తిట్టటంలోనూ పొగడటం.. రేవంత్ చతురత లెక్కే వేరప్పా

తాజాగా సాగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో దేశంలో మరే కాంగ్రెస్ నేత మాట్లాడలేనంత ఘాటుగా రేవంత్ మోడీ పరివారంపై విరుచుకుపడుతున్నారు.

Update: 2024-04-27 09:30 GMT

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టాలెంట్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఆయన మాటల్లో కొన్నిసార్లు కేసీఆర్ ను మించిపోవటం కనిపిస్తుంది. విషయాలపై అవగాహన.. అదే సమయంలో రాజకీయంగా తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టాలంటే రేవంత్ తర్వాతే ఎవరైనా. నిజానికి ఆయనకున్న ఆ టాలెంటే ఆయన్ను ఎక్కడికో తీసుకెళ్లేలా చేసిందని చెప్పాలి. తాజాగా సాగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో దేశంలో మరే కాంగ్రెస్ నేత మాట్లాడలేనంత ఘాటుగా రేవంత్ మోడీ పరివారంపై విరుచుకుపడుతున్నారు. అదే సమయంలో బ్యాలెన్సు మిస్ కాకుండా జాగ్రత్తలు తీసుకోవటం కనిపిస్తుంది.

నిజానికి జాతీయస్థాయిలో మోడీ మీద విమర్శలు గుప్పించే విషయంలో కాంగ్రెస్ అగ్రనాయకత్వం తడబడుతుంటే.. అందుకు భిన్నంగా రేవంత్ మాత్రం విరుచుకుపడుతున్నారు. అంశాల వారీగా మోడీ సర్కారు నిర్ణయాల్ని తప్పు పట్టటం.. వాటిని ఎత్తి చూపటంతో పాటు.. హిందుత్వ వాదనలకు బ్యాలెన్సు కౌంటర్ ఇవ్వటం ద్వారా జాతీయ స్థాయిలో పలువురి కంట్లో పడుతున్నారు రేవంత్. ఓవైపు మోడీని టార్గెట్ చేస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి.. మరోవైపు తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు కౌంటర్ల మీద కౌంటర్లు వేస్తూ షాకులు ఇస్తున్నారు.

ఆసక్తికరమైన అంశం ఏమంటే.. ఓవైపు కేసీఆర్ ను పూచిక పుల్ల మాదిరి తీసేస్తూనే.. మరోవైపు మోడీని తిట్టినట్లే తిట్టి.. పొగిడేస్తున్న వైనం ఆసక్తికరంగా మారింది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తేవటాన్ని క్రికెట్ పరిభాషలో చెప్పే ప్రయత్నం చేశారు.

"సెమీఫైనల్ లో బంగ్లాదేశ్ లాంటి కేసీఆర్ ను ఓడించటం లాంటిది. ఇప్పుడు మేం పాకిస్థాన్ టీం లాంటి మోడీతో ఫైనల్ ఆడుతున్నాం"అంటూ మోడీ అండ్ కోను బలమైన ప్రత్యర్థిగా పేర్కొంటూ.. బీఆర్ఎస్ ను పిల్లకాకి తరహాలో తీసిపారేయటం గమనార్హం.

ఓవైపు మోడీని విమర్శలు చేసినట్లే చేస్తూ. ఆయన ఎంతటి టఫ్ ఫైట్ ఇస్తున్నారన్న విషయాన్ని చెప్పిన వైనం మనసు దోచుకునేలా ఉందంటున్నారు. సాధారణంగా విమర్శలు చేసే వేళలో.. నోట్లో నుంచి వచ్చే మాటలు తర్వాతి రోజుల్లో డ్యామేజింగ్ గా మారుతుంటాయి. అలాంటి పరిస్థితి రాకుండా రేవంత్ అప్రమత్తంగా వ్యవహరిస్తున్నట్లు కనిపిస్తోందని చెప్పక తప్పదు.

Tags:    

Similar News