టీఎస్పీఎస్సీ గ్రూప్ - 1 ప్రిలిమ్స్... హైకోర్టు సంచలన తీర్పు!
గతకొన్ని రోజులుగా తెలంగాణ సర్కార్ కు టీఎస్పీఎస్సీ వ్యవహారం సరికొత్త తలనొప్పులు తెస్తున్న సంగతి తెలిసిందే
గతకొన్ని రోజులుగా తెలంగాణ సర్కార్ కు టీఎస్పీఎస్సీ వ్యవహారం సరికొత్త తలనొప్పులు తెస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పేపర్ లీకులతో సర్కార్ ను ముప్పు తిప్పలు పెట్టిన టీఎస్పీఎస్సీ మరోసారి వార్తల్లో నిలిచింది. ఇందులో భాగంగా తాజాగా టీఎస్పీఎస్సీ గ్రూప్ - 1 పరీక్షపై తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఇప్పుడు తెలంగాణలో ఈ విషయం వైరల్ గా మారుతోంది.
అవును... తెలంగాణ హైకోర్టులో ఆ రాష్ట్ర ప్రభుత్వానికి చుక్కెదురైంది. ఇందులో భాగంగా... గ్రూప్ - 1 ప్రిలిమ్స్ రద్దుపై ప్రభుత్వం వేసిన రిట్ అప్పీల్ పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది. టీఎస్పీఎస్సీ గ్రూప్ - 1 పరీక్షను మరోసారి నిర్వహించాలని డివిజన్ బెంచ్ తీర్పు ఇచ్చింది. ఈ క్రమంలో సింగిల్ బెంచ్ తీర్పును డివిజన్ బెంచ్ సమర్ధించింది.
ఈ సందర్భంగా టీఎస్పీఎస్సీపై తెలంగాణ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసిందని తెలుస్తుంది. అభ్యర్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారా? అంటూ సీరియస్ అయిన హైకోర్టు... గూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించే ముందు బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేయడానికి వచ్చిన సమస్య ఏంటని నిలదీసిందని తెలుస్తుంది.
ఇదే సమయంలో... పేపర్ల లీక్ వల్ల ఒకసారి గ్రూప్ - 1 పరీక్ష రద్దయినా కూడా మళ్లీ సమర్థంగా పరీక్షను నిర్వహించలేకపోతే ఎలా? అని ఘాటుగా ప్రశ్నించిందని అంటున్నారు. ఈ విషయంలో ముఖ్యంగా బయోమెట్రిక్ విధానం అమలుచేయకపోవడంపై హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసిందని తెలుస్తుంది.
ఇదే క్రమంలో... బయోమెట్రిక్ ఎందుకు తీసుకోలేదు? అని ప్రశ్నించిన హైకోర్టు.. మీరు విధించిన నిబంధనలను మీరే పాటించరా అంటూ సీరియస్ గా స్పందించిందని తెలుస్తుంది. ఇదే సమయంలో... ఫస్ట్ టైం నిర్వహించినప్పుడు బయోమెట్రిక్ తీసుకున్న బోర్డు... పేపర్ లీకేజీ వ్యవహారం తర్వాత ఆ విధానాన్ని ఎందుకు అమలు చేయలేదని అడిగిందని అంటున్నారు.
ఇదే సమయంలో ఇతర పరీక్షలకు బయోమెట్రిక్ విధానాన్ని ఎందుకు తీసుకున్నారు? గ్రూప్ - 1 ప్రిలిమ్స్ కు ఎందుకు తీసుకోలేదు? అసలు ఈ ఆలోచన వెనుకున్న మీ ఉద్దేశ్యం ఏమిటి అర్ధంకావడం లేదు అనే రేంజ్ లో ప్రశ్నించిందని సమాచారం. ఈ సమయంలో అడ్వొకేట్ జనరల్ ఆసక్తికర చర్చకు తెరలేపినప్పటికీ... అనంతరం న్యాయమూర్తి ఒక్క ప్రశ్నతో కాం చేసేశారని తెలుస్తుంది.
ఇందులో భాగంగా... గ్రూప్ - 1 పోస్టుల భర్తీకి వెలువరించిన నోటిఫికేషన్ లోనే నిబంధనలు సవరించే అధికారాలు కమిషన్ కు ఉంటాయని ఉందని తెలిపారు. పరీక్షలను రద్దు చేయాలని కేవలం ముగ్గురే అభ్యర్థులు హైకోర్టుకు వచ్చారని.. అయితే మొత్తం 2.32 లక్షల మంది అభ్యర్థులు హాజరయ్యారని అన్నారు. ఇలా ముగ్గురు కోరితే దాన్ని ఆమోదించడం అన్యాయం అని చెప్పారు.
దీనిపై స్పందించిన న్యాయస్థానం... "నిబంధనలను సవరించే అధికారాలు కమిషన్ కు ఉన్న మాట వాస్తవమే. కానీ.. ఆ నిబంధనల ప్రకారం నోటిఫికేషన్ లోని బయోమెట్రిక్ విధానం అమలు చేయడం లేదని అనుబంధ నోటిఫికేషన్ జారీ చేయాలని తెలియదా" అని సూటిగా ప్రశ్నించింది. ఇదే సమయంలో మారిన మొత్తం అభ్యర్థుల సంఖ్యపై కూడా స్పందించింది.
ముందుగా 2,33,248 మంది ప్రిలిమ్స్ కు హాజరయ్యారని చెప్పిన కమిషన్.. తర్వాత ఆ సంఖ్యను 2,33,506 మందిగా పేర్కొందని గుర్తుచేసింది న్యాయస్థానం. అంటే హాజరైన అభ్యర్థుల సంఖ్య ఏకంగా 258 పెరిగిందా అని నిలదీసింది. ప్రస్తుతం తెలంగాణలో ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది.