెద్దలు పట్టించుకోలేదు. అలా టీడీపీ టీర్మ్ గడచిపోయింది. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చాక 2021లో ఎన్నికలు పెట్టి విశాఖ మేయర్ పీఠాన్ని దక్కించుకున్నది. ఇప్పటికి మూడున్నరేళ్లుగా వైసీపీ మేయర్ అధికారంలో ఉన్నారు.
వైసీపీ ప్రభుత్వ హయాంలో నాలుగేళ్లకు కానీ లోకల్ బాడీస్ లో అవిశ్వాసం పెట్టకూడదు అని చట్టం చేశారు. దానిని ఇపుడు టీడీపీ సవరించాలని చూస్తోంది. అలా మూడేళ్లకు కుదిస్తే ఏపీలో చాలా కార్పోరేషన్లు టీడీపీ పరం అవుతాయని భావిస్తున్నారు. అందులో విశాఖ కార్పోరేషన్ ఒకటి ఉంటుందని అంటున్నారు. వైసీపీకి కార్పోరేషన్ లో బలం ఉంది కానీ వారిలో చాలా మంది టీడీపీ వైపు చూస్తున్నారు అని అంటున్నారు. దాంతో వారిని దగ్గరకు తీసుకుని మరీ విశాఖ మేయర్ పీఠం కొట్టాలని టీడీపీ నేతలు వ్యూహ రచన చేస్తున్నారు.
మేయర్ పీఠాన్ని దక్కుంచుకుంటే కనుక టీడీపీ నాలుగు దశాబ్దాల కోరిక తీరినట్లు అవుతుంది. గతంలో దగ్గరకు వచ్చి మరీ మేయర్ పీఠం జారిపోయింది. విశాఖలో టీడీపీకి ఎంతో బలం ఉన్నా మేయర్ పీఠం మాత్రం ఇంతకాలం దక్కలేదు అన్న వెలితి ఉంది. ఇపుడు అది తీరనుంది అని అంటున్నారు. పాతికేళ్ళ తరువాత విశాఖ ఎంపీని రికార్డు స్థాయి మెజారిటీతో గెలుచుకున్న టీడీపీకి ఇపుడు మేయర్ పీఠం మీద గురి ఉంది అని అంటున్నారు. అన్నీ అనుకూలిస్తే తొందరలోనే టీడీపీకి మేయర్ పీఠం దక్కుతుందని అని అంటున్నారు.