కేసీయార్ వన్నీ కాపీ పేస్ట్ పథకాలేనా ?
కేసీయార్ చెప్పుకుంటున్న పథకాల్లో కీలకమైనవి కాపీ పేస్ట్ పథకాలేనా ?
ఇప్పుడు ఎన్నికల బహిరంగ సభల్లోనే కాకుండా ఇంతకాలం ఎంతో గొప్పవిగా కేసీయార్ చెప్పుకుంటున్న పథకాల్లో కీలకమైనవి కాపీ పేస్ట్ పథకాలేనా ? ఇతర రాష్ట్రాల్లో అమలవుతున్న పథకాలను మక్కికి మక్కీగా కాపీకొట్టేసిన కేసీయార్ వాటి పేర్లను మాత్రం మార్చి తెలంగాణాలో అమలు చేస్తున్నారంతే. ఈ కాపీ పథకాలనే తాను ప్రవేశపెట్టిన గొప్ప పథకాలుగా దేశంలో మరే రాష్ట్రంలోను అమలు కావటంలేదని పదేపదే తన భుజాలను తానే చరుచుకుంటున్నారు.
కేసీయార్ గొప్పగా చెప్పుకుంటున్న పథకాల్లో మిషన్ భగీరథ, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, కేసీఆర్ కిట్లు కొన్ని మాత్రమే. నిజానికి ఇవే పథకాలను కొన్ని రాష్ట్రాలు చాలాకాలంగా అమలు చేస్తున్నాయి. వాటినే కేసీయార్ కాపీ కొట్టేసి పేర్లు మార్చి ఇక్కడ అమలు చేస్తున్నారంతే. మిషన్ భగీరథ పథకాన్ని కేసీయార్ మొదలుపెట్టింది 2016లో. అయితే గుజరాత్ లో 2013లోనే స్వర్ణిమ్ గుజరాత్ సౌరాష్ట్ర కచ్ వాటర్ గ్రిడ్ పేరుతో అమలుచేస్తోంది. దళితులకు మూడెకరాల భూమిని ఇస్తామని కేసీఆర్ ప్రకటించింది 2014లో. అయితే ఇదే పథకం ఉత్తరప్రదేశ్ లో 2010 నుండే అమల్లో ఉంది.
కల్యాణలక్ష్మి పథకాన్ని కేసీయార్ ప్రకటించింది 2014లో. ఇదే పథకం మధ్యప్రదేశ్ లో వివాహ్ కల్యాణ్ యోజన పేరుతో 2006 నుండే అమల్లో ఉంది. బస్తీ దవాఖానాను కేసీయార్ 2018లో అమల్లోకి తెస్తే 2015 నుండే ఢిల్లీలో మొహల్లా క్లినిక్ పేరుతో అమలవుతోంది. కంటి వెలుగు పథకాన్ని కేసీయార్ 2018లో అమల్లోకి తెస్తే ఒడిశ్శాలో 2017లోనే యూనివర్సల్ సునేత్ర ప్రోగ్రామ్ పేరుతో అమలవుతోంది. కేసీయార్ న్యూట్రిషన్ కిట్ పథకాన్ని 2021లో అమల్లోకి తెచ్చారు. అయితే తమిళనాడులో అమ్మ న్యూట్రిషన్ కిట్ పేరుతో 2019 నుండే అమల్లో ఉంది.
కేసీయార్ కిట్ పథకాన్ని 2017లో అమల్లోకి తెస్తే తమిళనాడులో 2015లోనే అమ్మ బేబీకేర్ కిట్ అని అమలవుతోంది. ఆడపిల్ల పుడితే ఏడాదికి ప్రోత్సాహకంగా రు. 13 వేలిస్తున్నట్లు కేసీయార్ ఘనంగా చెప్పుకుంటున్నారు. అయితే ఇదే ప్రోగ్రామ్ తమిళనాడులో మెటర్నిటి బెనిఫిట్ స్కీమ్ పేరుతో 1989 నుండే అమల్లో ఉంది. మొత్తంమీద కేసీయార్ ఎంతో ఘనంగా చెప్పుకుంటున్న పథకాలు కాపీ పథకాలనే అని తెలుస్తోంది. జనాలకు మంచి జరిగే పథకాలను ఎక్కడినుండి తెచ్చుకున్నా ఇబ్బందిలేదు. కాకపోతే దేశంలోనే ఇంకెక్కడా అమలు కావటంలేదని చెప్పుకోవటంలోనే సమస్యంతా ఉంది.