తెలంగాణ లోక్‌ సభ ఎన్నికలు.. ఈ 12 మందికి ఆ పార్టీ మూలాలు!

కాగా నాలుగు స్థానాల్లో బీజేపీ, కాంగ్రెస్‌ తరఫున ఎంపీలుగా పోటీ చేస్తున్న 12 మందికి బీఆర్‌ఎస్‌ మూలాలు ఉండటం ఆసక్తి రేపుతోంది.

Update: 2024-04-13 12:30 GMT

తెలంగాణలో గతేడాది డిసెంబరులో అసెంబ్లీ ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చింది. మళ్లీ అవే ఫలితాలను ఇప్పుడు లోక్‌ సభ ఎన్నికల్లోనూ సాధించాలని ఆ పార్టీ కృతనిశ్చయంతో ఉంది. మరోవైపు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో చిత్తయిన బీఆర్‌ఎస్‌ తన పరువు నిలుపుకోవాలని చూస్తోంది. ఇంకోవైపు ప్రధాని మోదీ ఆకర్షణతో బీజేపీ అత్యుత్తమ ఫలితాలు సాధిస్తామనే నమ్మకంతో ఉంది.

కాగా కాంగ్రెస్‌ పార్టీ మినహా అన్ని పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించాయి. కాంగ్రెస్‌ పార్టీ ఖమ్మం, కరీంనగర్‌ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. కాగా నాలుగు స్థానాల్లో బీజేపీ, కాంగ్రెస్‌ తరఫున ఎంపీలుగా పోటీ చేస్తున్న 12 మందికి బీఆర్‌ఎస్‌ మూలాలు ఉండటం ఆసక్తి రేపుతోంది.

వరంగల్‌ ఎంపీ స్థానంలో కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఎమ్మెల్యే కడియం శ్రీహరి కుమార్తె కడియం కావ్య, బీజేపీ అభ్యర్థి ఆరూరి రమేశ్‌ రెండు నెలల క్రితం వరకు బీఆర్‌ఎస్‌ లోనే ఉన్నారు. కడియం కావ్య అయితే బీఆర్‌ఎస్‌ తరఫున వరంగల్‌ టికెట్‌ ను కూడా దక్కించుకుని.. చివరి క్షణంలో కాంగ్రెస్‌ లో చేరిపోయి ఆ పార్టీ తరఫున పోటీ చేస్తున్నారు. ఇక ఆరూరి రమేశ్‌ మొన్నటి అసెంబ్లీ ఎన్నికల వరకు వర్థన్నపేట బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేగా ఉన్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు.

అదేవిధంగా మల్కాజిగిరిలో కాంగ్రెస్‌ తరఫున పోటీ చేస్తున్న పట్నం సునీతా మహేందర్‌రెడ్డి, బీజేపీకి చెందిన ఈటల రాజేందర్‌ సైతం గతంలో బీఆర్‌ఎస్‌ నేతలే కావడం గమనార్హం. ప్రస్తుతం వీరిద్దరూ బీఆర్‌ఎస్‌ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డితో పోటీ పడుతున్నారు.

అలాగే చేవెళ్లలో కాంగ్రెస్‌ పార్టీ తరఫున రంజిత్‌ రెడ్డి, బీజేపీ తరఫున కొండా విశ్వేశ్వర్‌ రెడ్డి పోటీ చేస్తున్నారు. విశ్వేశ్వర్‌ రెడ్డి కొన్నేళ్ల క్రితం బీఆర్‌ఎస్‌ను వీడగా, రంజిత్‌ రెడ్డి నెల రోజుల క్రితమే ఆ పార్టీని వీడి కాంగ్రెస్‌ లో చేరారు.

మెదక్‌ లో కాంగ్రెస్‌ పార్టీ తరఫున పోటీ చేస్తున్న నీలం మధు, బీజేపీ తరఫున పోటీ చేస్తున్న రఘునందన్‌ రావు ఇద్దరూ మొదట్లో బీఆర్‌ఎస్‌ లోనే ఉన్నారు. ప్రస్తుతం వారిద్దరూ బీఆర్‌ఎస్‌ అభ్యర్థి, మాజీ ఐఏఎస్‌ అధికారి వెంకట్రామిరెడ్డితో తలపడుతున్నారు.

ఇలా మల్కాజిగిరి, మెదక్, చేవెళ్ల, వరంగల్‌ నుంచి ఎంపీలుగా పోటీ చేస్తున్న ప్రధాన పార్టీల అభ్యర్థులందరికీ బీఆర్‌ఎస్‌ మూలాలు ఉండటం ఆసక్తి రేపుతోంది. ఇది అరుదైన విషయం అంటున్నారు. మరి వీరిలో గెలిచేది ఎందరో, ఓడేది ఎందరో. గెలిచాక ఆయా పార్టీల్లో ఉండేది ఎవరో, పోయేది ఎవరో తేలాల్సి ఉంది.

Tags:    

Similar News