రియల్ ఎస్టేట్‌లో తెలంగాణ టాప్.. ఏపీ పరిస్థితి ఎలా ఉందంటే!
ఈ రియల్ ఎస్టేట్ రంగంలో రెండు తెలుగు రాష్ట్రాల పరిస్థితి ఎలా ఉందంటే.. తెలంగాణ దూసుకుపోతోంది.
ఏ రాష్ట్రంలో అయినా.. అభివృద్ధికి కేరాఫ్... రియల్ ఎస్టేట్ రంగమే. ఈ విషయంలో ఎలాంటి తేడా లేదు. రియల్ ఎస్టేట్ రంగం పుంజుకుంటే.. అనేక అనుబంధ రంగాలద్వారా ఉపాధి, ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. అందుకే.. ఈ రంగాన్ని ఆర్థిక వ్యవస్థలోనూ కీలకమైన రంగంగా పేర్కొంటారు. ఈ రియల్ ఎస్టేట్ రంగంలో రెండు తెలుగు రాష్ట్రాల పరిస్థితి ఎలా ఉందంటే.. తెలంగాణ దూసుకుపోతోంది. అదేసమయంలో ఏపీ నెమ్మది నెమ్మదిగా అడుగులు వేస్తోంది.
ఇది ఎవరో ఉద్దేశ పూర్వకంగాచేస్తున్న విమర్శలు కావు.. రాజకీయం అంతకన్నా కాదు. అధికారికంగా.. రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అధారిటీ(రెరా) చెబుతున్న లెక్కలే ఈ విషయాన్ని ద్రుఢ పరుస్తున్నాయి. గత రెండేళ్లుగా .. ఇరు రాష్ట్రాల్లోనూ అమలవుతున్న రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులకు సంబంధించి రెరాలో నమోదైన వివరాలను గమనిస్తే.. తెలంగాణలో రియల్ రంగం దూకుడుగా ఉందని తెలుస్తోంది.
తెలంగాణలో గత రెండేళ్లుగా 8,227 ప్రాజెక్టుల రెరాలో నమోదయ్యాయి. ఇదేసమయంలో ఏపీలో నమోదైన ప్రాజెక్టుల సంఖ్య కేవలం 3900. అంటే.. సగానికిపైగానే తేడా ఉంది. పైగా.. ఏపీలో రాజధాని లేకపోవడం కూడా ప్రధాన సమస్యగా మారింది. తెలంగాణ రాజధాని నగరం హైదరాబాద్‌ను విస్తరిస్తున్నారు. చుట్టుపక్కల అంతా.. దాదాపు రియల్ రంగం పుంజుకునే వాతావరణం ఏర్పడింది. ఐటీ రాక, పారిశ్రామిక జిలుగులు కూడా రియల్ ఎస్టేట్ రంగానికి బూస్ట్ ఇచ్చాయనే చెప్పాలి.
ఇక, కొనుగోలు దారుల భద్రతకు తెలంగాణ రెరా అధికారులు పక్కాగా చర్యలు తీసుకుంటున్నారు. ప్రభుత్వం కూడా చర్యలు తీసుకుంటోంది. రెరాలో నమోదైన ప్రాజెక్టులకు వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో వేగంగా పనులు చేపట్టి.. వినియోగదారులకు అందించేందుకు కూడా తోడ్పడుతున్నట్టు తెలంగాణ అధికారులు చెబుతున్నారు. ఇక, ఏపీ విషయానికి వస్తే.. రాజధాని లేకపోవడం.. ప్రభుత్వం నుంచి రియల్ రంగానికి ప్రోత్సాహం కనిపించకపోవడంతో ఈ రంగం సగానికి సగం చతికిలపడింది.