సంధ్య థియేటర్ ఘటన.. తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం!
కుటుంబంతో కలిసి సరదాగా సినిమా చూసేందుకు వచ్చినవారు తమ కుటుంబ సభ్యురాలిని కోల్పోవడం తనను ఎంతగానో బాధించిందని మంత్రి కోమటిరెడ్డి అన్నారు!
హైదరాబాద్ లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ వద్ద ఉన్న సంధ్య థియేటర్ లో పుష్ప-2 బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన సంఘటన తీవ్ర కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... ఆ థియేటర్ లో సినిమా చూసేందుకు బన్నీ రావడంతో జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ మృతి చెందింది! ఈ నేపథ్యంలో తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది.
అవును... సంధ్య థియేటర్ వద్ద పుష్ప-2 బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాట తీవ్ర సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. దీనిపై థియేటర్ యాజమాన్యంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. భద్రత విషయంలో పోలీసులకు సమాచారం ఇవ్వకపోవడంతో పాటు.. ప్రైవేటు సెక్యూరిటీనీ ఏర్పాటు చేసుకోలేదని సెంట్రల్ జోన్ డీసీపీ తెలిపారు.
ఈ సందర్భంగా థియేటర్ యాజమాన్యం, అల్లు అర్జున్, ఆయన సెక్యూరిటీ టీమ్ పై పోలీసులు పలు సెక్షన్స్ కింద కేసు నమోదు చేశారు. దీనిపై దర్యాప్తు చేపట్టారు! ఈ వ్యవహారంపై పలు విద్యార్థి సంఘాల నుంచి కీలక డిమాండ్ తెరపైకి వచ్చింది.. ఇలాంటి స్పెషల్ షోలకు అనుమతులు ఇవ్వకూడదనే డిమాండ్ బలంగా వినిపిస్తోంది.
ఈ సమయంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ తొక్కిసలాట ఘటనతో అప్రమత్తమైనట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా... ఇకపై ఏ సినిమాకు బెనిఫిట్ షోలకు అనుమతులు ఇవ్వబోమని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రకటించారు. సిటీ నడిబొడ్డున బెనిఫిట్ షో వేయడం వల్ల శాంతిభద్రతలకు విఘాతం కలిగే అవకాశం ఉందని తెలిపారు!
కుటుంబంతో కలిసి సరదాగా సినిమా చూసేందుకు వచ్చినవారు తమ కుటుంబ సభ్యురాలిని కోల్పోవడం తనను ఎంతగానో బాధించిందని మంత్రి కోమటిరెడ్డి అన్నారు!
కాగా.. సుకుమార్ దర్శకత్వంలో, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప-2 ప్రపంచ వ్యాప్తంగా విడుదలై సందడి చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే హైదరాబాద్ లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్ వద్ద విషాదం చోటు చేసుకొంది. ఇందులో భాగంగా.. అల్లు అర్జున్ ను చూసేందుకు ఫ్యాన్స్ ఎగబడటంతో తొక్కిసలాట జరిగింది.
ఈ సమయంలో బెనిఫిట్ షో చూసేందుకు వచ్చిన రేవతి, ఆమె భర్త భాస్కర్, కుమారుడు శ్రీతేజ్, కుమార్తె సన్విక థియేటర్ లోకి వెళ్లారు. ఈ సమయంలో ఊహించని స్థాయిలో తొక్కిసలాట జరగడంతో రేవతి, ఆమె కుమారుడికి ఊపిరి ఆడకపోవడంతో.. పోలీసు సిబ్బంది వారిని బయటకు లాగి, ఆమె కుమారుడికి సీపీఆర్ చేశారు.
అనంతరం దుర్గాబాయి దేశ్ ముఖ్ ఆస్పత్రికి తరలించారు. అయితే... రేవతి అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించగా.. మెరుగైన చికిత్స కోసం ఆమె కుమారుడు శ్రీతేజ ను మరో ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మెరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.