బొత్స నంబర్ టూ గానా ?
వైసీపీలో నంబర్ టూ ఎవరు అన్న చర్చ ఉంది. రాజ్యసభ సభ్యుడుగా ఉన్నపుడు విజయసాయిరెడ్డి నంబర్ టూగా ఉండేవారు అని ప్రచారం సాగింది.
వైసీపీలో నంబర్ టూ ఎవరు అన్న చర్చ ఉంది. రాజ్యసభ సభ్యుడుగా ఉన్నపుడు విజయసాయిరెడ్డి నంబర్ టూగా ఉండేవారు అని ప్రచారం సాగింది. ఆయన ఇటీవల తన పదవికి రాజకీయాలకు గుడ్ బై కొట్టారు. సజ్జల రామక్రిష్ణారెడ్డి నంబర్ టూ అని అంతా అనుకున్నా పార్టీ అధికారం నుంచి దిగిపోయాక ఆయన కూడా అంతగా కనిపించడం లేదు అని అంటున్నారు.
ఇక వైసీపీలో ఎంతో మంది నేతలు ఉన్నారు కానీ అందరూ జిల్లా స్థాయిని దాటి ముందుకు వెళ్ళలేక పోతున్నారు. అయితే ఒక్క బొత్స సత్యనారాయణకే మినహాయింపు ఉంది అని అంటున్నారు. ఆయన సీనియర్ మోస్ట్ లీడర్. అంతే కాదు పీసీసీ చీఫ్ గా ఆయన ఉమ్మడి ఏపీకి పనిచేసారు. సుదీర్ఘ కాలం మంత్రిగా ఉన్నారు ఇక ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాలతో పాటు గోదావరి జిల్లాలలోనూ సామాజిక వర్గం పరంగా పట్టుంది.
వీటితో పాటుగా ఆయన వైసీపీకి శాసనమండలిలో ప్రతిపక్ష నాయకుడిగా కేబినెట్ ర్యాంక్ హోదాతో ఉన్నారు. వైసీపీలో ఆ హోదా ఇపుడు ఎవరికీ లేదు. ఒక్క బొత్స ఆ విషయంలో స్పెషల్. ఇలా చూస్తే కనుక బొత్స వైసీపీలో జగన్ తరువాత అన్నంతగా ఉన్నారు. గుంటూరు మిర్చీ యార్డులో రైతులను పరామర్శించేందుకు జగన్ వెళ్ళిన సందర్భంలో ఆయన భద్రతను కుదించారు అని వైసీపీ ఆరోపణలు చేస్తోంది.
దాంతో ఈ విషయం మీద గవర్నర్ కి ఫిర్యాదు చేసే ప్రతినిధి బృందానికి బొత్స నాయకత్వం వహించారు ఆ మీదట ఆయన మీడియా సమావేశం పెట్టి కూటమి ప్రభుత్వం మీద ఒక లెవెల్ లో విమర్శలు చేశారు ఆ మరుసటి రోజు విశాఖలో మరో మీడియా సమావేశం పెట్టి కూటమి పాలన తీరు మీద నిప్పులు చెరిగారు.
ఇక బొత్స విషయం తీసుకుంటే ఆయన తరచూ ప్రజా సమస్యల మీద స్పందిస్తూ మీడియాలో ఉంటున్నారు. బలమైన సామాజిక వర్గం, ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన వారు కావడం అదనపు అనుకూలతలుగా ఉన్నాయి వైసీపీ అధినాయకత్వం కూడా ఆయనకు విలువ ఇవ్వడంతో బొత్స వైసీపీలో కీలకమైన నేతగా ఉన్నారని అంటున్నారు.
ఇటీవల ఒక వెబ్ సైట్ పోల్ లో వైసీపీ లో నంబర్ టూ ఎవరుండాలి అని భావిస్తున్నారు అంటే బొత్సకే ఎక్కువ మార్కులు వచ్చాయంటే ఆయన వైసీపీలో ఎలాంటి పొజిషన్ లో ఉన్నారో అర్థం చేసుకోవచ్చు అని అంటున్నారు. బొత్స రాజకీయంగా సీనియర్ కావడంతో తనదైన వ్యూహాలతో అడుగులు వేస్తారు. మీడియాలో కూడా ఆయన ప్రభుత్వాన్ని విమర్శించేటపుడు ఆచీ తూచీ అన్నట్లుగా ఉంటారు. అదే విధంగా రాజకీయాలక్ అతీతంగా అందరి నేతలతో అన్ని పార్టీలతో సఖ్యతగా ఉంటారు. దీంతో వైసీపీలో బొత్స ప్రత్యేకమైన నాయకుడే కాదు నంబర్ టూ ఆయనే అని అంటున్నారట అంతా.