ఆ సీటులో అత్యంత ఆశ్చర్యకర ఫలితం అట?

కామారెడ్డిలో సీఎం కేసీఆర్, టీపీసీసీ చీఫ్ రేవంత్ వంటి స్థానికేతరుల నడుమ కాటిపెల్లి వెంకటరమణారెడ్డి పాత వ్యక్తి అయ్యారు

Update: 2023-11-26 11:45 GMT

తెలంగాణ ఎన్నికల్లో ప్రస్తుతం అత్యంత ఆసక్తి రేకెత్తిస్తున్న నియోజకవర్గంలో ఫలితం కూడా అంతే సంచలనంగా ఉండబోతున్నదా..? మహామహులు పోటీ పడుతున్న నియోజకవర్గంలో ఫలితం కూడా ఆసక్తికరంగా ఉండనుందా..? ప్రధాన పోటీదారులు ఇద్దరూ కాకుండా మూడో వ్యక్తి గెలుపును తన్నుకుపోనున్నారా? కొన్ని అంచనాలు దీనిని ఔననే చెబుతున్నాయి. మొన్నటివరకు సోదిలో కూడా లేని ఆ నియోజకవర్గం ప్రముఖుల పోటీతో మీడియాలో ముఖ్యమైన సీటుగా మారిపోయింది.

వారిద్దరూ కాదు.. ఆయనట?

ఉత్తర తెలంగాణలోని ఉమ్మడి నిజామాబాద్ లో భాగమైన, ప్రస్తుతం జిల్లా కేంద్రంగా ఉన్న కామారెడ్డిలో సీఎం కేసీఆర్ (బీఆర్ఎస్), టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తలపడుతున్న సంగతి తెలిసిందే. బీజేపీ తరఫున కాటిపెల్లి వెంకట రమణారెడ్డి బరిలో నిలిచారు. వాస్తవానికి కేసీఆర్, రేవంత్ ఇద్దరూ కామారెడ్డి వారు కాదు. అంటే నాన్ లోకల్. వెంకట రమణారెడ్డి మాత్రం స్థానిక నేపథ్యం ఉన్నవారు. 2018లో బీజేపీ తరఫున పోటీ చేసి 15,439 ఓట్లు సాధించారు. ఇవి పోలైన ఓట్లలో పది శాతం వరకు ఉన్నాయి. నాటి ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి గంప గోవర్ధన్ మెజార్టీ 5,007 మాత్రమే కావడం గమనార్హం. కాగా, ఎన్నికల్లో మూడో స్థానంలో నిలిచినప్పటికీ కామారెడ్డిని వీడకుండా వచ్చారు వెంకటరమణారెడ్డి. ఆర్థికంగా బలమైనవారు కావడంతో.. కష్టాల్లో ఉన్నవారికి చేతనైనంత సాయం కూడా చేసేవారు. నియోజకవర్గానికి సంబంధించి సొంత మేనిఫెస్టోతో ప్రజలను ఆకట్టుకున్నారు. ఇప్పుడివే అంశాలు ఎన్నికల్లో ఆయనకు ప్లస్ గా మారుతున్నట్లు చెబుతున్నారు. మరికొన్ని అంశాలూ వెంకటరమణారెడ్డికి బలంగా మారుతున్నాయని వివరిస్తున్నారు.

ఇద్దరు కొత్త ముఖాల నడుమ.. పాతవారు

కామారెడ్డిలో సీఎం కేసీఆర్, టీపీసీసీ చీఫ్ రేవంత్ వంటి స్థానికేతరుల నడుమ కాటిపెల్లి వెంకటరమణారెడ్డి పాత వ్యక్తి అయ్యారు. గత ఎన్నికల్లో గెలిచిన బీఆర్ఎస్ అభ్యర్థి గంప గోవర్ధన్ కు ఇక్కడ 42.02 శాతం ఓట్లు వచ్చాయి. నాటి కాంగ్రెస్ అభ్యర్థి షబ్బీర్ అలీకి 39.21 శాతం ఓట్లు పోలయ్యాయి. వీరిద్దరి మధ్యన తేడా మూడుశాతం లోపే. రమణారెడ్డికి వచ్చినవి పది శాతం ఓట్లు. 2014లో బీజేపీ అభ్యర్థి సిద్ధరాములుకు 8.82 శాతం (13,938) ఓట్లు పోలయ్యాయి. అంటే బీజేపీకి కామారెడ్డిలో నికరంగా పదిశాతం వరకు ఓట్లున్నట్లు స్పష్టమవుతోంది. అది కూడా గోవర్ధన్, షబ్బీర్ అలీ వంటి నాయకులు పోటీ పడినప్పుడు. ఇప్పుడు కేసీఆర్, రేవంత్ కు తోడు వెంకటరమణారెడ్డి బరిలో నిలిస్తే పదిశాతం ఓట్లకు వ్యక్తిగత ప్రతిష్ఠతో వచ్చే ఓట్లు తోడైతే ఫలితం ఎలా ఉంటుందో చూడాలి. అందుకనే కామారెడ్డిలో సంచలనం ఫలితం వస్తుందని కొందరు చెబుతున్నారు.

Tags:    

Similar News