బ్రిడ్జిటౌన్ లో తీవ్ర తుఫానులో టీమిండియా.. భారత్ కు తిరిగొచ్చేదెన్నడో?

మ్యాచ్ సమయానికి వర్షం కురిసే చాన్స్ 30 శాతం వరకు ఉన్నట్లు కథనాలు వచ్చాయి. కానీ, ఇదేమీ జరగలేదు.

Update: 2024-07-01 08:04 GMT

టి20 ప్రపంచ కప్ గెలిచి 150 కోట్ల మంది అభిమానులను సంతోష తుఫానులో ముంచెత్తిన భారత క్రికెట్ జట్టు ఇక స్వదేశానికి తిరిగి రావడమే తరువాయి అనుకుంటున్న తరుణంలో అనూహ్య అవాంతరం ఎదుర్కొంటోంది. నెల రోజుల తర్వాత ఇంటికి చేరుతున్నామన్న ఆనందంలో ఉన్న టీమిండియా కరీబియన్ దీవుల్లో చిక్కుకుపోయింది. అనూహ్య వాతావరణం మధ్య జరిగిన టి20 ప్రపంచ కప్ చివరకు సజావుగానే ముగిసింది. సూపర్-8, సెమీఫైనల్స్ కు ఇబ్బంది పెట్టిన వరుణుడు.. ఫైనల్స్ కు ఎలాంటి ఇబ్బందీ కలించలేదు. వాస్తవానికి శనివారం ఫైనల్ మ్యాచ్ జరిగిన బార్బడోస్‌ లో వాతావరణం తొలుత సందిగ్ధంగానే ఉంది. మ్యాచ్ సమయానికి వర్షం కురిసే చాన్స్ 30 శాతం వరకు ఉన్నట్లు కథనాలు వచ్చాయి. కానీ, ఇదేమీ జరగలేదు.

ఒక్క చినుకూ లేకుండానే..

దక్షిణాఫ్రికా-భారత్ మధ్య బార్బడోస్ లో శనివారం జరిగిన ఫైనల్ కు వర్షం సెకను కూడా అంతరాయం కలిగించలేదు. దీంతో ఆశ్చర్యపోవడం అభిమానుల వంతైంది. అంతేకాదు.. మన జట్టు ప్రపంచ కప్ గెలవడంతో ఆనందం రెట్టింపైంది.

విమానాశ్రయం మూసివేత

టి20 ప్రపంచ కప్ ఫైనల్ బార్బడోస్ దీవుల రాజధాని బ్రిడ్జిటౌన్ లో జరిగిన సంగతి తెలిసిందే. కెన్సింటన్ ఓవల్ మైదానంగా దీనికి పేరు. కాగా, ఈ మైదానంలో గెలిచిన అనంతరం టీమిండియా బ్రిడ్జిటౌన్ నుంచి బయల్దేరాల్సి ఉంది. కానీ, తుఫాను కారణంగా చిక్కుకుపోయింది. ఇక్కడ వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో తుఫాను హెచ్చరికలు జారీ చేశారు. అంతేకాక బార్బడోస్‌ విమానాశ్రయాన్ని మూసివేశారు. దీంతో ఫ్లైట్ సర్వీసులూ రద్దయ్యాయి. ఇలాంటి ప్రతికూల వాతావరణంతో భారత క్రికెట్‌ జట్టు బ్రిడ్జిటౌన్ లోనే ఉండిపోయింది.

Tags:    

Similar News