కుటుంబ రాజకీయాలను కాదనలేని దైన్యం.. కాంగ్రెస్ జాబితాలో చిత్ర విచిత్రాలు!
దేశంలో తరచుగా కుటుంబ రాజకీయాలపై చర్చ సాగుతోంది. ఒకే కుటుంబంలోని వారికి రెండు నుంచి మూడు టికెట్లు ఇస్తున్న పరిస్థితిపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది.
దేశంలో తరచుగా కుటుంబ రాజకీయాలపై చర్చ సాగుతోంది. ఒకే కుటుంబంలోని వారికి రెండు నుంచి మూడు టికెట్లు ఇస్తున్న పరిస్థితిపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. ఈ పరిణామాలతో ముఖ్యంగా అతి పెద్ద కాంగ్రెస్ పార్టీ ఇరుకున పడింది. మరోవైపు బీజేపీ.. ఈ విషయాన్నే ఎన్నికల అస్త్రంగా చేసుకుని ముందుకు సాగుతోంది. దీంతో కాంగ్రెస్ కొంత రియలైజ్ అయి.. కుటుంబానికి ఒక్క సీటే అన్న నినాదాన్ని తెరమీదికి తెచ్చింది.
దీనిని తెలంగాణ ఎన్నికల నుంచే ఆచరణలో పెట్టాలని రాజస్థాన్‌లో జరిగిన సమావేశంలో నిర్ణయించింది. కానీ.. ఎక్కడ ఏం జరిగిందో తెలియదు కానీ.. కుటుంబ రాజకీయాలను కాదనలేని పరిస్థితిలో కాంగ్రెస్ కూరుకు పోయింది. తాజాగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో 32 మంది అభ్యర్థులతో కూడిన జాబితాను ఇచ్చిన కాంగ్రెస్ రెండు కుటుంబాలకు రెండేసి చొప్పున టికెట్లు కేటాయించడం పార్టీలో అసంతృప్తులను మరింత పెంచుతున్నట్టు అయింది.
మైనంపల్లి హనుమంతరావు కుటుంబానికి, పీసీసీ మాజీ చీఫ్ ఉత్తమకుమార్ రెడ్డి కుటుంబాలకుకాంగ్రెస్ పార్టీ రెండేసి టికెట్లు ఇచ్చింది. మెదక్ అసెంబ్లీ స్థానాన్ని మైనంపల్లి రోహిత్(హనుమంతు కుమారుడు)కు కేటాయించగా, మల్కాజ్‌గిరి టికెట్‌ను మైనంపల్లి హనుమంతరావుకు ఇచ్చింది. ఇక, కీలకమైన కోదాడ టికెట్‌ను ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సతీమణి పద్మావతి రెడ్డికి కేటాయించిన కాంగ్రెస్ ఉత్తమ్‌కు.. హుజూర్‌నగర్ టికెట్ ఇచ్చింది.
మరి తొలి జాబితా 32 మందిలోనే రెండేసి టికెట్లు కేటాయించడంతో ఇతర ఆశావహ నాయకులు ఇప్పుడు పార్టీపై భారీగానే ఆశలు పెట్టుకున్నారు. వీరిలో కీలకమైన నాయకులు చాలా మంది ఉన్నారు. మరి వారికి కూడా ఇలానే రెండేసి టికెట్లు కేటాయించక తప్పని పరిస్థితి ఏర్పడనుంది. ఇది పార్టీలో మేరకు మేలు చేస్తుందనేది చూడాలి. ఇదిలావుంటే, నల్లగొండ జిల్లాలోని నాగార్జున సాగర్ టికెట్‌ను ఈ దఫా పార్టీ వృద్ధ నాయకుడు కుందూరు జానా రెడ్డి కుమారుడు జయవీర్ కుందూరుకు కేటాయించడం గమనార్హం. అంటే.. వారసత్వ రాజకీయాలకు కూడా కాంగ్రెస్ స్వస్తి చెప్పలేని పరిస్థితి ఏర్పడిందన్న మాట. సో.. ఇదీ సంగతి!