దరఖాస్తులంతా ఉత్త షో మాత్రమేనా ?

ఇతర పార్టీల నుండి వచ్చేవాళ్ళకి టికెట్లు ఇవ్వకపోతే వాళ్ళు ఎందుకు పార్టీలో చేరుతారనే ప్రశ్న పార్టీలోనే చక్కర్లు కొడుతోంది.

Update: 2023-09-12 08:25 GMT

తెలంగాణా బీజేపీ ఆహ్వానించిన దరఖాస్తుల ప్రక్రియ అంతా ఉత్త షో మాత్రమే అనే ప్రచారం మొదలైంది. రాబోయే ఎన్నికల్లో పోటీచేయాలని అనుకుంటున్న వాళ్ళు కచ్చితంగా దరఖాస్తు చేసుకోవాల్సిందే అని పార్టీ ఢిల్లీ పెద్దలు నిబంధన విధించారు. దానికి అనుగుణంగానే ఈనెల 2వ తేదీనుండి 10వ తేదీవరకు దరఖాస్తులు తీసుకున్నారు. దీని ప్రకారం 6010 దరఖాస్తులు వచ్చాయి. నిజానికి ఇన్ని వేల దరఖాస్తులు వస్తాయని నాయకత్వం కూడా ఊహించుండదు.

అయితే ఇక్కడే పెద్ద ట్విస్టుంది. అదేమిటంటే పార్టీలోని ఎంపీలు దరఖాస్తులు చేసుకోలేదు. అలాగే ఈటల రాజేందర్ కూడా దరఖాస్తు ఇవ్వలేదు. అంటే మరి వీళ్ళకి టికెట్లు ఇవ్వరా ? లేకపోతే టికెట్లకోసం తాము దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదని అనుకున్నారా ? కిషన్ రెడ్డి, బండి సంజయ్, బాబూరావు, ధర్మపురి అర్వింద్, లక్ష్మణ్ ఎందుకు దరఖాస్తులు చేసుకోలేదు అనే చర్చ పార్టీలో పెరిగిపోతోంది. ఇక రెండోపాయింట్ ఏమిటంటే ఇతరపార్టీల్లో నుండి బీజేపీలో చేరదలచుకున్న వాళ్ళకి టికెట్లు ఇవ్వరా ? అనే చర్చ మొదలైంది.

ఇతర పార్టీల నుండి వచ్చేవాళ్ళకి టికెట్లు ఇవ్వకపోతే వాళ్ళు ఎందుకు పార్టీలో చేరుతారనే ప్రశ్న పార్టీలోనే చక్కర్లు కొడుతోంది. కాబట్టి దరఖాస్తులు చేయని ఎంపీలు, ఈటలకు టికెట్లు రావనేందుకు లేదు. అలాగే ఎవరైనా చేరాలని అనుకుంటే వాళ్ళకి కచ్చితంగా టికెట్లు ఇవ్వాల్సిందే. మరి ఈ రెండు కరెక్టే అయితే ఇక దరఖాస్తుల ప్రక్రియంతా ఎందుకు ? దరఖాస్తులు చేసుకున్న వాళ్ళ పరిస్ధితి ఏమిటి ?

పార్టీ వర్గాల సమాచారం ప్రకారం చూస్తే దరఖాస్తుల ప్రక్రియంతా ఉత్త షో మాత్రమే అని అనుమానిస్తున్నారు. గతంలో కూడా ఎప్పుడూ ఆశావహుల నుండి దరఖాస్తులు ఆహ్వానించిందిలేదు. నేతల కెపాసిటి ఆధారంగా పార్టీ పెద్దలే టికెట్లు కేటాయించేసేవారు. మొదటిసారిగా దరఖాస్తుల ప్రక్రియను ప్రవేశపెట్టారు. దరఖాస్తుల ప్రక్రియ బ్రహ్మాండంగా సక్సెస్ అయ్యిందనే చెప్పాలి. కాకపోతే జరుగుతున్నదంతా ఉత్త షో మాత్రమే అని నిర్ధారణ అయితే దరఖాస్తులు చేసుకున్న నేతలు ఎలా రియాక్టవుతారన్నది ఆసక్తిగా మారింది.

Tags:    

Similar News