తెలంగాణ కొత్త మంత్రుల జాబితా రెడీ? ఉగాది తర్వాత ముహూర్తం!
ఇక ఎంతమాత్రం లేటు చేయకూడదని నిర్ణయానికి వచ్చిన హైకమాండ్ వెంటనే మంత్రివర్గాన్ని విస్తరించాలని సీఎం రేవంత్ రెడ్డికి సూచించినట్లు సమాచారం;

తెలంగాణ మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం రెడీ అయినట్లు ఊహాగానాలు మొదలయ్యాయి. సోమవారం మధ్యాహ్నం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ఆకస్మికంగా ఢిల్లీ వెళ్లడానికి ప్రధాన కారణం కేబినెట్ విస్తరణే అంటూ టాక్ నడుస్తోంది. దాదాపు 15 నెలలుగా మంత్రివర్గ విస్తరణ కాంగ్రెస్ నేతలను ఊరిస్తోంది. రకరకాల కారణాలతో ఇన్నాళ్లు ఆలస్యమైంది. ఇక ఎంతమాత్రం లేటు చేయకూడదని నిర్ణయానికి వచ్చిన హైకమాండ్ వెంటనే మంత్రివర్గాన్ని విస్తరించాలని సీఎం రేవంత్ రెడ్డికి సూచించినట్లు సమాచారం.
అధిష్టానం పిలుపుతో ఢిల్లీ వెళ్లిన సీఎం, డిప్యూటీ సీఎం, టీపీసీసీ చీఫ్ సోమవారం సాయంత్రం ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తో భేటీకానున్నారు. విస్తరణకు ముహూర్తంతోపాటు కాబోయే మంత్రుల జాబితాను ఈ భేటీలో ఖరారు చేస్తానంటున్నారు. ఇప్పటికే ఆలస్యమైనందున వీలైనంత త్వరగా ముహూర్తం పెట్టాలని హైకమాండ్ ఆలోచనగా ఉందంటున్నారు. ప్రస్తుతం మూఢం నడుస్తున్నందున వచ్చే ఉగాది లేదా ఆ తర్వాత మంచి ముహూర్తం చూసుకుని కొత్త మంత్రులతో ప్రమాణం చేయించాలని చూస్తున్నారు.
ప్రస్తుతం కేబినెట్ లో ఆరు ఖాళీలు ఉండగా, సుమారు డజను మంది నేతలు పోటీపడుతున్నారు. గత ఎన్నికల సమయంలో మంత్రి పదవి హామీతో పార్టీలోకి వచ్చిన నేతలు ఇప్పుడు పట్టుబడుతుండటం, కులాలు, ప్రాంతాలు, ఇతర సమీకరణలు చూసుకోవాల్సివున్నందున కాంగ్రెస్ అధిష్టానం ఇన్నాళ్లు మంత్రి పదవుల భర్తీని పెండింగులో పెట్టింది. ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్, నిజామాబాద్ జిల్లాలకు మంత్రివర్గంలో ప్రాతినిధ్యం లేకపోయింది. దీంతో ఈ సారి విస్తరణలో ఆయా జిల్లా నేతలకు పదవులు ఇవ్వాల్సివుంది. ఇక వీరితోపాటు ప్రస్తుతం మంత్రివర్గంలో ఉన్న జిల్లాల నుంచి ఎమ్మెల్యేలతోపాటు ఇద్దరు సీనియర్ మంత్రుల కుటుంబ సభ్యులు కూడా మంత్రిగా చాన్స్ కోసం తీవ్ర స్థాయిలో పైరవీ చేస్తుండటంతో అధిష్టానం ఒత్తిడికి గురి అవుతోంది. అయితే ఇటీవల చోటుచేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలో ఇక ఆలస్యం చేస్తే అసలుకే ఎసరు అన్న పరిస్థితి వస్తుందనే టెన్షన్ తో త్వరలోనే మంత్రి మండలి విస్తరణకు ముహూర్తం ఫిక్స్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.
ఉమ్మడి ఆదిలాబాద్ నుంచి ప్రేమ్ సాగర్ రావు, ఉమ్మడి నిజామాబాద్ నుంచి సుదర్శన్ రెడ్డి, ముదిరాజ్ సామాజికవర్గం నుంచి శ్రీహరి ముదిరాజ్ పేర్లు ఖరారు అయ్యాయని ప్రచారం జరుగుతోంది. ఇక మిగిలిన మూడు ఖాళీల్లో ఎవరికి చాన్స్ ఇస్తారనేది ఉత్కంఠ రేపుతోంది. హైదరాబాద్, రంగారెడ్డి కోటా నుంచి మల్ రెడ్డి రంగారెడ్డి తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఆయనకు పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి, దానం నాగేందర్ నుంచి పోటీ ఎదురవుతోందని చెబుతున్నారు. ఇక ఎమ్మెల్సీ కోటాలో కొత్తగా ఎన్నికైన అద్దంకి దయాకర్, విజయశాంతి పేర్లు కూడా గట్టిగా వినిపిస్తున్నాయి. ఈ ఇద్దరూ ఎస్సీ, బీసీ కోటాలో ఎంపికయ్యే చాన్స్ ఉందని అంటున్నారు.
మొత్తానికి 15 నెలల తర్వాత అధిష్టానం మంత్రివర్గం విస్తరణపై సీరియస్ గా ఫోకస్ చేయడంతో ఆశావహుల్లో ఒక్కసారిగా కదలిక వచ్చింది. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, దేవరకొండ ఎమ్మెల్యే బాలూనాయక్ కూడా మంత్రి పదవుల కోసం ఆరాటపడుతున్నారు. వీరిలో ఎవరిని ఎంపిక చేస్తుందోకానీ, ఈ సాయంత్రం లేదా రేపు ఉదయానికి సస్పెన్స్ తొలగిపోయే చాన్స్ కనిపిస్తోందంటున్నారు.