రాజ్‌ భవన్‌ కు ప్రభుత్వం వివరణ... ఆర్టీసీ బిల్లు ఆమోదానికి గవర్నర్ గ్రీన్ సిగ్నల్?

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తూ రూపొందించిన బిల్లులో అభ్యంతరాలు ఉన్నాయంటూ గవర్నర్‌ తమిళిసై బిల్లును ఆమోదించకుండా ఆపిన సంగతి తెలిసిందే

Update: 2023-08-05 10:26 GMT

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తూ రూపొందించిన బిల్లులో అభ్యంతరాలు ఉన్నాయంటూ గవర్నర్‌ తమిళిసై బిల్లును ఆమోదించకుండా ఆపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గవర్నర్‌ లేవనెత్తిన అభ్యంతరాలపై ప్రభుత్వం వివరణ ఇచ్చింది. ఈమేరకు కాపీని రాజ్‌ భవన్‌ కు పంపించింది. అయితే ఈ వివరణపై గవర్నర్ సంతృప్తి చెందొచ్చని.. బిల్లును ఆమోదించే ఛాన్స్ ఉందని అంటున్నారు పరిశీలకులు.

అవును... తెలంగాణ‌లోని ఆర్టీసీ కార్మికుల‌ను రాష్ట్ర ప్రభుత్వంలో విలీనం చేస్తామ‌ని ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షత‌న ఇటీవ‌ల జ‌రిగిన కేబినెట్ స‌మావేశంలో నిర్ణయించిన సంగ‌తి తెలిసిందే. దీంతో కేబినెట్ నిర్ణయానికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం బిల్లు రూపొందించింది. ఈ అసెంబ్లీ స‌మావేశాల్లో ఆర్టీసీ విలీనం బిల్లు పాస్ చేయాల‌నే సంక‌ల్పంతో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. అయితే ఆ బిల్లుపై గవర్నర్ కొన్ని కీలక ప్రశ్నలు వేశారు.

ఈ నేపథ్యంలో ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియకు సంబంధించిన బిల్లుపై.. గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ కోరిన వివరణపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. గవర్నర్‌ లేవనెత్తిన ఐదు అంశాలపై ప్రభుత్వం వివరణ ఇచ్చింది. ఉద్యోగులను మాత్రమే ప్రభుత్వంలోకి తీసుకుంటున్నామని.. సంస్థ యథాతథంగా కొనసాగుతుందని స్పష్టం చేసింది.

కార్పొరేషన్‌ యథాతథంగా కొనసాగుతున్నందున విభజన చట్టానికి ఎలాంటి ఇబ్బంది లేదని వెల్లడించింది. అలాగే కేంద్ర వాటా, గ్రాంట్లు, రుణాల వివరాలు అవసరం లేదని పేర్కొంది. ఇదే సమయంలో పింఛన్లు, తదితరాలకు సంబంధించి ఎలాంటి అయోమయం లేదని.. ప్రభుత్వంలో తీసుకున్న తర్వాత కార్మికులతో చర్చించే నిర్ణయాలు తీసుకుంటామని వెల్లడించింది.

ఇదే సమయంలో ఉద్యోగుల ప్రయోజనాల పరిరక్షణే ఈ బిల్లు ప్రధాన ఉద్దేశమని తెలిపిన ప్రభుత్వం... వేతనాలు, భత్యం, కేడర్‌, పదోన్నతులకు ఎలాంటి సమస్య ఉండదని పేర్కొంది. ఈ మేరకు గవర్నర్‌ అడిగిన ఐదు అంశాలలో అన్నింటిపైనా వివరణ ఇచ్చామని.. అసెంబ్లీలో ఆర్టీసీ బిల్లును ప్రవేశపెట్టేందుకు అనుమతి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది.

కాగా ఆర్టీసీ బిల్లుకు సంబంధించి 5 అంశాలపై గవర్నర్ తమిళిసై ప్రభుత్వాన్ని వివరణ కోరిన సంగతి తెలిసిందే. వాటిలో...

ఆర్టీసీలో కేంద్ర గ్రాంట్లు, వాటాలు, లోన్ల వివరాలు బిల్లులో ఎందుకు లేవు!

ఉద్యోగుల ప్రయోజనాలు ఎలా కాపాడుతారు?

ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వారికి పింఛన్‌ ఇస్తారా?

విభజన చట్టం ప్రకారం ఆర్టీసీ స్థితిని మార్చడంపై వివరాలు లేవు!

పదోన్నతులు, క్యాడర్‌ నార్మలైజేషన్‌ లో న్యాయం ఎలా చేస్తారు? వంటి అంశాలను లేవనెత్తిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రభుత్వం వీటికి వివరణ ఇస్తూ తాజాగా రాజ్ భవన్ కు కాపీ పంపింది. దీంతో... ఈ వివరణతో గవర్నర్ సంతృప్తి వ్యక్తం చేసే ఛాన్స్ ఉందని... వీలైనంత వేగంగా దాన్ని ఆమోదిస్తారని అభిప్రాయపడుతున్నారు పరిశీలకులు.

Tags:    

Similar News