గవర్నర్ వచ్చారు.. ఆర్టీసీ బిల్లను ఓకే చేశారు.. కానీ..
పుదుచ్చేరి పర్యటన నుంచి తిరిగొచ్చిన తెలంగాణ గవర్నర్ తమిళిసై
పుదుచ్చేరి పర్యటన నుంచి తిరిగొచ్చిన తెలంగాణ గవర్నర్ తమిళిసై.. ప్రభుత్వం పంపిన ఆర్టీసీ ఉద్యోగుల బిల్లును ఆమోదించారు. అయితే, ఆమె కొన్ని సూచనలు చేశారు.
తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేస్తూ పంపిన బిల్లుపై గవర్నర్ తమిళిసై సంతకం చేశారు. కానీ, పది సిఫారసులు చేశారు. వాస్తవానికి ఆదివారంతో అసెంబ్లీ ముగియాలి. గవర్నర్ బిల్లు ఆమోదించినా.. సిఫారసులు చేయడంతో మరో రెండు రోజులు పొడిగించారు. ఇక తన సిఫారసుల్లో గవర్నర్ పలు న్యాయపర అంశాలు, ఉద్యోగుల ప్రయోజనాలను పేర్కొన్నారు. ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించిన తర్వాత కూడా సంస్థ భూములు, ఆస్తులను కార్పరేషన్ కే అప్పగిస్తూ స్పష్టమైన హామీ ఇవ్వాలనే కీలక సూచన కూడా ఉంది. ఇక విభజన చట్టం ప్రకారం..తెలంగాణ, ఏపీ మధ్య ఆస్తులను విభజించాలి.
ఉద్యోగులకు మేలు
గవర్నర్ చేసిన సిఫారసుల్లో అత్యంత కీలకమైనది.. ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించిన తర్వాత ఆర్టీసీ ఉద్యోగుల వేతనాలు, జీతం, బదిలీలు, పదోన్నతులు, పదవీ విరమణ పింఛన్లు, పే స్కేలు, పీఎఫ్ , గ్రాట్యుటీ, సర్వీస్ నియమాలు, నిబంధనలు ఇలా అన్నీ ఇతర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే ఉండాలనే సూచన ఆర్టీసీ ఉద్యోగులకు చాలా మేలు చేయనుంది. ఇక తీవ్రమైన ఒత్తిడి, శారీరక శ్రమ కారణంగా పనిచేసేందుకు వీలు కాని పరిస్థితి ఉంటే.. ‘కారుణ్య నియామకం’ కోరేందుకు ఉద్యోగులకు వెసులుబాటు కల్పించాలి. కాగా.. ఆర్టీసీలో చాలా కఠినంగా ఉన్న క్రమశిక్షణ చర్యల తీవ్రతను తగ్గించి.. మానవీయ కోణంలో ఆలోచించాలని సూచించారు. ఇతర ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే సర్వీసు నియమాలు, నిబంధనల్లో సమానత్వం ఉండాలని పేర్కొన్నారు.
కాగా, ఆ ర్టీసీ శ్రామిక ఉద్యోగులను డిప్యుటేషన్ పై పంపితే, గ్రేడ్, జీతం, ప్రమోషన్లు తదితర విషయాల్లో ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకోవాలని కోరారు. కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను సాధారణ ఉద్యోగులుగా పరిగణించి, రాష్ట్ర సర్వీస్ నియమాల ప్రకారం సమాన ప్రయోజనాలు, జీతాలివ్వాలని పేర్కొన్నారు. పీఎఫ్ సహా ఇతర ప్రయోజనాల విషయంలో వారి సేవలను గుర్తించి రక్షించాలని సూచించారు. కాగా, రెగ్యులర్ , కాంట్రాక్టు ఉద్యోగులు సర్వీసులో ఉన్నంత కాలం ఆర్టీసీ ఆస్పత్రుల్లో ఒకే రకమైన ఆరోగ్య ప్రయోజనాలు అందించాలని.. నిర్దిష్ట స్థాయి వరకు ప్రభుత్వ ప్రాయోజిత చికిత్సను, బీమా ప్రయోజనాలను కల్పించాలి. రెగ్యులర్ ఉద్యోగులను కూడా ఆరోగ్య ప్రయోజనాల పథకంలో చేర్చాలని గవర్నర్ సిఫారసు చేశారు.
ప్రయాణికుల కోణంలోనూ
ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని బస్సుల నిర్వహణను స్వతంత్ర సంస్థకు అప్పగించాలని గవర్నర్ తన సిఫారసుల్లో పేర్కొన్నారు. నిర్వహణ ఆర్థిక భారాన్ని భరించే బాధ్యతను స్వతంత్ర సంస్థకు అప్పగించాలని.. మరేదైనా పద్ధతిలో ఔట్ సోర్సింగ్ ద్వారా ప్రభుత్వమే నిర్వహణ చేపట్టాలని కూడా పేర్కొన్నారు.