సర్పంచుగా పోటీకి వారు కూడా అర్హులే.. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం!
గతంలో ఎన్నడూ లేని విధంగా సీఎం రేవంత్ వినూత్న ఆలోచన చేస్తున్నట్లుగా టాక్ నడుస్తోంది.
మరికొద్ది నెలల్లోనే తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగబోతున్నాయి. ఇప్పటికే పంచాయతీల్లో పాలన ముగిసి ఏడాది సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్లు తెలుస్తున్నది. గతంలో ఎన్నడూ లేని విధంగా సీఎం రేవంత్ వినూత్న ఆలోచన చేస్తున్నట్లుగా టాక్ నడుస్తోంది.
పంచాయతీ చట్టం ప్రకారం.. ఇప్పటివరకు ఇద్దరు పిల్లలు ఉన్న వారు మాత్రమే సర్పంచులుగా పోటీ చేసేందుకు అవకాశం ఉంది. ప్రస్తుతం చట్టం ప్రకారం జూన్ 1, 1995 తరువాత మూడో సంతానం ఉన్న వ్యక్తులు పోటీ చేసేందుకు అనర్హులుగా పరిగణించబడ్డారు. దాంతో ముగ్గురు పిల్లలు ఉన్న వారంతా ఇప్పటివరకు సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేయలేకపోయారు. అలా చాలా మంది పోటీకి దూరంగా ఉండిపోయారు. దీంతో ఈ చట్టానికి సవరణ చేసేందుకు ప్రభుత్వం సన్నద్ధం అవుతున్నట్లుగా తెలిసింది.
ఈ చట్ట సవరణ ప్రకారం ఇకపై ఇద్దరు కంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్న వారు కూడా లోకల్ బాడీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ప్రభుత్వం వెసులుబాటు కల్పించనుంది. ఈ నిబంధనను తొలగించాలని చట్టం నుంచి సవరణ చేసేందుకు సీఎం సానుకూలంగా ఉన్నారని తెలుస్తోంది. త్వరలో జరగనున్న అసెంబ్లీ సమావేశాల్లో చట్ట సవరణ చేసేందుకు ప్రభుత్వం ప్లాన్ చేస్తున్నట్లుగా సమాచారం. సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ, కార్పొరేటర్, కౌన్సిలర్‌గా అందరికీ అవకాశం కల్పించాలనే ఉద్దేశంతో ముందుకు సాగుతున్నట్లుగా తెలుస్తోంది.
ముందుగా సమగ్ర కుటంబ రాజకీయ, ఆర్థిక సర్వే పూర్తి చేయబోతున్నారు. ఆ వెంటనే, బీసీ జనాభా లెక్కింపు, రిజర్వేషన్లను ఫైనల్ చేయబోతున్నారు. అదే సమయంలో ప్రస్తుతం ఉన్న పంచాయతీ, మున్సిపల్ చట్టాలను సవరించేందుకు ప్లాన్ చేస్తున్నారు. దీంతోపాటే గత ప్రభుత్వం సర్పంచులపై వేటు వేసే అధికారాన్ని కలెక్టర్లకు అప్పగించింది. దానిని కూడా తొలగించాలని ముఖ్యమంత్రి ప్లాన్ చేస్తున్నారని తెలిసింది. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన సర్పంచులపై కలెక్టర్లు వేటు వేసే నిబంధనను తొలగించబోతున్నారన్న టాక్ నడుస్తోంది.