రేవంత్.. భట్టి.. కాంగ్రెస్ డిప్యూటీ సీఎంలు ఎవరు? ఎందరు?

రాజకీయ పార్టీలు అధికారంలోకి వస్తే పదవుల పంపకం పెద్ద సమస్య. బీజేపీ వంటి క్రమశిక్షణాయుత పార్టీలోనూ ఈ లొల్లి తప్పదు

Update: 2023-12-03 08:06 GMT

రాజకీయ పార్టీలు అధికారంలోకి వస్తే పదవుల పంపకం పెద్ద సమస్య. బీజేపీ వంటి క్రమశిక్షణాయుత పార్టీలోనూ ఈ లొల్లి తప్పదు. ఇక వాక్ స్వేచ్ఛ బాగా ఎక్కువగా ఉండే కాంగ్రెస్ లాంటి పార్టీలో అయితే ప్రతి ఒక్కరూ పదవులు కోరుతుంటారు. ప్రతిపక్షంలో ఉన్న సమయంలో ఎంత పోరాడారో తెలియదు కానీ.. అధికారంలోకి రాగానే తామూ హక్కుదారులం అంటూ ముందుకొస్తారు. మరోవైపు పార్టీ అధిష్ఠానం కూడా అనేక సమీకరణాలు బేరీజు వేసుకుని పదవులు పంచాల్సి ఉంటంది. ఉదాహరణకు కాంగ్రెస్ ఆరు నెలల కిందట కర్ణాటకలో విజయం సాధించిన సమయంలో అందరూ డీకే శివకుమార్ కు సీఎం పదవి ఖాయం అనుకున్నారు. కానీ, సీఎంగా ఒకసారి పనిచేసిన సిద్ధరామయ్య తన ముద్ర చాటారు. దీంతో సిద్దూకే మరోసారి సీఎం కిరీటం అప్పగించారు.

డీకేకు సర్దిచెప్పారు.. మరి ఇక్కడ?

కర్ణాటకలో కాంగ్రోస్ ను ఆర్థికంగా నిలబెట్టింది డీకే శివకుమార్. ఆయనపై కేసులు పెట్టినా చలించలేదు. దీంతోపాటు పార్టీని కూడా పుంజుకునేలా చేశారు. దీంతో సీఎం పదవి ఆయనకే దక్కుతుందని భావించారు. కానీ, సమీకరణాల ప్రకారం చెరో రెండున్నరేళ్లు సీఎం పదవిని సిద్దూ-డీకే మధ్యన పంచారు. డీకేకు డిప్యూటీ సీఎం పదవి ఇచ్చి సరిపెట్టారు. అయితే, డీకే వ్యూహ చతురత తెలిసి తెలంగాణ బాధ్యతలు అప్పగించారు. ఇందులో ఆయన విజయం సాధించి పొరుగు రాష్ట్రంలోనూ పార్టీని గెలిపించారు. కాగా, తెలంగాణలో కాంగ్రెస్ విజయంతో రేవంత్, భట్టిలలో ఒకరికి సీఎం పదవి దక్కడం ఖాయమని అనుకుందాం. మరి మరొకరికి ఏం ఇస్తారు?

అటు ఇటు.. ఇటు అటు

ఒకవేళ రేవంత్ ను సీఎం చేస్తే.. భట్టిని డిప్యూటీ సీఎంగా ప్రకటించి ముఖ్య శాఖలు అప్పగించవచ్చు. లేదా భట్టి సీఎం అయితే రేవంత్ ను డిప్యూటీ సీఎంగా, కీలక శాఖల మంత్రిగా చేయొచ్చు. వీరిలో ఎవరికి సీఎం యోగం తప్పినా.. డిప్యూటీ సీఎం ఇవ్వక తప్పదు. ఇక కర్ణాటకలోలా రెండున్నరేళ్లు సీఎం పదవిలో ఉండేలా కూడా ఒప్పందం తేవొచ్చు. వీరు కాక.. డిప్యూటీ సీఎంలుగా మరొకరినీ చేసే చాన్సుంది. అందులోనూ మహిళా కోటాలో సీతక్క పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. మొత్తానికి ఎంతమంది డిప్యూటీ సీఎంలు.. ఎవరు డిప్యూటీ సీఎంలు అనేది ఆరు రోజుల్లో తేలిపోనుంది.

Tags:    

Similar News