తెలంగాణ సీఎస్ మీద మోడీ సర్కార్ సీరియస్?

రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ ఎత్తున వర్షాలు కురవటం.. ఈ కారణంగా వరద పోటెత్తటం తెలిసిందే.

Update: 2024-09-05 01:30 GMT

రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ ఎత్తున వర్షాలు కురవటం.. ఈ కారణంగా వరద పోటెత్తటం తెలిసిందే. భారీ వర్షాలతో పాటు.. ఎగువ నుంచి వస్తున్న వరద పోటుతో పలు పట్టణాలు తీవ్ర అవస్థలకు గురి కావటం తెలిసిందే. తెలంగాణలో నల్గొండ.. ఖమ్మం జిల్లాలు దారుణంగా దెబ్బ తిన్నాయి. ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే విజయవాడ నగరంతో పాటు..గుంటూరు జిల్లాలోని కొన్ని ప్రాంతాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి.

తెలంగాణలో పలు చోట్ల ఇళ్లు కూలిపోవటం.. ఇళ్లల్లోకి వర్షపు నీరు చేరటం.. బాధితులకు తీవ్ర నష్టం జరగటం తెలిసిందే. తెలంగాణ వ్యాప్తంగా వేలాది ఎకరాల్లో పంటనష్టానికి గురైంది. పంటలు పెద్ద ఎత్తున నీట మునిగాయి. తమకు సాయం అందించాలంటూ కేంద్రాన్ని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ కోరారు. ఇదంతా ఒక ఎత్తు అయితే.. తెలంగాణలో వరద నష్టం వివరాల్ని కేంద్రానికి ఇప్పటివరకు రాష్ట్రం నుంచి వెళ్లని విషయం వెలుగు చూసింది. దీనిపై తెలంగాణ రాష్ట్ర సర్కారు పని తీరుపై కేంద్రం అసంత్రప్తిని వ్యక్తం చేసింది.

దీనికి సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శాంతికుమారికి కేంద్ర హోంశాఖ ఒక లేఖ రాసింది. తెలంగాణ వరద నష్టం వివరాల్ని కేంద్రానికి పంపని వైనాన్ని ప్రశ్నించింది.రాష్ట్రంలో వరద నష్టం వివరాల్ని నిర్ణీత ఫార్మాట్ లో తక్షణమే పంపాలని హోంశాఖ కోరింది. తెలంగాణ ప్రభుత్వం వద్ద ఇప్పటికే రూ.1345 కోట్ల ఎస్ డీఆర్ఎఫ్ నిధులు ఉన్నాయని.. వాటి ఖర్చుకు సంబంధించిన వివరాల్ని వెల్లడించాలని కోరింది.

అంతేకాదు.. వరదల వేళ సాయం కోసం ఇప్పటికే 12 ఎన్ డీఆర్ఎఫ్ దళాలు.. రెండు హెలికాఫ్టర్లు పంపించినట్లుగా లేఖలో పేర్కొన్నారు. ఎస్ డీఆర్ఎఫ్ నిధికి కేంద్రం వాటా నిధుల విడుదల కోసం తక్షణమే వివరాలు పంపాలని.. జూన్ లో రూ.208 కోట్ల విడుదలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి వినతి రాలేదని స్పష్టం చేసింది. అంతేకాదు.. వరద నష్టం వివరాల్ని ఎప్పటికప్పుడు రోజువారీగా పంపాలని లేఖలో కోరారు. ఓవైపు కేంద్రం నుంచి సాయం రావట్లేదని ప్రశ్నించే ముందు.. దానికి సంబంధించి రాష్ట్రప్రభుత్వం తరఫున కసరత్తు మీద ముఖ్యమంత్రి రేవంత్ ఒక కన్నేసి ఉంచాలన్న మాట వినిపిస్తోంది.

Tags:    

Similar News