హైడ్రా టార్గెట్ చేంజ్.. ఇళ్లను వదిలి ఇక వాటిపైకి..

హైడ్రా వ్యవస్థ అమల్లోకి వచ్చినప్పటి నుంచి కబ్జాదారులను నిద్ర పోనివ్వడం లేదు.

Update: 2024-10-18 10:55 GMT

హైడ్రా వ్యవస్థ అమల్లోకి వచ్చినప్పటి నుంచి కబ్జాదారులను నిద్ర పోనివ్వడం లేదు. అక్రమ నిర్మాణాలను ఎక్కడికక్కడ నేలమట్టం చేస్తూ ముందుకు దూసుకెళ్తూనే ఉంది. వందలాది అక్రమ కట్టడాలను కూల్చివేసిన హైడ్రా.. ఇప్పుడు తన టార్గెట్‌ను చేంజ్ చేసినట్లుగా తెలుస్తోంది. మరో కొత్తరకం ఆపరేషన్‌కు రెడీ అయింది. పెద్దపెద్ద అపార్ట్‌మెంట్లు, విల్లాలను తన బుల్డోజర్లతో కూల్చిన హైడ్రా.. ఇప్పడు తన లక్ష్యాన్ని మార్చుకుంది.

హైదరాబాద్ అంటేనే విపరీతమైన ట్రాఫిక్. ఏ గల్లీలో నుంచి ఎక్కడ ఎన్ని గంటల పాటు ఇరుక్కుంటామో కూడా తెలియదు. ఎక్కడికక్కడ రోడ్లపైనే పార్కింగులు.. వచ్చీపోయే వాహనాలతో పడుతున్న ఇబ్బందులు అన్నీఇన్నీ కావు. దాంతో వాహనదారులు నగర రోడ్లపై ప్రయాణించాలంటేనే భయపడాల్సిన పరిస్థితి ఉంది. అయితే.. హైడ్రా ఈ కష్టాలకు చెక్ పెట్టేందుకు సిద్ధమైంది. ముఖ్యంగా నగర ట్రాఫిక్ వ్యవస్థతో కలిసి ట్రాఫిక్ జామ్‌కు స్వస్తి పలికే మార్గం ఎంచుకుంది. ట్రాఫిక్ సమస్యలను తొలగించేందుకు ట్రాఫిక్ విభాగంతో పనిచేయాలని నిర్ణయించింది.

ఇందులో భాగంగా ఫుట్‌పాత్‌లను టార్గెట్ చేసింది. ఇప్పటిదాకా ఇళ్లను మాత్రమే కూల్చివేస్తూ వచ్చిన హైడ్రా.. ఇక నుంచి ఫుట్‌పాత్‌లపై దృష్టి సారించబోతోంది. ఈ మేరకు ఇటీవల హైడ్రా కమిషనర్ రంగనాథ్, ట్రాఫిక్ కమిషనర్ విశ్వప్రసాధ్ భేటీ అయ్యారు. వారి భేటీలో ఫుట్‌పాత్‌లపై కీలక నిర్ణయం తీసుకున్నారు. నగరంలో ఎక్కడెక్కడ ఫుట్‌పాత్‌లు ఆక్రమణకు గురయ్యాయో ముందుకు వాటిని గుర్తించనున్నారు. ఆ తరువాత ఆక్రమణదారులకు నోటీసులు జారీ చేస్తారు. అనంతరం బుల్డోజర్ల సహాయంతో వాటిని కూల్చబోతున్నారు. అయితే.. ఫుట్‌పాత్‌లను ఆక్రమించి ప్రభుత్వ కట్టడాలు ఉన్నా కూడా.. వాటినీ కూల్చివేయాలని నిర్ణయం తీసుకున్నారు.

అలాగే.. డీఆర్ఎఫ్ బృందాలకు ట్రాఫిక్ నియంత్రణపై శిక్షణ ఇప్పించాలని కూడా హైడ్రా నిర్ణయించింది. వర్షం పడినప్పుడల్లా వాటర్ లాగింగ్ పాయింట్ల వద్ద నీరు నిల్వ లేకుండా చర్యలు తీసుకునేందుకు సిద్ధం అయ్యారు. తక్షణమే నీరు తొలగించేలా హైపవర్ మోటార్లనూ వినియోగించనున్నారు. ఈ నీటిని తొలగించంతోపాటు.. వరద కాలువలు, పైపుల్లో పేరుకుపోయిన వ్యర్థాలను తొలగించడం లాంటి పనులనూ చేపట్టబోతున్నారు. ఒకవేళ అక్కడ కొత్త లైన్లు అవసరం పడితే వేసేందుకూ నిర్ణయించారు. హైడ్రా తాజా నిర్ణయంతో నగరంలో ట్రాఫిక్ సమస్యలు తీరడమే కాకుండా.. ఫుట్‌పాత్‌లపై పాదాచారులు స్వేచ్ఛగా నడుచుకుంటూ వెళ్లే వెసులుబాటు కలుగుతుందన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

Tags:    

Similar News