ఇది.. కేసీఆర్‌ కు ఊహించని పరాభవం!

జూన్‌ 2కి తెలంగాణ ఏర్పడి పదేళ్లు అవుతోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ దశాబ్ద వేడుకలను రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం నిర్వహించాలని తలపెట్టింది.

Update: 2024-05-21 14:30 GMT

తెలంగాణ లె చ్చినవాడిగా బీఆర్‌ఎస్‌ శ్రేణుల భజనలు, తెలంగాణ జాతిపిత అని వంధిమాగధుల కీర్తనలు, తెలంగాణ కోసమే ఆయన జన్మించారనే అతిశయోక్తులు... ఇలా దాదాపు పదేళ్లు ముఖ్యమంత్రిగా కేసీఆర్‌ హవా సాగిపోయింది. అయితే బళ్లు ఓడలయినట్టు.. ఓడలు బళ్లు అయినట్టు కేసీఆర్‌ పరిస్థితి మారిపోయింది.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ సంగతి దేవుడెరుగు, స్వయంగా ఎమ్మెల్యేగా కేసీఆరే ఓటమి పాలై పదేళ్లు ముఖ్యమంత్రిగా ఉండి ఓడిపోయిన వ్యక్తిగా రికార్డు సృష్టించారు. ఇప్పటికే రాష్ట్రంలో అధికారం పాయే.. ఇప్పుడు కేంద్రంలో చక్రం తిప్పుదామని పెద్ద కలలే కంటున్నా ఒక్క ఎంపీ సీటు రాదని దాదాపు అన్ని సర్వే సంస్థలు తేల్చిచెప్పాయి. దీంతో ఐదేళ్లపాటు కేసీఆర్‌ ఫామ్‌ హౌస్‌ లో పడుకోక తప్పదు.

ఈ పరాభవాలు చాలవన్నట్టు ఇప్పుడు రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం తెలంగాణ ఆవిర్భావ వేడుకలను నిర్వహించనుంది. జూన్‌ 2కి తెలంగాణ ఏర్పడి పదేళ్లు అవుతోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ దశాబ్ద వేడుకలను రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం నిర్వహించాలని తలపెట్టింది. అయితే తెలంగాణ తెచ్చినవాడిగా బీఆర్‌ఎస్‌ శ్రేణుల భజనలు అందుకుంటున్న కేసీఆర్‌ ను కాంగ్రెస్‌ ప్రభుత్వం లైట్‌ తీసుకుంది.

తెలంగాణ పదేళ్ల ఆవిర్భావ వేడుకలకు కాంగ్రెస్‌ పార్టీ అగ్ర నేత సోనియా గాంధీని ఆహ్వానించాలని రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం నిర్ణయించింది. తెలంగాణ ఇవ్వాలని సోనియాగాంధీ నిర్ణయించుకోకపోతే రాష్ట్రం ఏర్పడేదే కాదనే విషయం అందరికీ తెలిసిందే. కేంద్రంలో కాంగ్రెస్‌ ఆధ్వర్యంలోని నాటి యూపీఏ ప్రభుత్వమే తెలంగాణను ఏర్పాటు చేసింది. ఇందులో క్రియాశీలక పాత్ర యూపీయే చైర్‌ పర్సన్‌ గా ఉన్న సోనియా గాంధీదే.

అయితే తెలంగాణ ఏర్పడ్డాక ఆ క్రెడిట్‌ మొత్తాన్ని కేసీఆర్‌ కొట్టేశారు. తెలంగాణ ఇస్తే తన పార్టీని కాంగ్రెస్‌ పార్టీలో విలీనం చేస్తానని బేషరతుగా ఒప్పుకున్న కేసీఆర్‌ ఆ తర్వాత తూచ్‌ అన్నారు. తెలంగాణ ప్రయోజనాల కోసం నాడు ఉద్యమ పార్టీగా ఉన్న టీఆర్‌ఎస్‌ ను కొనసాగిస్తామని.. అధికారంలోకి వస్తే దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానని ప్రగల్భాలు పలికింది కూడా కేసీఆరే. ఆ తర్వాత అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి పీఠంపై కూర్చున్నారు. ఇంటిల్లపాదిని పదవుల్లో నింపేశారు.

అంతేకాకుండా ఏ పార్టీ అయితే తమకు తెలంగాణ ఇచ్చిందో ఆ పార్టీనే తెలంగాణలో నామరూపాల్లేకుండా చేయడానికి కేసీఆర్‌ కంకణం కట్టుకున్నారు. కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ముఖ్య నేతలను, ఆ పార్టీ తరఫున గెలిచిన ఎమ్మెల్యేలను పెద్ద ఎత్తున తన పార్టీలో చేర్చుకున్నారు.

ఇంతలా ఎగిరెగిరిపడ్డ కేసీఆర్‌ కు ఇప్పుడు బ్యాడ్‌ టైమ్‌ నడుస్తోంది. నీవు నేర్పిన విద్యయే నీరజాక్ష అన్నట్టు కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆయనను లైట్‌ తీసుకుంది, తెలంగాణ పదేళ్ల ఆవిర్భావ వేడుకలకు సోనియా గాంధీని ముఖ్య అతిథిగా ఆహ్వానిస్తోంది. కేసీఆర్‌ ను పూర్తిగా లైట్‌ తీసుకుంది. ఇందులో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డిని తప్పుపట్టాల్సిన అవసరం ఏమాత్రం కనిపించడం లేదని అంటున్నారు. నాడు తెలంగాణ ఏర్పాటుకు సోనియాగాంధీ ఒప్పుకోకపోతే రాష్ట్రం వచ్చి ఉండేది కాదని అందరూ ఒప్పుకునే మాటే. ఈ నేపథ్యంలో ఆమెను వేడుకలకు ముఖ్య అతి«థిగా పిలుస్తున్నారు.

కొద్ది రోజుల క్రితం తెలంగాణ క్యాబినెట్‌ సమావేశంలో తెలంగాణ ఏర్పాటుకు సహకరించిన వారిని వేడుకలకు ఆహ్వానించాలని నిర్ణయించారు. అయితే ఇందులో కేసీఆర్‌ కు ఎలాంటి స్థానం ఉండబోదనే టాక్‌ నడుస్తోంది.

ఇది కేసీఆర్‌ స్వయంకృతాపరాథం అని అంటున్నారు. తెలంగాణ తెచ్చిన కీర్తిని మొత్తంగా కొట్టేయాలని ఆయన చూశారు. ఇందులో భాగంగానే తెలంగాణ ఉద్యమంలో చాలా కీలక పాత్ర పోషించిన కోదండరాంను లైమ్‌ లైట్‌ లో లేకుండా చేశారు. ఆయనొక్కరే కాదు తెలంగాణ కోసం ఉద్యమించిన ఎంతోమందిని ఆయన పట్టించుకోలేదు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్‌ పార్టీకి కేసీఆర్‌ కనీసం కృతజ్ఞతలు కూడా తెలపలేదు. పైగా యువకులు బలిదానాలకు కాంగ్రెస్‌ పార్టీయే కారణమని నిందలు మోపారు.

ఈ నేపథ్యంలో తెలంగాణ పదేళ్ల ఆవిర్భావ వేడుకలకు తనను పిలవలేదని కేసీఆరో ఆ పార్టీ నేతలో ప్రశ్నించే నైతిక హక్కు వారికి ఉండదని అంటున్నారు. అందుకే అంటారు.. ‘చేసుకున్నవారికి చేసుకున్నంత’.

Tags:    

Similar News