ప్రగతిభవన్ లో యశోదా ఆస్పత్రి వైద్యులు... కేసీఆర్ కు ఏమైంది?
తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు స్వల్ప అస్వస్థతకు లోనయ్యారు. గతకొన్ని రోజులుగా ఆయన విపరీతమైన దగ్గు, జ్వరంతో బాధపడుతున్నారు
తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు స్వల్ప అస్వస్థతకు లోనయ్యారు. గతకొన్ని రోజులుగా ఆయన విపరీతమైన దగ్గు, జ్వరంతో బాధపడుతున్నారు. వైరల్ ఫీవర్ కారణంగా అనారోగ్యానికి గురయ్యారు. అయితే ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. త్వరలోనే ఆయన సాధారణ స్థితికి చేరుకుంటారని సమాచారం.
అవును... కేసీఆర్ వారం రోజులుగా వైరల్ ఫీవర్, దగ్గుతో భాదపడుతున్నారు. దీంతో ప్రగతి భవన్ లో యశోద హాస్పిటల్ వైద్యుల పర్యవేక్షణలో సీఎం కేసీఆర్ కు వైద్యం అందుతోందని తెలుస్తోంది. ఇదే విషయాన్ని సీఎం కుమారుడు, రాష్ట్ర మంత్రి కేటీఆర్ కూడా నిర్ధారించారు. ఈ విషయాన్ని ఆయన తన "ఎక్స్" (ట్విట్టర్) ఖాతా ద్వారా వెల్లడించారు.
ఇందులో భాగంగా... "సీఎం కేసీఆర్ గారు ఒక వారం రోజులుగా వైరల్ ఫీవర్, దగ్గుతో బాధపడుతున్నారు. ఆయనకు మెడికల్ బృందం ఇంటి వద్దే చికిత్స అందిస్తోంది. చాలా జాగ్రత్తగా పర్యవేక్షిస్తున్నారు. కొన్ని రోజుల్లోనే సీఎం కేసీఆర్ తిరిగి సాధారణ స్థితికి చేరుకుంటారని వైద్యులు చెప్పారు" అని ట్వీట్ చేశారు.
ఆ సంగతి అలా ఉంటే మరోపక్క ఈ నెల 29న సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం నిర్వహించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించినట్టు తెలిసింది. గవర్నర్ కోటా కింద ఎమ్మెల్సీలుగా డాక్టర్ దాసోజు శ్రావణ్ కుమార్, కుర్ర సత్యనారాయణలను నామినేట్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం సిఫార్సు చేసిన సంగతి తెలిసిందే.
అయితే ఆ సిఫార్సులను గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తిరస్కరించారు. ఈ నేపథ్యంలో తదుపరి తీసుకోవాల్సిన చర్యలపై మంత్రివర్గ భేటీలో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారని సమాచారం. ఇదే సమయంలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ అనుసరించాల్సిన వ్యూహాలు, ఎన్నికలకు సన్నద్ధతపై సైతం విస్తృతంగా చర్చించే అవకాశం ఉందని తెలుస్తుంది.
కాగా... రాజ్యాంగంలోని ఆర్టికల్స్ 171(3), 171(5)లో నిర్దేశించిన మేరకు సాహిత్యం, సైన్స్, కళలు, సహకార ఉద్యమం, సమాజ సేవ రంగాల్లో చెప్పుకోదగ్గ ప్రావీణ్యత కానీ ఆచరణాత్మక అనుభవం కానీ లేకపోవడంతో గవర్నర్ కోటా కింద ఎమ్మెల్సీలుగా వీరి అభ్యర్థిత్వాలను తిరస్కరిస్తున్నట్టు గవర్నర్ ప్రకటించిన సంగతి తెలిసిందే.