పులి లాంటి కేసీఆర్ ఓటమి పిల్లిని చేసిందా?

రాజకీయ నాయకుడి జీవితంలో గెలుపు.. ఓటములు సర్వసాధారణం. గెలుపునకు పొంగిపోవటం.. ఓటమికి కుంగిపోవటం సరికాదు.

Update: 2024-06-24 08:30 GMT

మొదట్నించి ఒకేలాంటి తీరును ప్రదర్శించే గులాబీ బాస్ కేసీఆర్.. పదేళ్లు (తొమ్మిదిన్నరేళ్లు అనుకోండి) అప్రతిహతంగా పాలన సాగించిన ఆయనకు ఇప్పుడు గడ్డుకాలం నడుస్తోంది. ఒకప్పుడు పులి లాంటి కేసీఆర్ అంటూ కీర్తించే గులాబీ నేతలు సైతం ఇప్పుడు కామ్ గా ఉంటున్నారు. అన్నింటికి మించి మిగిలిన విపక్ష నేతలకు భిన్నంగా పత్తా లేకుండా పోవటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

రాజకీయ నాయకుడి జీవితంలో గెలుపు.. ఓటములు సర్వసాధారణం. గెలుపునకు పొంగిపోవటం.. ఓటమికి కుంగిపోవటం సరికాదు. రెండింటిని బ్యాలెన్సు చేస్తూ.. ఓటమి వేళ గెలుపు దిశగా పయనించాల్సిన అవసరం ఉంది. వాస్తవాలకు దగ్గరగా ఉండటం ప్రజాజీవితంలో ఉన్న వారికి ఎంత ముఖ్యమన్న విషయాన్ని కేసీఆర్ ఇప్పటికైనా గుర్తిస్తే మంచిది. తనదైన ప్రపంచంలో ఉంటూ.. తనకు మించిన తోపు మరెవరూ లేరన్న భ్రమల నుంచి బయటకు రావాల్సిన అవసరం ఉంది. పులి లాంటి కేసీఆర్ ను ఎంత ఓటమి అయితే మాత్రం పత్తా లేకుండా పోయారన్న ప్రచారం ఎంతమాత్రం మంచిది కాదు.

అదే సమయంలో.. గులాబీ చెట్టుకున్న పువ్వులు.. కాయలు.. ఆకులు.. (ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నేతలు ఒక్కొక్కటిగా వీడిపోవటం ఏ మాత్రం మంచి సంకేతం కాదు. ఇలాంటప్పుడు చూస్తూ ఉండే కన్నా.. బయటకు వెళ్లే వారిని నిలువరించే ప్రయత్నం చేయటం అవసరం. అందుకు భిన్నంగా మీకు ఎంత చేశాం? మాకు ఇలా చేస్తారా? అన్న మాటలు ఎబ్బెట్టుగా ఉంటాయి. కారణం.. తాము అధికారంలో ఉన్నప్పుడు ఏ నీతిని ఫాలో అయ్యామో ఆ దిశగానే ఇప్పుడున్న అధికారపక్షం నడుస్తోందన్న విషయాన్ని మర్చిపోకూడదు.

లోక్ సభ ఎన్నికల్లో రెండెంకల సీట్లు సాధించటం పక్కా అంటూ బడాయి మాటలకు భిన్నంగా ఒక్కటంటే ఒక్క సీటు కూడా దక్కించుకోని తీరు కేసీఆర్ ను కుంగదీసిందని చెబుతారు. వాస్తవానికి ఎన్నికల్లో ఒక్క సీటు తప్పించి.. మిగిలిన ఎక్కడా గెలిచే అవకాశం లేదని ప్రతి ఒక్క పొలిటికల్ రిపోర్టర్ కు తెలిసినప్పుడు.. ఆ సమాచారాన్ని కేసీఆర్ అండ్ కోకు తెలియలేదన్నది ప్రశ్న. దీనికి కారణం.. గ్రౌండ్ లెవల్ లో ఏం జరుగుతుందన్న సమాచారాన్ని సేకరించే వ్యవస్థ కేసీఆర్ కు ఉన్నప్పటికీ.. ఆ సమాచారాన్ని ఆయనకు చేరవేసే వ్యక్తులకు నిజాల్ని నిర్భయంగా చెప్పే ధైర్యం లేకపోవటమే సమస్య. అందుకు తగ్గ వాతావరణాన్ని ఏర్పాటు చేయకపోవటం కేసీఆర్ వైఫల్యంగా చెప్పాలి.

వరుస ఓటములతో కుంగిపోయి.. ఎవరికి అందుబాటులోకి రాకుండా ఫాం హౌస్ (కేసీఆర్ భాషలో చెప్పాలంటే ఫార్మర్ హౌస్ లో) వ్యవసాయం చేసుకుంటూ.. తనదైన ప్రపంచంలో పరిమితం కావటం సరికాదంటున్నారు. ఇలా చేయటం ద్వారా ప్రజలు సైతం మర్చిపోయే ప్రమాదం ఉంది. తన మాటలతో ప్రజల్ని కన్వీన్స్ చేసే రోజులు తన తీరుతో పోగొట్టుకుంటానన్న విషయాన్ని కేసీఆర్ గుర్తిస్తే మంచిదంటున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబును స్ఫూర్తిగా తీసుకోవాలంటున్నారు. ఓటమి వేళలోనూ నేతలకు.. పార్టీ కార్యకర్తలకు అందుబాటులో ఉండే ఆయన తీరును.. ఒకప్పటి ఆయన శిష్యుడిగా కేసీఆర్ ఫాలో కావటం మంచిదంటున్నారు. ఆ విషయాల్ని కేసీఆర్ ఎప్పటికి గుర్తిస్తారో?

Tags:    

Similar News