ఇప్పుడు క్యాబినెట్ విస్తరణ ఎందుకు ?

గంపను ఎందుకు మంత్రిని చేయాలంటే తన నియోజకవర్గాన్ని కేసీయార్ కు త్యాగం చేసినందుకు ప్రతిఫలం అన్నమాట

Update: 2023-08-22 09:17 GMT

కేసీయార్ ఆలోచన ఏమిటో ఒకపట్టాన ఎవరికీ అర్ధంకావు. ఏ పని ఎందుకు చేస్తారో తెలీదు ? చేయాల్సిన పనిని ఎందుకు చేయకుండా వదిలేస్తారో కూడా ఎవరు చెప్పలేరు. ఇపుడు ఇదంతా ఎందుకంటే బుధవారం క్యాబినెట్ విస్తరణ పెట్టుకున్నారు. అప్పెడెప్పుడో మంత్రివర్గం నుండి తొలగించిన పట్నం మహేందర్ రెడ్డిని ఇపుడు కొత్తగా మంత్రివర్గంలోకి తీసుకోబోతున్నారట. అలాగే ఒకళ్ళిద్దరిని డ్రాప్ చేయబోతున్నట్లు పార్టీవర్గాల సమాచారం. ఎందుకు డ్రాప్ చేస్తున్నారంటే కామురెడ్డి సిట్టింగ్ ఎంఎల్ఏ గంప గోవర్ధన్ ను మంత్రిని చేయటానికట.

గంపను ఎందుకు మంత్రిని చేయాలంటే తన నియోజకవర్గాన్ని కేసీయార్ కు త్యాగం చేసినందుకు ప్రతిఫలం అన్నమాట. బీఆర్ఎస్ కు బలంగా ఉన్న కామారెడ్డి నియోజకవర్గంలో పోటీచేయాలని గంప నాలుగురోజుల క్రితమే కేసీయార్ కు విజ్ఞప్తిచేశారు. ఆయన విజ్ఞప్తిని మన్నించిన కేసీయార్ వెంటనే పోటీకి రెడీ అయ్యారు. తాను పోటీ చేస్తున్న గజ్వేలుతో పాటు అదనంగా కామారెడ్డిలో కూడా పోటీచేయబోతున్నారు.

కేసీయార్ పోటీచేయాలని అనుకోవటం వల్ల గంపకు పోటీచేయటానికి నియోజకవర్గం లేకుండా పోయింది. అందుకని మంత్రివర్గంలోకి తీసుకుంటున్నారట. అంటే రేపటి ఎన్నికల్లో కామారెడ్డిలో కేసీయార్ గెలుపు బాధ్యతలను మంత్రిహోదాలో గంపే పర్యవేక్షించబోతున్నారన్న విషయం అర్ధమవుతోంది. అప్పట్లో పట్నంను మంత్రివర్గం నుండి ఎందుకు డ్రాప్ చేశారు ? ఇపుడు ఎందుకు తీసుకుంటున్నారో ఎవరికీ అర్ధంకావటంలేదు. అలాగే ఒకళ్ళిద్దరిని డ్రాప్ చేయబోతున్నట్లు చెప్పుకుంటున్నారు. ఇపుడు డ్రాప్ చేయబోయే వాళ్ళు పార్టీకి ఎదురుతిరగటం ఖాయం.

నిజానికి మరో నాలుగునెలల్లో షెడ్యూల్ ఎన్నికలున్న సమయంలో మంత్రివర్గంలోకి ఎవరిని తీసుకున్నా, ఎవరిని పక్కనపెట్టినా పెద్దగా ప్రభావం చూపే అవకాశంలేదు. మంత్రివర్గంలో చేరిన వాళ్ళు ఎలాగ హ్యాపీగా ఫీలవుతారో డ్రాప్ అయిన వాళ్ళు అవమానంగా ఫీలవుతారు. అవమానంగా ఫీలయ్యే వాళ్ళు ఎందుకు ఊరుకుంటారు ? తమ శక్తిమేరకు ఏదో ఒక కంపుచేయటానికి ప్రయత్నిస్తారనటంలో సందేహంలేదు. ఈటల రాజేందర్ స్ధానాన్ని పట్నం మహేందర్ రెడ్డితో భర్తీ చేయబోతున్నారనే కలరింగ్ విచిత్రంగా ఉంది. ఎందుకంటే ఈటల పార్టీని వదిలేసి సుమారు ఏడాదవుతోంది. ఆ స్ధానాన్ని భర్తీ చేయాలని కేసీయార్ కు ఇపుడే గుర్తుకొచ్చిందా .

Tags:    

Similar News