ముంబైలో రాహుల్....తెలంగాణలో ఆడుకుంటున్న నిరుద్యోగులు
కాంగ్రెస్ యువనేత రాహుల్ గాంధీ, మునుపెన్నడూ లేని రీతిలో రాజకీయ పరిణతిని సంతరించుకుంటున్న సంగతి తెలిసిందే.
కాంగ్రెస్ యువనేత రాహుల్ గాంధీ, మునుపెన్నడూ లేని రీతిలో రాజకీయ పరిణతిని సంతరించుకుంటున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా భారత్ జోడో యాత్రతో రాహుల్ గతంలో తనపై ఉన్న ముద్రను తొలగించుకున్నారని విశ్లేషకుల అంచనా. అందుకే, సోనియాగాంధీ ఆయన్ను పలు కీలక అంశాల్లో ముందు ఉంచుతోంది. ఏకంగా ప్రతిపక్ష నాయకుడి బాధ్యతను కూడా కట్టబెట్టింది. ఇప్పుడు కీలక రాష్ట్రమైన మహారాష్ట్రలో జరుగుతున్న ఎన్నికల్లో గెలుపు బాద్యతను రాహుల్ గాంధీ తన భుజనా వేసుకున్నాడు. అయితే, ఈ ఎపిసోడ్లో రాహుల్ కామెంట్లు ట్రోలింగ్ కు గురవుతున్నాయి. అందులోనూ తెలంగాణలో!
కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ముంబైలో ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ, మహారాష్ట్ర ప్రజలకు ఐదు హామీలను ప్రకటించారు. రాష్ట్రంలోని ప్రజలకు రూ.25 లక్షల ఆరోగ్య బీమా, కుల గణన, ప్రజలకు ఉచిత మందులు, ఆడపిల్లలు, మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం వంటి ఐదు హామీలు కాంగ్రెస్ హామీల్లో ఉన్నాయి. రాష్ట్రంలోని మహిళలకు మహాలక్ష్మి పథకం కింద నెలకు రూ.3వేలు, నిరుద్యోగ యువకులకు రూ.4వేలు భృతి లభిస్తుందని కాంగ్రెస్ అధినేత తెలిపారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలైన కర్ణాటక మరియు తెలంగాణలలో మాదిరిగానే రాష్ట్రంలో కుల గణనను చేస్తానని మరియు 50% రిజర్వేషన్ అడ్డంకిని తొలగిస్తామని హామీ ఇచ్చారు.
అయితే, మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను తెలంగాణ యువత సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే రూ 4016/- నిరుద్యోగ భృతి ఇస్తామని రాహుల్ గాంధీ చెప్పిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి దాదాపు ఏడాది గడుస్తున్న నేపథ్యంలో `తెలంగాణ రాష్ట్రంలో ఇచ్చిన హామీ రకంగానే ప్రతి నిరుద్యోగికి 11 నెలలు బకాయి పడిన 44,176/- తెలంగాణ రాష్ట్రంలో ఎప్పుడు ఇస్తారు...???👆` అంటూ ప్రశ్నిస్తున్నారు.
దీంతోపాటుగా, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలైన కర్ణాటక మరియు తెలంగాణలలో మాదిరిగానే రాష్ట్రంలో కుల గణనను చేస్తానని చెప్తున్న రాహుల్ తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయని నిరుద్యోగ భృతి గురించి ఎందుకు ప్రస్తావించడం లేదని పలువురు సోషల్ మీడియాలో నిలదీస్తున్నారు. తెలంగాణ పొరుగు రాష్ట్రమైన మహారాష్ట్రలో రాహుల్ ఇస్తున్న హామీలు తెలంగాణలో కాంగ్రెస్ పాలనను ప్రశ్నించే స్థితికి చేరిపోయిందని పలువురు కామెంట్లు చేస్తున్నారు.