సీపీఎం అసలు ప్లానిదేనా ?

రాబోయే తెలంగాణా ఎన్నికల్లో సీపీఎం ఒంటరిగా పోటీచేస్తోంది. ముందు వామపక్షాలు బీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకోవాలని ప్రయత్నించినా సాధ్యంకాలేదు

Update: 2023-11-18 07:45 GMT

రాబోయే తెలంగాణా ఎన్నికల్లో సీపీఎం ఒంటరిగా పోటీచేస్తోంది. ముందు వామపక్షాలు బీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకోవాలని ప్రయత్నించినా సాధ్యంకాలేదు. కేసీయార్ కమ్యూనిస్టు పార్టీలను అసలు పట్టించుకోను కూడా లేదు. దాంతో కాంగ్రెస్ తో పొత్తుకు రెడీ అయిపోయాయి. సీట్ల షేరింగులో సీపీఐ ఓకే చెప్పినా సీపీఎం మాత్రం అంగీకరించలేదు. కాంగ్రెస్ తరపున ఎన్ని ప్రయత్నాలు జరిగినా సీపీఎం మాత్రం పట్టిన పట్టు విడవలేదు. దాంతో కాంగ్రెస్-సీపీఐ పొత్తు కుదిరితే సీపీఎం ఒంటరిగా పోటీచేస్తోంది.

ఇదిస్ధూలంగా పైకి కనిపించే విషయం. కానీ అసలు విషయంలో లోలోపలే సర్దుబాటు అయిపోయిందనే విషయం ఇపుడు బయటపడింది. అదేమిటంటే ఆచరణసాధ్యంకాని ప్రతిపాదనలు కాంగ్రెస్ ముందు సీపీఎం కావాలనే ఉంచిందట. కాంగ్రెస్ తో పొత్తు కుదరలేదని చెప్పి ఒంటరిగా పోటీలోకి దిగి బీఆర్ఎస్ కు మేలు చేయటమే సీపీఎం అసలు ఉద్దేశ్యమనే ఆరోపణలు ఇపుడు పెరిగిపోతున్నాయి. కారణం ఏమిటంటే ఆరుసీట్లు కావాలని కాంగ్రెస్ కు సీపీఎం ప్రతిపాదించింది. కాంగ్రెస్ ప్రతిపాదనలను ఆమోదించకుండా ఆరుసీట్లపైనే పట్టుబట్టింది. ఇపుడేమో 19 నియోజకవర్గాల్లో ఒంటరిపోటీకి దిగింది.

ఆరుసీట్ల కోసం పట్టుబట్టిన సీపీఎం ఇపుడు 19 సీట్లలో పోటీచేస్తుండటమే ఆశ్చర్యంగా ఉంది. అదికూడా ఏరికోరి కాంగ్రెస్ గెలుస్తుందనే ప్రచారం ఉన్న సీట్లే ఎక్కువగా ఉండటంతో అనుమానాలు మొదలైనాయి. ఇదే సమయంలో మెదక్ జిల్లాలో తమకు సహకరించమని మంత్రి హరీష్ రావు సీపీఎం నేతలతో భేటీ కావటం అందరి అనుమానాలను కన్ఫర్మ్ చేశాయి. బీఆర్ఎస్ కు మేలుచేసేందుకే కాంగ్రెస్ తో కావాలనే పొత్తును సీపీఎం తెంచుకున్నదని అందరికీ అర్ధమైపోయింది.

ఈ మొత్తంలో విచిత్రం ఏమిటంటే ఇండియా కూటమిలో కాంగ్రెస్ తో ఉంటూనే తెలంగాణా ఎన్నికల్లో మాత్రం బీఆర్ఎస్ కు అనుకూలంగా వ్యవహరిస్తోందనే ఆరోపణలు పెరిగిపోతున్నాయి. జరుగుతున్న వ్యవహారంలో సీపీఎం కార్యదర్శి తమ్మినేని వ్యవహారశైలిపైనే అందరిలోను అసంతృప్తి, అనుమానాలు పెరిగిపోతున్నాయి. కేసీయార్-తమ్మినేని మధ్య జరిగిన లోపాయికారీ ఒప్పందం కారణంగానే సీపీఎం ఒంటరిపోటీ నాటకం ఆడిందనే ప్రచారం పెరిగిపోతోంది. మరి ఎన్నికలయ్యాక ఏమి జరుగుతుందో చూడాలి.

Tags:    

Similar News