రేవంత్ కు 2వ ఓటమా..? డబుల్ బొనాంజానా? 2 ఓటములూ ఒకేసారా?

తెలంగాణ ఎన్నికల్లో మాంచి జోరుమీదున్న కాంగ్రెస్.. సీఎం కేసీఆర్ ను, బీఆర్ఎస్ ను గట్టిగానే ఢీకొట్టాలని భావించింది

Update: 2023-11-27 03:00 GMT

తెలంగాణ ఎన్నికల్లో మాంచి జోరుమీదున్న కాంగ్రెస్.. సీఎం కేసీఆర్ ను, బీఆర్ఎస్ ను గట్టిగానే ఢీకొట్టాలని భావించింది. గతంలోలా ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా పోటీలో సీరియస్ నెస్ చూపుతోంది. అభ్యర్థుల ఎంపికకు దరఖాస్తుల ఆహ్వానం.. వడపోత.. చివరకు ఒకరిని ప్రకంటించిడం.. రెబల్స్ ను బుజ్జగించడం.. ఇవన్నీ దానినే సూచిస్తున్నాయి. ఇక ప్రజలను మరింతగా తమ గురించి ఆలోచించేలా చేయాలంటే మరో మార్గం సాధారణానికి భిన్నంగా వెళ్లడం. ఈ కోవలోనిదే కామారెడ్డి నియోజకవర్గంలో సీఎం కేసీఆర్ పై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని పోటీ దింపడం. సాధారణంగా గతంలో పీసీసీ అధ్యక్షుడిని కొన్నిసార్లు పోటీకి దూరంగా ఉంచేవారు. కొన్నాళ్లుగా ఆ పద్ధతి మారినా.. ఈసారి మాత్రం రేవంత్ కు రెండుచోట్ల పోటీ చేసే చాన్సిచ్చారు.

ఒకటి ఖాయమే.. రెండోది?

17 ఏళ్ల రేవంత్ రాజకీయ జీవితంలో అత్యంత బాధించినది 2018లో కొడంగల్ లో ఓటమి అనడంలో సందేహం లేదు. 2019 లోక్ సభ ఎన్నికల్లో మల్కాజ్ గిరి నుంచి గెలిచి ఆ నష్టాన్ని పూరించుకున్నా.. ఆయన ఖాతాలో మాత్రం ఓ పరాజయం ఉన్నట్లైంది. అసలేమాత్రం బలంలేకున్నా కాంగ్రెస్ అభ్యర్థిని ఓడించి 2007లో స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఎన్నికైన చరిత్ర ఉండి.. రెండుసార్లు గెలిచిన కొడంగల్ లో ఎమ్మెల్యేగా ఓడిపోవడం ఎంతైనా ఇబ్బందికరమే. కాగా, రేవంత్ ఈ ఎన్నికలలో మళ్లీ కొడంగల్ తో పాటు కామారెడ్డిలోనూ పోటీ చేస్తున్న నేపథ్యంలో ఆయన ఎన్నిచోట్ల నెగ్గుతారు అనేది చర్చనీయాంశం అవుతోంది. కొడంగల్ లో ఉన్న అంచనా ప్రకారం రేవంత్ ను ఈసారి గెలవొచ్చు అని చెబుతున్నారు. కామారెడ్డిలో ఫలితంపైనే ఆసక్తి నెలకొంది.

అలా జరిగితే..

కొడంగల్ లో గెలిచి కామారెడ్డిలో ఓడితే రేవంత్ రెండోసారి అసెంబ్లీ ఎన్నికల్లో ఓడినట్లు అవుతుంది. రెండుచోట్లా ఓడితే సంఖ్య మూడుకు పెరుగుతుంది. రెండుచోట్లా గెలిస్తే సంచలనంగా మారడంతో పాటు ఇప్పటివరకు ఉన్న 2018 ఓటమి మాత్రమే రికార్డుల్లో నిలుస్తుంది. అయితే, కొడంగల్, కామారెడ్డిలో ఎక్కడ ఎమ్మెల్యేగా కొనసాగుతారనేది? ఏ నియోజకవర్గానికి ఉప ఎన్నిక వస్తుంది? అనేది తర్వాత సంగతిగా మారుతుంది. రేవంత్ రెండుచోట్లా ఓడి..కాంగ్రెస్ అదికారంలో వస్తే గనుక అది ఆయన సీఎం అవకాశాలకు ఇబ్బందిగా మారుతుంది. ఆపై సీఎం కేసీఆర్ కామారెడ్డిని వదులుకుంటే అక్కడినుంచి బరిలో దిగాల్సి ఉంటుంది. లేదా కేసీఆర్ గజ్వేల్ ను వదులుకుంటే అక్కడ పోటీ చేయాల్సి వస్తుంది. ఇవేవీ కాకుంటే మరోసారి మల్కాజ్ గిరి నుంచో మరెక్కడినుంచో అయినా లోక్ సభకు పోటీ చేయాల్సి వస్తుంది. సీఎం చాన్సు కోసమే అయితే ఎమ్మెల్సీ కోటా ఆధారపడాల్సి ఉంటుంది. ఏది ఏమైనది వచ్చే వారం సరిగ్గా ఈ రోజుకు తేలిపోతుంది.

Tags:    

Similar News